Jaggaiah's performance is amazing....................
నటుడు కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క అల్లూరి సీతారామరాజు ఒక ఎత్తు. ఈ విషయాన్ని కృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు బ్రహ్మాండంగా సమకూరాయి . అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కొచ్చిన దశలో రామచంద్రరావు కనుమూశారు. అక్కడనుంచి కేఎస్ ఆర్ దాస్ సినిమాను పూర్తి చేశారు.
సినిమాలో రూథర్ ఫర్డ్ పాత్ర గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. కలెక్టరు రూథర్‌ఫర్డ్‌ని కొంత సౌమ్యుడిగా చూపారు.రూథర్ ఫర్డ్ కి అన్ని వ్యవహారాలపై అవగాహన వున్నట్టు, సీతారామరాజంటే గౌరవం కూడా వున్నట్టు డైలాగ్స్ ద్వారా చెప్పించారు.
అలాగే ఆ ఇద్దరు కలసినప్పుడు రామరాజును రూథర్ ఫర్డ్ మెచ్చుకున్నట్టు చూపించారు. అయినా ప్రభుత్వం మాట వినని రామరాజును చంపించినట్టు సినిమాలో చూపించారు.అసలు “రూదర్ ఫర్డ్” ఎలాఉంటాడో చాలా మందికి తెలీదు. ఆ పాత్ర మరీ కఠినంగా ఉంటే బాగుండదని జగ్గయ్య నిర్మొహమాటంగా చెప్పారట. అందుకే కొంత సౌమ్యంగా ఉన్నట్టు మార్చారట.
సీతారామరాజు చిత్రంలోఆ పాత్రకు నటుడు జగ్గయ్య ప్రాణ ప్రతిష్ట చేసాడు. తన కంచుకంఠం తో డైలాగులు చెబుతుంటే జనం సినిమాలో మమేకమైనారు. జగ్గయ్య వేషదారణ కోసం మేకప్ మ్యాన్ మాధవరావు చాలా కృషి చేశారు. నీలిరంగు కాంటాక్ట్ లెన్సులను అమర్చి బ్రిటిషు అధికారి రూపాన్ని తీర్చిదిద్దారు.జగ్గయ్య రూథర్ ఫర్డ్ ను మన కళ్ళముందు ఉంచారు. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. క్లైమాక్స్ లోని రామరాజు … రూథర్ ఫర్డ్ సంవాద దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి.
ఇక వాస్తవానికొస్తే రూథర్ ఫర్డ్ ఉద్యమాల అణచివేతలో ఆరితేరిన వాడు. పల్నాడులో పుల్లరి వ్యతిరేక ఉద్యమాన్ని కఠినంగా తొక్కేసాడు.
అప్పటికే అక్కడ విప్లవం ఆఖరిదశలో ఉంది.రామరాజు అనుచరగణం తగ్గిపోయాక, గ్రామాలను బూడిద చేసి, ప్రజలను భయభ్రాంతులను చేసాడని అంటారు. గిరిజనులను కష్టాలపాలు చేసి వారికోసం రామరాజు తనంతట తానే లొంగిపోయేలా వ్యవహరించారని చెబుతారు. అదలా ఉంటే రూథర్‌ఫర్డ్, రామరాజు ఎన్నడూ ఎదురుపడలేదు.
సినిమాలో మాత్రం రూథర్‌ఫర్డ్ మన్యానికి వచ్చి లంచగొండితనమే, వెట్టిచాకిరియే విప్లవానికి మూలకారణమని గ్రహించినట్టు చూపించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు టెలిఫోన్ తీగలు పెట్టించాడని చూపించారు.సంస్థానాధీశులనుండి సైనికులకు ఆహారపదార్థాలు తెప్పించాడని కథ అల్లారు.
నిజానికి ఇవన్నీ“బ్రాకెన్” కలెక్టర్ గా ఉన్నపుడు జరిగాయని అంటారు .1924 మే 7 న రామరాజు ఏటి ఒడ్డున కూర్చుని ఒక కోయవాడి ద్వారా పోలీసులకు కబురంపాడు. వాళ్లు వచ్చి కొయ్యూరుకు తీసుకెళ్లారు. అక్కడ గుడాల్‌కు, అల్లూరికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.దాంతో గుడాల్ గొలుసులతో చెట్టుకు కట్టించి, రివాల్వర్‌తో కాల్చి రామరాజు ను చంపారని అంటారు.
తర్వాత తమకు చెప్పకుండా రామరాజును కాల్చి చంపడం తో రూథర్‌ఫర్డ్ గుడాల్ పై మండిపడ్డారని చెబుతారు. ఇలా చంపినట్టు బయటకు వస్తే బ్రిటిష్ సర్కారుకి అవమానమని, పారిపోతూ వుంటే కాల్చామని స్టేటుమెంటు ఇప్పించారు. అయితే సినిమాలో ఇందుకు భిన్నంగా ఉంటుంది . ఆ సన్నివేశాలన్నీ అత్యంత నాటకీయంగా చిత్రీకరించారు.ఏది ఏమైతేనేమి సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. నటుడు కృష్ణ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.
మన్య ప్రాంతంలో జరిగిన వాస్తవాలు కాబట్టి కృష్ణ రాజీ పడకుండా యూనిట్ మొత్తాన్ని అక్కడికే తరలించి సినిమా తీశారు. అల్లూరి సీతారామరాజు ఈ మన్య ప్రాంతంలోనే గిరిజన ప్రజలతో కలసి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడారు. గిరిజన హక్కులను ,అటవీ సంపదను దోచుకుంటున్న బ్రిటిష్ సర్కార్ ను రెండేళ్ల పాటు గడగడ లాడించారు. చింతపల్లి…. మరికొన్ని పోలీసు స్టేషన్లను దోచుకున్నారు.
ఆయుధాలు తీసుకుపోయారు. సీతారామరాజు గురించి అనేక పుస్తకాలు, నాటకాలు, బుర్రకథలు వచ్చాయి.ఆయన అసలు పేరు శ్రీరామరాజు అంటారు. సీత పాత్ర కల్పితమని చెబుతారు. రామరాజు ఇమేజ్ మరింత పెంచేందుకు సినిమా కథలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి .అయితే ఆ పాత్ర ఔచిత్యం ఎక్కడా దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకున్నారు.
సీతారామరాజు షూటింగ్ కూడా చింతపల్లికి దగ్గరలోవున్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశనపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల ప్రాంతాల్లో జరిగింది. సినిమా యూనిట్ మొత్తం చింతపల్లి లోనే బస చేసింది. ఇక లంబసింగిలో సీతారామరాజు పేరు మీద ఒక పెద్ద పార్కు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ పార్కులో పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ విషయం మీరు చెప్పే వరకు అందరూ సినిమా నే నిజం అనుకున్నారు.
వాస్తవాన్ని తెలియజేశారు ధన్యవాదాలు
We still feel that Rutherfurd is a great personality. The picture has so much influence.