కోవిడ్ సోకిందా ? ‘గుండె’ను జాగ్రత్తగా చూసుకోండి !!

Sharing is Caring...

Dr.Yanamadala Murali Krishna………………………………

కొరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్ జబ్బులో… హాస్పిటల్ మరణాలలో ముగ్గురిలో ఒకరు రక్తం గడ్డ కట్టడం మూలంగానే చనిపోతున్నట్లుగా 2020  కొరోనా మొదటి వేవ్ లోనే గుర్తించారు. కోవిడ్ జబ్బులో శరీరమంతా విస్తృతమైన ఇన్ ఫ్లమేషన్ మూలంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ ప్రేరేపితం కావడాన్ని వైద్యశాస్త్రం గుర్తించింది. అయితే రక్తం అవసరం లేకుండా గడ్డ కట్టడాన్ని నిలువరించడానికి తగిన మార్గదర్శకాల సూచన జరగలేదు.

నిజానికి రక్తం గడ్డకట్టే అవకాశం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న అన్ని సందర్భాలలోనూ దీర్ఘకాలికంగా… ఇంకా చెప్పాలంటే జీవితాంతం ఏంటికొయాగ్యులంట్స్ ( బ్లడ్ థిన్నర్స్) ఇవ్వడం అనేది దశాబ్దాలుగా ప్రామాణిక చికిత్సగా కొనసాగుతున్నది. గుండె కవాటాలు( వాల్వ్స్ ) మార్పిడి చేసిన వారికి విటమిన్ కె ఆధారిత నికౌమలోన్, కౌమాడిన్ వంటి ఏంటికొయాగ్యులంట్స్, రక్తపోటు,  మధుమేహం (బి.పి,  డయాబెటిస్ ) వ్యాధిగ్రస్తులకు ఏస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులు వాడుతున్నారు.

మోకాలు,  తుంటి కీళ్లమార్పిడి చేసినవారికి ఫ్యాక్టర్ Xa ( టెన్ ఏ ) మీద పనిచేసే డాబిగట్రాన్, ఎపిక్సబాన్ వంటి ఇటీవల ఉనికిలోకి వచ్చిన ఖరీదైన మందులు ఇస్తున్నారు. కోవిడ్ జబ్బు దీర్ఘకాలికమైనది. జబ్బు నుండి బయటపడిన వాళ్ళు చాలా కాలం వరకు మామూలు మనుషులు కాకపోవడం మనందరం గమనిస్తూనే ఉన్నాము. రక్తం గడ్డకట్టడాన్ని కోవిడ్ జబ్బులో స్పష్టంగా గుర్తించినప్పటికీ దానిని తగిన ఈ విధంగా నిలువరించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు.

పెరిగినది మెరుగైనది అనే భావ దారిద్ర్యంతో  కొన్ని వారాల పాటు ఫ్యాక్టర్ Xa పైన పనిచేసే ఏంటికొయాగ్యులంట్స్ ఇస్తున్నారు. అయితే దీర్ఘకాలం ఇవ్వగలిగే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కలిగిన ఏస్పిరిన్ చౌకైనదే కాక… గుండెపోటు నివారణలో గొప్ప ప్రభావ వంతమైనదని  దశాబ్దాల పాటు రుజువు అయింది. ఇప్పటికే, కోవిడ్ జబ్బులో ప్రాథమిక నివారణ అనగా కొరోనావైరస్ బారిన పడే అవకాశం తగ్గించడంలో, సెకండరీ ప్రివెన్షన్ అనగా గడ్డు సమస్యల (కాంప్లికేషన్స్ ) ను తగ్గించడంలోనూ ఏస్పిరిన్ చక్కగా పని చేస్తున్నదని ఇజ్రాయెల్, అమెరికా పరిశోధనలు తేల్చి చెప్పాయి.

కొత్త మందుల వెంట పరుగులు తీసే వైద్య ప్రపంచం ఈ అంశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోదు అనే విషయం ఊహించ గలిగేదే. సాధారణంగా  వైద్య పరిశోధనలు సంవత్సరాలు దశాబ్దాలపాటు సాగి, మార్గదర్శకాలు ప్రామాణికం అవుతూ ఉంటాయి. అయితే కోవిడ్ వంటి కొత్త జబ్బు విషయంలో మందులను, వ్యాక్సిన్లను కాలయాపన లేకుండా త్వరగానే అందుబాటులోకి తెచ్చారు.

కాగా ఇటీవలికాలంలో ఒక మాదిరి నుండి తీవ్రమైన  కోవిడ్ జబ్బు నుండి బయటపడిన అనేక మంది గుండెపోటుకు గురై, కొన్ని గంటలలోనే ప్రాణాలను కోల్పోవడం తరచుగా చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం వారిలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఇంకా ఉత్తేజిత స్థితిలోనే ఉండటం, ఇన్ ఫ్లమేషన్ పూర్తిగా ఉపశమించక పోవడంగా చెప్పుకోవచ్చు.

కనుక ఒక మాదిరి లేదా తీవ్రమైన కోవిడ్ నుండి బయట పడిన వారికి బిపి, డయాబెటీస్, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ తదితర సమస్యలలో వాడే విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఏస్పిరిన్ 75 మిల్లీగ్రాములు మధ్యాహ్నం భోజనం తర్వాత రోజుకి ఒకటి చొప్పున వాడాలి. ఆ రకంగా, కోవిడ్ జబ్బు నుండి బయటపడిన వారిలో గుండె పోటును నివారించవచ్చు. కోవిడ్ జబ్బులో ఆస్పిరిన్ వాడకం యొక్క ప్రయోజనాలను గురించి విస్తృతంగా, అనేక అధ్యాయాలలో  ‘కోవిడ్ – ఎయిడ్స్ – నేను’  పుస్తకంలో చర్చించాను. చదవండి, సశక్తులు కండి. 

గమనిక: ఇది వైద్య సలహా కాదు, కేవలం అవగాహన కోసం మాత్రమే

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!