అసలు వివాదం ఏమిటి ?

Sharing is Caring...

జ్ఞానవాపి మసీదు.. అయోధ్యలో బాబ్రీ మసీదు తర్వాత అంత సంచలనంగా వార్తల్లో నిలిచిన మసీదు ఇది. కాశీ మహానగరంలో విశ్వేశ్వరుడి ఆలయానికి అనుకుని ఉన్నదీ మసీదు. 1669 లో కాశీలో గుడిని కూల్చిన ఔరంగజేబు ఆ స్థానంలో మసీదు కట్టారని కొందరు హిందువులు కోర్టు కెక్కారు.

అయోధ్య లో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నాటి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మరో రెండు మసీదుల గురించి మాట్లాడారు. వాటిలో ఒకటి ఈ జ్ఞానవాపి మసీదు. రెండోది మథురలో కృష్ణుడు జన్మించినట్టుగా చెప్పే స్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదు.

అయోధ్యలోని బాబ్రీ మసీదు 1991లో పీ.వీ నరసింహారావు హయాంలో తెచ్చిన ప్రార్థనా స్థలాల చట్టం’ పరిధిలోకి రాదు కాబట్టే అక్కడ రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.1947, ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని.. వాటిలో మార్పులు చేయకూడదని నిర్దేశించే చట్టమిది.

కానీ ఈ చట్టం చేసే సమయానికే అయోధ్యలో బాబ్రీ మసీదు వివాదంలో ఉన్నందున దాని విషయంలో ఈ చట్టం వర్తించలేదు.జ్ఞానవాపి, షాహీ ఈద్గా మసీదుల విషయంలో అలా కుదరదని వామపక్ష మేధావులు, చరిత్రకారులు అంటారు. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు వివాదమూ పెద్దదిగా మారుతోంది.

అసలు వివాదం ఏమిటి ?

2000 ఏళ్ల క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 1194లో మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నెజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చెబుతారు. తర్వాత 17 ఏళ్లకు 1211లో గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారి ఆ ఆలయాన్ని పునరుద్ధరించారు.

1447-1458 మధ్య హుస్సేన్ షా షర్కీ హయాంలో కూల్చివేసినట్టు కొందరు, 1489-1517 మధ్య సికందర్ లోఢీ హయాంలో కూల్చివేసినట్టు మరికొందరు చెబుతారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. అక్బర్ హయాంలో ఆయన సహకారంతో రాజా మాన్ సింగ్ కాశీలో ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ.. మాన్ సింగ్ తన కుమార్తెను ముస్లిం కుటుంబానికి కోడలుగా పంపినందునబ్రాహ్మణులు ఆ ఆలయాన్ని బహిష్కరించారు.

ఆ తర్వాత 1585లో రాజా తోడర్ మల్ అక్బర్ సాయంతో ఈ గుడిని ఆధునీకరించారు.ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1669 ఏప్రిల్ 4న కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి ఆ ఆలయ గోడల మీదుగా మసీదును నిర్మింపజేశాడు. ఔరంగజేబు సేనలు దండెత్తి వస్తున్నప్పుడు ఆలయంతోపాటు గర్భగుడిలోని విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేస్తారేమోననే ఆందోళనతో ఆలయ పూజారి ఆ శివలింగాన్ని పెకలించి గుడి ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపి (బావి)లో వేసినట్టు కొందరు.. ఆయన కూడా దూకి ప్రాణత్యాగం చేసినట్టు మరికొందరు చెబుతారు.

ఆ బావి పేరిటే ఈ మసీదుకు ‘జ్ఞానవాపి మసీదు’ అని పేరు వచ్చింది. ఆ మసీదు దక్షిణపు గోడ ను పరిశీలిస్తే రాతి శిలాతోరణాలు, చెక్కడాలతో అక్కడొక ఆలయం ఉందనే  విషయం అర్థమవుతుంది. ఆ గోడను స్థానిక ముస్లింలు ‘ఖిబ్లా(నమాజు చేసే దిశ) కుడ్యం’గా పరిగణిస్తారు. అయితే, ఔరంగజేబు రాజకీయ కారణాలతోనే ఈ ఆలయాన్ని కూల్చివేసినట్టు ఆ ప్రాంత జమీందార్లు, మత పెద్దలపై యుద్ధానికి దిగిన క్రమంలో ఇలా జరిగినట్టు మాధురీ దేశాయ్ వంటి చరిత్రకారులు పేర్కొన్నారు. 

ఔరంగజేబు విధ్వంసం అనంతరం 1698లో అంబర్ రాజు బిషన్ సింగ్ కాశీ పట్టణంలో తన సేనలతో సర్వే చేయించాడు. ఔరంగజేబు సేనలు ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మసీదును కట్టినట్టు వారు తమ నివేదికల్లో  పేర్కొన్నారు. 1700లో ఆయన వారసుడైన సవాయ్ జైసింగ్-2 మసీదుకు ముందు 150 గజాల దూరంలో ‘ఆది విశ్వేశ్వరుడి’ ఆలయాన్ని నిర్మించాడు.

1742లో మరాఠా సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ కాశీ ఆలయానికి పునర్వైభవం తేవాలని అనుకున్నారు.  అప్పటికి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న లఖనవూ నవాబుల వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.అనంతర కాలంలో ఆయన కోడలు అహిల్యాబాయ్ జుల్కర్ హయాంలో ఆ ప్రయత్నాలు ఫలించాయి.

అలా అప్పుడు కట్టిందే ప్రస్తుత కాశీ విశ్వనాథుడి ఆలయం. కొందరు ముస్లింల ప్రకారం.. అక్కడ ఉన్నది ఆలయం కాదు. అది అక్బర్ స్థాపించిన దీన్-ఇ-ఇలాహీ మతానికి చెందిన కట్టడమని, దాన్నే ఔరంగజేబు కూల్చేశాడని.. వారు చెబుతుంటారు.

ఆలయాన్ని కూలగొట్టి అక్కడ నిర్మించిన జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో కొత్తగా గుడి కట్టి, పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ 1991 అక్టోబరు 15న పండిట్ సోమ్ నాథ్ వ్యాస్, డాక్టర్ రామ్ రంగ్ శర్మ తదితరులు వారణాసి స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ, మసీదు తరఫున ‘అంజుమన్ ఇంతెజామియా మస్జిద్’ స్టే కోరుతూ హైకోర్టు గడప తొక్కింది. 1998 నుంచి ఆ కేసు పెండింగ్ లో ఉంది.

2019లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో విజయ్ శంకర్ రస్తోగీ తనను తాను విశ్వేశ్వరుడి స్నేహితుడిగా పేర్కొంటూ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించాల్సిందిగా కొత్త పిటిషన్ వేశారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు ఈ మేర కు ఉత్తర్వులిచ్చింది.

దీనిపై యూపీ సున్నీ సెంట్రల్ వక్స్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే ఇచ్చింది. ఇదిలా కొనసాగుతుండగా.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శృంగార గౌరి, గణపతి, హనుమంతుడి విగ్రహాలకు నిత్యపూజలు జరిపించే అవకాశాన్ని కల్పించాలంటూ విశ్వ వేదిక్ సనాతనసంఘ్ అనే సంస్థకు చెందిన ఐదుగురు ఢిల్లీ మహిళలు 2021లో కోర్టులో పిటిషన్ వేశారు.

దాన్ని విచారించిన జిల్లా సివిల్ కోర్టు జడ్జి రవికుమార్ దివాకర్ ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ, సర్వే నిర్వహించేందుకు ఒక కమిటీని, అడ్వకేట్ కమిషనర్‌ను నియమించారు. మే 3 నుంచి సర్వే, వీడియోగ్రఫీ ప్రారంభించి మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ సర్వేలోనే జ్ఞానవాపిలో శివలింగం బయటపడిందంటూ మహిళా పిటిషన్ దారుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే  వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) నుంచి వారాణసి జిల్లా జడ్జికి బదిలీచేసింది.ఈ వ్యవహారం సున్నితమైనది  కావడంతో అనుభవజ్ఞుడైన సీనియర్‌ న్యాయాధికారి విచారణ జరపడం మంచిదని వ్యాఖ్యానించింది. మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు సంబంధించిన విషయాలను  మీడియాకు లీకులివ్వడం ఆపాలని సుప్రీంకోర్టు పేర్కొంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!