జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి.
ఇక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. ఇక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే జూన్ మాసం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజులంతా ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఏడాదిలో రెండు నెలల వ్యవధిలో మాత్రమే ఈ మార్గం తెరిచి ఉంటుంది. వాతావారణ పరిస్థితులు ఆధారంగా దర్శనం రోజులు నిర్దేశిస్తారు.
పరమ శివుడు పంచ భూతాల్లో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమరనాథ్ గుహలో ఉన్న శివుడు జలరూపంలో ఉన్నాడని ప్రజలు నమ్ముతారు. ఈ గుహ లోపల నీటి చుక్కలతో ఏర్పడే మంచు గడ్డ శివలింగాన్ని తలపిస్తుంది.
ఈ మంచు లింగాన్ని దర్శించడానికి ఏటా 5-6 వేలమంది భక్తులు వెళ్తుంటారు. 2011లో రికార్డు స్థాయిలో 6 లక్షల మంది పైగా సందర్శించడం విశేషం. రైలు లేదా బస్సుల్లో వచ్చేవారు జమ్ములో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కి. మీల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిమీల దూరంలో ఉన్న పహల్గామ్‌కు చేరుకోవాలి.
బల్తాల్ నుంచి అమరనాథ్‌కు చేరుకోవాలంటే ఒకటి నుంచి రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాలి. పహల్గామ్ నుంచి వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కి. మీలు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్‌కు సుమారు 3 నుంచి 5 రోజులు సమయం పడుతుంది.ఇక్కడ ప్రయాణం అత్యంత కష్టంగా ఉంటుంది. మార్గ మధ్యం లో రాత్రి బస, భోజన సదుపాయం ఉంటుంది.
ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో 1991 – 1995 మధ్య ఈ యాత్రపై ప్రభుత్వం నిషేదం విధించింది. 1996లో ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని భావించి మళ్లీ యాత్ర కు అనుమతి ఇచ్చింది. 2017 జులై 10న అమరనాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 1990లో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. 1996లో 250, 2012లో 130 మంది చనిపోయారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుని కొండలను ఎక్కగలిగే శక్తి ఉన్నవారు మాత్రమే ఈ యాత్ర కు వెళ్లడం మంచిది.
ఉన్ని దుస్తులు, తగిన ఆహారం వెంట తీసుకెళ్లాలి.ఈ అమర్ నాథ్ గుహకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. పలు ఆసక్తికరమైన కథనాలు ప్రచారం లో ఉన్నాయి. శివుడు తన మూడో కన్ను తెరవడం వల్ల వచ్చిన అగ్ని ద్వారా ఈ గుహ ఏర్పడిందని చెబుతుంటారు. శివుడు.. పార్వతీ దేవికి ‘అమరత్వం’ గురించి వివరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి ‘అమరనాథ్’ అని పేరు వచ్చింది. శివుడు చెప్పే ‘అమరత్వం’ రహస్యం వినేవారికి మరణం ఉండదు. అందుకే ఆయన ఎవరూ దరిచేరలేని ఈ గుహను ఎంపిక చేసుకున్నారని చెబుతారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతన గుహల్లో అమరనాథ్ గుహ ఒకటి. దాదాపు 5వేల ఏళ్ల కిందట ఈ గుహ ఏర్పడిందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక్కడ శివలింగం దానికదే పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ లింగాన్ని ‘స్వయంభూ లింగం’ అని అంటారు.
ముందే చెప్పుకున్నట్టు లోతైన లోయల మీదుగా, ఇరుకు దారుల వెంట, పర్వతాల్ని అధిరోహిస్తూ, ఎముకలు కొరికే చలిలో కాలినడకన, గుర్రాలపై సాగే ఈ ప్రయాణం సంక్లిష్టమైంది. అమరనాథుడిపై ఉన్న భక్తి, అచంచల విశ్వాసం, స్వామిని దర్శించాలనే బలీయమైన ఆకాంక్ష ఉంటేనే ఈ యాత్ర సాగుతుందని భక్తుల నమ్మకం.
అమరనాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు ముందుగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రప్రభుత్వ పర్యాటకశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలి. మంచుకొండల్లో, ప్రతికూల వాతావరణంలో ఈ యాత్రను చేపట్టాలి. అందుకు తగిన శారీరక సామర్థ్యం తమకు ఉన్నట్టుగా యాత్రికులు వైద్యుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని పర్యాటక శాఖకు సమర్పించాలి.