ఆయన అలా ఇరుక్కుపోయారా ?

Sharing is Caring...

The story behind the song ………………………………

“ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను… 
నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను… 
చక్కని చుక్కల పక్కనా..ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను… 

అహా..అబ్బా..అమ్మో…అయ్యో “…. అక్కినేని నాగేశ్వరరావు  హీరోగా నటించిన ఆలుమగలు చిత్రం లోనిది ఈ పాట.ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ (పీఏపీ)వారు నిర్మించిన చిత్రం. తాతినేని రామారావు దర్శకుడు. తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. ఆ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు వాళ్ళే చేశారు.

పైన రాసిన పాట వెనుక ఒక కథ ఉంది. ఒక రోజు దర్శకుడు రామారావు రచయిత దాశరథిని పిలిపించారు. హీరో నాగేశ్వరరావు మోహమోటం కొద్దీ చక్కని చుక్కల చేతికి చిక్కుతారు. ఆ సందర్భంగా అతను పడే అగచాట్లను శృంగార పరంగా రాయాలి. వెంటనే రాసివ్వండి అన్నారట. దాశరధి గారు కొంత మేరకు ప్రయత్నించారు.

కానీ  రామారావు,చలపతిరావులు సంతృప్తి పడలేదు. ఇదేదో మీరు చూడండి అంటూ వేటూరి కి ఆ బాధ్యత అప్పగించారు. వేటూరి మాస్టారు కూడా దాదాపు 9 పల్లవులు వినిపించాడు. ఉహూ ఒక్కటి కూడా మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావుకి నచ్చలేదు. ఇక్కడ చలపతిరావు గురించి రెండుమాటలు చెప్పుకోవాలి. ఆయన కూడా మంచి కవి,రచయిత,విమర్శకుడు… ఆయనకు నచ్చితేకానీ పాటకు బాణీ కట్టడు.

కాబట్టి ముందుగా రచయితలు  చలపతిరావును ఒప్పించాల్సి వచ్చేది. మరో పల్లవి వినిపించారు. చలపతిరావు పెదవి విరిచారు. దాంతో విసిగిపోయిన వేటూరి మాస్టారు “అయ్యా … ఎరక్కపోయి వచ్చాను .. ఇరుక్కుపోయాను … వదిలేయండి .. శెలవు”  అన్నారు. దాంతో చలపతిరావు వెంటనే “అబ్బా .ఇదేనయ్యా పల్లవి … దీనికి చరణాలు రాయి”అన్నారు. ఇక దూసుకు పోయారు వేటూరి.

ఇలా ఒక్కోసారి పాటకు సరైన పల్లవి దొరక్క రచయితలు చాలా ఇబ్బంది పడుతుంటారు.  వేటూరి రాసిన ఈ పాట సూపర్ హిట్ అయింది. అప్పట్లో ఎక్కడ కెళ్ళినా ఈ పాటే వినబడేది. ఆ పాట లో చరణాలు ఇలా సాగుతాయి “…. ఒక్కరి కోసం.. నే వచ్చానూ.. నా ఒక్కడి కోసం..హే..మీరొచ్చారు. ఒక్కరి కోసం.. నే వచ్చానూ.. నా ఒక్కడి కోసం..హే..మీరొచ్చారు.. ఎందరో సుందరాంగులు.. అందరికీ అభివందనాలు.” బాలు ఈ పాట పాడారు.

బాలు కి  ఈ పాట పాడే ముందు చలపతి రావు ఒక సలహా ఇచ్చారు. ఇది అక్కినేనికి పాడుతున్న పాట కాబట్టి స్వరం లో మార్పు ఉండాలి. నువ్వు నీలా పాడకూడదు. అక్కినేని పదాలు ఎలా పలుకుతారో స్టడీ చేయి. పదాల్లో ఆ విరుపులు .. మెరుపులు ఉండాలి అని సూచించారు. అంతకు ముందు కేవీ మహదేవన్ కూడా ఇదే సలహా ఇచ్చారు.

హీరోలు కృష్ణ .. శోభన్ బాబు ల  విషయంలో అదే పాటించి బాలు సక్సెస్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిలు తర్వాత అక్కినేనికి పాడే చాన్సు కావడంతో బాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.  అక్కినేనే స్వయంగా పాడారా అనేలా బాలు పాడి మెప్పించారు.

రెండురోజులు ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ చేశారు. తర్వాత అక్కినేని కూడా ఆ పాట విని బాలు బాగా పాడారే అన్నారట. ఆలుమగలు చిత్రంలో ఎరక్కపోయి పాట తో పాటు చిగురేసే మొగ్గేసే పాట కూడా అక్కినేనికి బాలూయే పాడారు. ఇక అక్కడ నుంచి అక్కినేని పాటల్లో ఎక్కువ బాలూ యే పాడారు.  

(వేటూరి జ్ఞాపకాల నుంచి కొంత సమాచారం)

———KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!