ఆయన ఎన్టీఆర్ అభిమానా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………….

కామ్రేడ్ ఆర్కే ను నేరుగా కల్సిన సందర్భాలు కొన్ని మాత్రమే … కల్సిన ప్రతి సందర్భంలోనూ ప్రేమగా పలకరించేవాడు.నా మీద ఆయన నిఘా ఉండేది. అప్పుడు నాకు ఆయన నాయకుడు. నేనేమైపోతానో అనే ఆదుర్దా ఉండేది.

నా అరాచకత్వాన్ని చాలా సార్లు క్షమించేశాడాయన. బయట ఉండడం కుదరదు … నువ్వు అరెస్ట్ అయిన ప్రతిసారీ బెయిల్ పెట్టడం అంతకంటే కుదరదు … కనుక నువ్వు లోపలకి వచ్చేయ్ అని ఆదేశించారోసారి.
నేను అడవికి రానంటే రానన్నాను. ముందైతే రా … తర్వాత చూద్దాం అని తీసుకెళ్లారు. అలా అడవికి వెళ్లిన వారం లోపే ఒక ఎన్ కౌంటర్ … నేనున్న ప్రాంతానికి అతి సమీపంలో … చంద్రవంక దిబ్బల మీద ఎన్ కౌంటర్.

ప్రసాద్ మాధవి పెళ్లి జరిగిన మర్నాడు జరిగిన ఎన్ కౌంటర్ అది. ఒక్కటిగా ముందుకు సాగుదామనుకున్న వారిద్దరూ ఆ ఎన్ కౌంటర్ లో అమరులు కావడం … ఎప్పుడు తల్చుకున్నా మనసు బాధగా మూలుగుతుంది.అక్కడే అప్పుడే కామ్రేడ్ ఏసు కన్నుమూయడం మరో భయానక విషాదం. ఈ విషాద వార్త క్రిష్ణానది మీద జాలర్లు మాకు మోసుకొచ్చే సరికి … గణేష్ విలవిల్లాడిపోయాడు.

అందులో … మాస్టారు అదే శ్రీనివాస్ కూడా ఉన్నాడని మాకు తెల్సు.ఆయన కూడా చనిపోయారా అని భయపడిపోయాం.గణేష్ ను ఓదార్చడం నా వల్ల కాలేదు. నాకంటే అతనికి ఆయనతో ఉన్న రిలేషన్ ఎక్కువ. ఆ సాయంత్రానికి శ్రీనివాస్ క్షేమమే అని సమాచారం వచ్చింది. చనిపోయింది జెఎన్ఎమ్ సత్యంగా అందరికీ తెల్సిన ఏసు అని తెల్సింది.

నిజానికి శ్రీనివాస్ కంటే సత్యంతో నా అనుబంధం ఎక్కువ. నేను తనూ కల్సి జననాట్యమండలి కళాకారులకు అప్పట్లో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల రోజులు గుర్తొస్తాయి తనను ఎప్పుడు తల్చుకున్నా …

సైలెంట్ గా ఉండి ఎప్పుడు ఎలా రియాక్ట్ కావాలో అప్పుడు అలా రియాక్ట్ కావడం సత్యం ప్రత్యేకత. దేనికీ ఖంగారు పడడం ఆయనకు తెలియదు. అలా చంద్రవంక ఎన్ కౌంటర్ లో ప్రసాద్ మాధవి సత్యమన్న అమరులైనారు.

గుంటూరు జిల్లా అంతా సత్యం ప్రభావం ఉండేది … అందరిలోనూ ఒక రకమైన బాధ …ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ఈ ఎన్ కౌంటర్ జరిగిన నెల తర్వాత అడవిలోనే జరిగిన ఓ సమావేశంలో నేనూ శ్రీనివాస్ గారూ స్పీకర్లం.

నేను ముందుగా చంద్రవంక ఎన్ కౌంటర్ ను ప్రస్తావిస్తూ జరిగిన విషాదాన్ని మాట్లాడుతూ … నెమ్మదిగా … ఒక చేత్తో కన్నీరు తుడుచుకుని ఇంకొక చేత్తో ఎర్ర జండా ఎత్తుకుని అన్నట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం గురించి మాట్లాడి ముగించాను. మీటింగ్ అయ్యాక భోజనం చేస్తున్నప్పుడు నాకు మాత్రమే వినిపించేలా దగ్గరకు వచ్చి అన్నారు శ్రీనివాస్ …

“నువ్వు మాట్లాడడం మొదలెట్టాక నాకు భయం వేసింది … సత్యాన్ని తల్చుకుని ఏడ్చేస్తావేమో అని …
జనానికి ప్రేరణ కావాల్సిన ఆయన మరణం భయం కలిగించేది అవుతుందేమో నువ్వు అలా చేస్తావేమో అని తెగ భయపడిపోయాను తెల్సా? మొత్తానికి బాగా టర్న్ చేసి ఇన్స్ పిరేటివ్ టోన్ తోనే ముగించావు … చాలా థాంక్స్ బాబూ … నువ్విక్కడే ఉండిపోకూడదూ “ అన్నారు.

టీ సినిమాలూ ఇడ్లీలూ లేకుండా నా వల్ల అవదు కదా .. ఇప్పటికే నెల గడిచిపోయింది ఇక్కడ అన్నా …
సర్లే ఇంకో నెల ఉండు ఈ లోగా ఆలోచిద్దాం అని వెళ్లిపోయాడాయన. ఆయన మాట వినకుండా అడవి నుంచీ బయటకు వచ్చా … వచ్చీ రాగానే అరెస్ట్అయ్యా … ఎనిమిది కేసులు పైగా పెట్టి లోపలకి తోసేశారు …
ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మళ్లీ క్రిష్ణానది ఒడ్డునే … ఏమిటి పరిస్తితి? అని మళ్లీ మొదటి ప్రశ్నే.నేను బయటే ఉందామనుకుంటున్నా … ఏదో ఉద్యోగం చేసుకుంటూ … వైవాహిక జీవితంలోకి వెళ్లాలనుకుంటున్నా అన్నా ..

‘సరే నీ కర్మ’ అన్నారాయన. సరే నీ పెళ్లికి బహుమానం ఏం పంపమంటావ్ ? అన్నారు. అప్పుడే అన్నా కరెనీనా తెలుగు అనువాదం రీప్రింట్ వచ్చింది మార్కెట్ లోకి … అది పంపనా అన్నారు.అలాగే అన్నా … ఆయన అదే పంపారు. అప్పటి మా గుంటూరు జిల్లా నాయకుడు మాత్రం జానకి విముక్తి మూడు భాగాలూ పంపారు. జానకి విముక్తి ప్యాకట్ విప్పి చూసిన నాకు చాలా నవ్వొచ్చింది.

ఇలా పెళ్లై జీవితంలో పడ్డాక మళ్లీ ఓ సారి కల్సారు. అప్పుడు ఓ పని అప్పచెప్పారు. అది కొంచెం ప్రమాదకరమైనదే … దాదాపు శత్రు శిబిరంలోకి వెళ్లి రావడం లాంటిది … సరే అని బయల్దేరాను. మర్నాడు సాయంత్రం కలుద్దాం అనుకున్నాం. నేను రాలేకపోయాను. నేను అరెస్ట్ అయి ఉంటాననుకున్నారాయన.

అప్పుడు నేనూ కవి మిత్రుడు అనామకుడూ తెల్లారి లేస్తే రాత్రి పడుకునే వరకూ కల్సే తిరిగేవాల్లం… తన దగ్గరకు పోయి వాకబు చేశారు. నేను రాలేదు అని తెల్సుకుని … అతనితో అన్నారట …అనవసరంగా వీణ్ణి చేతులారా అరెస్ట్ చేయించినట్టున్నానయ్యా నేను .. చాలా బాధగా ఉంది … ఇప్పటికే గణేష్ జైల్లో ఉన్నాడు … ఇప్పుడు వీడ్ని కూడా పంపేశాను నిన్న నేను ఇలా ఆలోచించలేదు … అని చాలా బాధ పడ్డారట …

మర్నాడు ఉదయం వచ్చాను నేను. అప్పుడు అనామకుడు చెప్పాడు మాస్టారునిన్న రాత్రి నిన్ను అనవసరంగా ఇందులో ఇరికించానని చాలా బాధ పడివెళ్లారు అని … పని అయిపోయిందని చెప్పాను ఆయన కల్సినప్పుడు …చాలా థాంక్స్ బాబూ … సారీ నేను నిన్ను అనవసరంగా ఇందులోకి లాగేనేమో అని రాత్రంతా బాధ పడుతూనే ఉన్నాను.పోనీలే ఉంటా అని వెళ్లిపోయారు.

ఆ తర్వాత మళ్లీ చర్చలప్పుడు కలవడమే.విపరీతమైన ప్రేమ కన్సర్న్ చూపించేవారు. ఆయన ఎర్లీడేస్ లో పన్జేసిన గామాలపాడు ప్రాంత ప్రజలకు ఇప్పటికీ ఆయన మీద ఎంత ప్రేమో చెప్పలేం. ఎప్పుడు ఆ ఊరు వెళ్లినా ఆయన ఎలా ఉన్నాడు అని అడిగేవాల్లే …

ఆయన గురించి మాట్లాడేవాళ్లే. జనం ప్రేమను ఇంతగా చూరగొన్న నాయకులు అరుదు. ఆయన్ని విప్లవంలోకి రా అని ఎవరూ పిలవలేదు … ఆయనంతట ఆయనే వచ్చారు. తమ గ్రామంలోకి వచ్చిన ‘గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ దళం’ వారిని కల్సి నాకు మీ రాజకీయ అభిప్రాయాలు నచ్చాయి నేనూ మీతో నడుద్దామనుకుంటున్నా అంటూ కాలు కలిపారాయన.

అప్పటికి మాచర్లలో ప్రైవేట్లు చెప్పేవారాయన. ఆయన దళాన్ని కల్సింది కూడా మాచెర్ల రైల్వే స్టేషన్ లోనే.ఉద్యమంలోకి ఎలా రావాలో అలా వచ్చారు … ఒక ఉద్యమకారుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు.
అలాగే వెళ్లిపోయారు.

ఆయన ఉన్నాలేకున్నా ఆయన కలిగించిన స్ఫూర్తి నడిపిస్తూనే ఉంటుంది. సత్యమన్నను తల్చుకుని ఏడ్చేస్తావేమో జనాన్ని భయపెడతావేమో అని నేనెంత భయపడ్డానో తెల్సా అని ఆయనే అన్నట్టు ఇప్పుడు ఆయన గురించి ఏడవడం కాదు … అయనే అన్నట్టు ఆయన చెప్పిన నేర్పిన ఆశయాల మేరకు జీవిస్తే చాలు … అనుకుంటున్నా..

మా ఇద్దరికీ ఓ కామన్ పాయింట్ ఉండేది. అదేమిటి అంటే ఆయన నేనూ ఇద్దరం NTR ఫాన్స్.
ఓ సారీ జగ్గయ్యపేట నుంచీ లోపలికి చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇద్దరం NTR సినిమాల గురించిన విశేషాలు మాట్లాడుకుంటూ ఎలా చేరామో తెలియకుండ గమ్యం చేరిపోయాం.
(శ్రీనివాస్, మాస్టారు, ఆర్కే ఇవన్నీ ఆయనే అక్కిరాజు హరగోపాల్ )

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!