చిరు ఇంకా కాంగ్రెస్ వాదేనా ?

Sharing is Caring...

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తోనే ఉన్నారని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు  తంటాలు పడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని వ్యాఖ్యానించగా …  కాదు కాదు చిరు కాంగ్రెస్ తోనే ఉన్నారని అధ్యక్షుడు శైలజానాథ్ అంటున్నారు.కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు ,పేదలకు చిరు సేవలు అందిస్తున్నారని… ఆయన కుటుంబం అంతా కాంగ్రెస్ తో ఉందని శైలజానాథ్ అంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని  మీడియా వార్తలు రాయడం దారుణమని శైలజానాథ్ ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో చిరు సేవలు పార్టీకి అందుతాయని ఆయన అంటున్నారు.

శైలజానాథ్ ప్రకటన ను పరికించి చూస్తే ఆయన రాజకీయాలను ఫాలో కావడం లేదని అనుకోవాలి. ఇపుడు చిరు సేవా కార్యక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే కానీ 2019 ఎన్నికల్లో.. అంతకు ముందు 2014 లో కానీ ఎక్కడైనా  చిరు పార్టీ తరపున ప్రచారం చేశారా ? లేనే లేదు. ప్రచారం సంగతి వదిలేస్తే .. ఏదైనా కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్నారా ? అంటే అదీ లేదు. ఇప్పుడంటే సేవా కార్యక్రమంలో ఉన్నారు . మరి అప్పుడెందుకు ప్రచారంలో పాల్గొన లేదని అంటే చిరుకి ఇష్టం లేకనే అని అర్ధం చేసుకోవాలి. అసలు మొదటినుంచి చిరు కాంగ్రెస్ వాది కాదు. అయన సొంత పార్టీ పెట్టారు. దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆయన తమ్ముళ్లు జనసేన పార్టీని నడుపుతున్నారు. ఈ క్రమంలో కుటుంబం అంతా కాంగ్రెస్ తో ఉన్నట్టు ఎలా అవుతుంది. ఇక ఏడేళ్ల నుంచి కాంగ్రెస్ ఊసే ఎత్తని చిరు కాంగ్రెస్ లో ఉన్నాడని శైలజానాథ్ ఎలా చెబుతున్నారో ఆయనకే తెలియాలి. చిరు పార్టీ కి రాజీనామా చేయలేదు కాబట్టి పార్టీలోనే ఉన్నట్టు భావిస్తూఉండొచ్చు. 

2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరు  పలుసందర్భాల్లో మళ్ళీ రాజకీయాల్లోకి రానని స్పష్టంగా చెప్పారు. గత ఏడాది చివరిలో హీరోయిన్ సమంత నిర్వహించిన  సామ్ జామ్  షోకు వచ్చిన చిరంజీవి అక్కడ రాజకీయాలపై తన మనసులో మాట చెప్పేసారు. తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప మరో లోకం లేదని చిరు కుండబద్దలు కొట్టారు. తమ్ముడు జనసేన పార్టీతో కలిసే ఆలోచనలు కూడా లేవని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో ఉన్న 10 సంవత్సరాలలో చాలా విషయాలు తెలుసుకున్నానని.. పాలిటిక్స్‌ తనకు సరిపడవని అర్థమైపోయిందని చెప్పారు మెగాస్టార్. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన చిరు.. ఇకపై రాజకీయాల జోలికి పోనని కన్ఫర్మ్ చేసారు.  మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని ఉందని కూడా ఆయన అందరికి అర్ధమయ్యేలా వివరించారు. 

అయినప్పటికీ అభిమానులు చిరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని ఆశాభావంతో ఉన్నారు. కొందరు చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఆ మధ్య ఓ జాతీయ పార్టీ చిరంజీవి కోసం ప్రయత్నించిందని.. రాజ్యసభ సీట్ ఆఫర్ చేసిందనే వార్తలు ప్రచారంలో కొచ్చాయి. తాజాగా వైసీపీ కూడా ఆఫర్ చేసిందని కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి చిరు పని చేస్తారనే వార్తలు ఎన్నో సార్లు వచ్చాయి. వస్తున్నాయి. అందువల్ల అభిమానులు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు. ప్రస్తుతం చిరు అటు జగన్ తో ఇటు కేసీఆర్ తో కంఫర్టుబుల్ గా ఉన్నారు.  శైలజా నాథ్ మాటల పై చిరు స్పందన లేదు. ఇక చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు.  కాబట్టి అందరూ ఆయనను మావాడే అని చెప్పుకోవచ్చు. అందులో తప్పేమి లేదు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ చిరుతో ఒక స్టేట్ మెంట్ ఇప్పిస్తే అందరికి క్లారిటీ వస్తుందిగా. లేదంటే చిరు యే చెప్పాలి.

——–KNMURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!