Bharadwaja Rangavajhala ……………………….
చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి.
చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం అనేదేదైతే ఉందో అదే దర్శకుల కుట్రన్నమాట . వారిలో పి.పుల్లయ్య ఒకరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రేమించి చూడు సినిమా లో ఓ చక్కటి చలి పాట రాశారు దాశరథి. దానికి మాస్టర్ వేణు చక్కటి చలి స్వరం కూర్చారు. “వెన్నెల రేయి…ఎంతో చలీ చలీ…వెచ్చని దానా రావే నా చెలీ.”..ఎంత హాయైన గీతమది.
తొలి నాళ్లలో అక్కినేని నాగేశ్వరరావు మీదే ఎక్కువ చలి పాటలు నడిచేవి. అప్పటికి ఆయనే రొమాంటిక్ కింగ్ కావడమే కారణం. అక్కినేని వారి పర్మనెంట్ బ్యానర్ జగపతీ వారి ఆస్తిపరుల్లోనూ ఓ చలి గీతంలో అభినయించారు ఎఎన్నార్. అక్కినేనికి జోడీగా జయలలిత నర్తించిన ఈ గీతాన్ని ఆచార్య ఆత్రేయ రాశారు. ” చలి చలి చలి వెచ్చని గిలి “అంటూ ఆస్తిపరులులో ఉంటుంది కదా … అదన్నమాట.
ఇహ పోతే … రొమాంటిక్ కారక్టర్లు చేయడంలో అక్కినేని తర్వాత నేనే అని చెప్పిన శోభన్ బాబు కూడా సోగ్గాడులో ఓ చలిపాటలో చింపేశారు. అక్కినేనికి దసరాబుల్లోడు ఎలాగో శోభన్ కు సోగ్గాడు అలా. దసరాబుల్లోడు వి.బి.రాజేంద్రప్రసాద్ ను డైరక్టర్ గా నిలబెడితే … సోగ్గాడు బాపయ్యను పెద్ద దర్శకుణ్ణి చేసింది. “చలివేస్తోందీ చంపేస్తోందీ” … అంటూ వణికిపోతారేమిటో?
ఎనభై దశకం ప్రారంభంలో ఎన్టీఆర్ కు కొత్త కలర్ ఇచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ ప్రయత్నాలు ప్రధానంగా కోవెలమూడి ఫ్యామ్లీ నుంచే జరగడం విశేషం. ఎదురులేని మనిషిలో బాపయ్య ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని అడవిరాముడుతో రాఘవేంద్రరావు పీక్స్ కి తీసుకెళ్లారు. మామ మహదేవన్ స్వరపరచిన వేటూరి వారి చలి గీతం అడవిరాముడులో వినిపిస్తుంది.
అసలే అడవిలో చలెక్కువ…మరి అంతటి చలిలో ఆరేసుకోబోయి పారేసుకుంటే పడే కష్టమేమిటో చెప్పారు రాఘవేంద్రరావు. అన్నగారి సన్నిహితుడు నందమూరి రమేష్ దర్శకత్వంలో కానూరి రంజిత్ కుమార్ నిర్మించిన మా ఇద్దరి కథలోనూ ఎన్టీఆర్ చలి పాట వినిపిస్తుంది.” చలి చలిగా ఉందిరా ఒయ్ రామా ఒయ్ రామా” అంటూ రచన సాగుతుంది. ఆత్రేయ ఎన్టీఆర్ కోసం రాసిన చలిగీతం ఛాలెంజ్ రాముడులో ఉంటుంది.
అడవి రాముడు పెయిర్ నే రిపీట్ చేస్తూ…తాతినేని ప్రకాశరావుగారి సారధ్యంలో రూపొందిన ఛాలెంజ్ రాముడులో “చల్లగాలి వీస్తోంది” పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు అదరగొట్టేస్తాడు. అసల ఎన్టీఆర్ వేస్తేనే స్టెప్పులు అనేంతగా ఉండేవా అడుగులు .. అయ్యబాబోయ్ … వేటూరి ఇష్టపడే సంగీత దర్శకుల్లో ఎమ్మెస్ విశ్వనాథన్ ఒకరు. విఠలాచార్య రోజుల నుంచి జానపదాలకు విశ్వనాథన్ తో సంగీతం చేయించుకునే సంప్రదాయం ఉంది.
తమిళ్ లో ఎమ్జీఆర్ కత్తి పట్టిన చిత్రాలకు ఆయనే సంగీత దర్శకుడు కనుక ఇక్కడా అదే జరిగింది. అయితే జానపదాలు ఆగిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన సింహబలుడులో వేటూరి వారి మరో చలి గీతం వణికిస్తుంది. టిపికల్ ఎమ్మెస్వీ ట్యూన్ చూడండి. ” ఓ చెలీ చలీ గిలీ.” .. అని సింహబలుడు వణికిపోతాడు పాపం … ఎయిటీస్ లో ఆడియన్స్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న జంట ఎన్టీఆర్ శ్రీదేవి.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో జనాలను ఉర్రూతలూగించేస్తున్నా అనుకుంటూ పరమ దుర్మార్గమైన పాటలు తీశారు దర్శకేంద్రుడు మహానుభావుడు రాఘవేంద్రుడు. చక్రవర్తి వేటూరి సలీం తెరవెనుక కసరత్తు చేసేవారు. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు మూవీలో “శీతాకాలం వచ్చింది రామారామా” అంటూ ఓ చక్కని చలిగీతాన్ని అభినయించారు యుగపురుసుడు ఎన్టీఆర్.
రొమాంటిక్ శోభన్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా జయసుధకి ఓ రికార్టు ఉంది. ఆ లిస్టులో బంగారు చెల్లెలు ఒకటి. అందులో మహదేవన్ స్వరబద్దం చేసిన చలి గీతం వేటూరి వారి తలపుల్లో పురుడు పోసుకుంది.” చలీ జ్వరం…ఇది చలి జ్వరం “అంటూ సాగుతుంది పాట. ఆ తర్వాతెప్పుడో….వేటూరే రాశారు…”అసలే చలి యుగం…మొదలే…చెలి శకం” అంటూ….చలి చెలి మధ్య ప్రాసకుదిర్చిన సినీ శ్రీనాధుడాయన.
చలిలో రెండు రకాలు…శీతాకాలంలో పులిలా మీద పడే చలి ఒకటైతే…వానాకాలంలో ముసురేసిన సందర్భంలో ఒంట్లో సన్నటి వణుకు పుట్టించే చలి రెండోది. “గుండెల్లో ఎండేసే శీతాకాలంలో నీ సాయం కావాలి” సాయం కాలంలో అన్నవేటూరి వారే…చలికి అర్ధాలు వెతికే పనిలో పడతారు. “పెనుగులాడి పెనవేసుకునే…ఆకలంతా చలి కాబోలు” అని అర్ధం చెప్పుకుంటాడు.పాటలు తీయడంలో జంద్యాల చాలా ఎక్స్ పర్ట్ టెక్నీషియన్. అభిరుచి ఉన్న ప్రేక్షకుల మనసుల్ని తట్టేలా తెర మీద పాటను ఆరబోస్తారాయన.
రాజన్ నాగేంద్ర తో మూడుముళ్లు చిత్రం కోసం ఓ రొమాంటిక్ చలి పాటకు బాణీ కట్టించారు జంధ్యాల. చలి కాలపు సాయంత్రాన్ని సాకుగా చూపెట్టి సఖుడ్ని తన వాణ్ణి చేసుకోచూసే ఓ సొగసరి మనో చిత్రం ఈ గీతం “లేత చలిగాలులో” అంటూ చలిపుట్టించారు వేటూరంకుల్ . తెలుగు సినిమాల్లో ఫేమస్ చలి గీతం రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చింది. కీరవాణి స్వరం కట్టిన ఈ గీతంలో సిరివెన్నెల కవితా ధార నిజంగానే చలి పుట్టించేస్తుంది.
“చలి ఆగనిదీ…రేగినదీ…సరసకు రావా” అంటూ చలి తత్వాన్ని జనాలకు అర్ధం చేయిస్తారు సీతారామశాస్త్రి. క్షణక్షణం కోసం శ్రీదేవి కిర్రెక్కించిన ఈ చలి పాట చూసేయండి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చలిపాటల్లో మనసుకు ఆహ్లాదంగా తాకే గీతం మిష్టర్ పర్ఫెక్ట్ లో కనిపిస్తుంది. చలి నిలువనీయదు. చలి మంటలు వేస్తారు గానీ…అవి చాలవని ప్రఖ్యాత పరిశోధకుడు ఆరుద్ర ఏనాడో తేల్చేశారు. చలి మనసు లోపల దాచేసుకున్న భావాలన్ని బయటకు లాక్కొచ్చేస్తుంది. అప్పటికప్పుడు చేసేయమంటుంది…చాలా ఖంగారు పెట్టేస్తుంది.