రావిశాస్త్రిని ఇంటర్వ్యూ చేద్దామని విశాఖ వెళ్లాను. “అబ్బో! శాస్త్రి గారినే! ఆయన్ను పట్టుకోవడమే కష్టం. పట్టుకున్నా ఒక చోట కూచోబెట్టడం అంతకన్నా కష్టం. కూచోబెట్టినా ఇంటర్వ్యూ చేయడం మరింత కష్టం” అని మిత్రులందరూ బెదరగొట్టారు. చాలా నిరాశ పడ్డాను. ఐనా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకొని, ఒకరోజు సాయంత్రం శాస్త్రిగారి అన్వేషణలో పడ్డాను.
ఎంత తిరిగినా మనిషి దొరకలేదు. ఇలా లాభం లేదనుకొని రెండోరోజు కోర్టు కెళ్ళాను. అక్కడా అంతే!
“శాస్త్రిగారు కావాల? ఇదిగో ఇప్పుడే ఇటెళ్ళారండీ” అనే వాళ్ళేగానీ ఖచ్చితంగా ఇక్కడున్నారని ఎవ్వరూ చెప్పిన పాపాన పోలేదు. మొత్తం మీద ఒక గంట సేపు కోర్టు అంతా వెతికి చివరికి పట్టుకుని విషయం చెప్పాను.
“ఇంటర్వ్యూ ఎందుకండీ?” అని మొహం చిట్లించారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడి పట్టువదలని జర్నలిస్టు మార్కుడిలా మళ్ళీ ఇంటర్వ్యూ గురించి అడిగాను. ఏ కళనున్నారో ఏమో, “రేపు సాయంత్రం కూచుందాం రండి” అన్నారు.
మర్నాడు సాయంత్రం కోర్టు కెళ్ళేసరికి శాస్త్రిగారు బార్ రూమ్ వరండాలో పడక్కుర్చీలో కాళ్ళు చాపుకుని నిద్రపోతున్నారు. ఒళ్లో రాబర్ట్ డాలీ రాసిన ‘ఇయర్ ఆఫ్ డి డ్రాగన్’ డిటెక్టివ్ నవల కూడా నిద్రబోతోంది. కాసేపటికి ఆయనంతట ఆయనే నిద్ర లేచి, “పదండి, ఇంటికి పోదాం” అన్నారు.
“ఊ! ఏమిటి అడుగుతారు అడగండి” అన్నారు.
నేను: మీ కథల్లో శిల్పం వస్తువును మింగేస్తుందని, అవసరమైన దాని కన్నా అధిక వర్ణన ఉంటుందని ఒక విమర్శకాభిప్రాయం.
ఆయన: అయితే అయి ఉండొచ్చు. నాకు తెలియదు.
నేను: పోలీసుల గురించి, కోర్టుల గురించి మీరు రాసింది చదివితే కసి, కోపం గాక నవ్వు, హేళన మాత్రమే కలుగుతాయని కొందరంటారు. దాని వల్ల పాఠకుడి దృక్పథంలో రచయిత ఆశించిన మార్పు వస్తుందంటారా?
ఆయన: నాకు తెలీదు.
నేను: జీవితాన్ని ఉన్నదున్నట్టు సాహిత్యంలో చిత్రిస్తే చాలా లేక…
ఆయన: ఏమో చెప్పలేను.
నేను: రత్తాలు-రాంబాబు, రాజు-మహిషి నవలలను పూర్తి చేసే ఉద్దేశం ఉందా?
ఆయన: చెయ్యగలిగితే చేస్తాను.
నేను: విరసం తాత్విక సిద్ధాంతంతో మీకు ఏకీభావం ఉంది కదా?
ఆయన: అవును.
నేను: మరి సంస్థకు ఎందుకు రాజీనామా చేశారు?
ఆయన: నాకు భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్లకు చెడ్డ పేరు తెచ్చే భిన్నాభిప్రాయాలు. ప్రవర్తన కూడా. అందుకని రాజీనామా చేశాను.
నేను: కొత్త నవల ఏదైనా రాస్తున్నారా?
ఆయన: రాద్దామనే సంకల్పం ఉంది కాని రాయడం లేదు.
నేను: ప్రతి కథ ముగింపు విప్లవాత్మకంగా ఉండాలా?
ఆయన: అది నేను చెప్పలేను. తీసుకున్న కథావస్తువును బట్టి ఉంటుంది.
పది నిమిషాల వ్యవధిలో ఇదంతా పూర్తయిపోయింది. అంతా’ ఎస్, నో, ఆల్ రైట్’ వచ్చింది. ఏం చెయ్యాలో తోచలేదు. అంతకుముందు కొందరు మిత్రులు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. “శాస్త్రిగారు తన రచనల గురించి మాట్లాడరు. ఇతరులు రాసినవి ఎక్కువగా చదవరు” అని.ఈలోగా బారాటి గ్లాసుల్లో చిక్కటి టీ వచ్చింది. తాగుతూ కూర్చున్నాం. ఇద్దరి మధ్యా మాటల్లేవు. టీ పూర్తయ్యాక కాస్త ఉడుకుమోత్తనంగా అన్నాను.
“మీరు సరిగా చెప్పటం లేదు, ఇంకాస్త వివరిస్తే బావుంటుందిగా?”ఆయన నవ్వారు. ఇబ్బందిగా చూశారు. కాసేపయ్యాక మెల్లగా మొదలెట్టారు.“చెప్పటానికి ఏముంటుంది? ఒక వస్తువు ఉందనుకోండి. దాన్ని ఎలా చెబితే బావుంటుంది అనుకుంటే అలా చెబుతాను. ఒక విశేషాన్ని వెటకారంగా చెప్పాలంటే ఒక రకంగా వస్తుంది. జాలిగానో, కోపంగానో చెప్పాలంటే మరో రకంగా వస్తుంది. అంతే తప్ప నేను మటుకు శిల్పం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నానని అనుకోలేదు.
అయితే పాఠకుడ్ని ఎలా ఆకర్షించాలి అన్న విషయం గురించి మాత్రం ఆలోచించడం జరుగుతూ ఉండేది. వంద కథల్లో మన కథను చదివించాలి కదా! అందుకోసం తంటాలు పడేవాడినేమో, అంతేగాని నా శిల్పం నా వస్తువును మింగేసిందని నేను అనుకోవటం లేదు. నాకెప్పుడూ అలా అనిపించలేదు కూడా. ఏ విధంగా రాస్తే బావుంటుంది అని నాకు తోస్తే, నా అనుభవం మీద నాకున్న లిమిటేషన్స్ బట్టి, నాకున్న జ్ఞానం బట్టి అలా రాస్తాను. ఒకరు ఈ విధంగా రాయకూడదు అన్నారు కాబట్టి ఆ విధంగా రాయడం మానెయ్యలేను.
అలాగే జీవితాన్ని ఉన్నదున్నట్టుగా సాహిత్యంలో చిత్రించడం ఎప్పుడూ జరగదు. ఏ విషయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడే మనిషికీ మనిషికీ తేడా వస్తుంది. జీవితం గురించి వారి వారి అభిప్రాయాలను బట్టి చిత్రించడం జరుగుతుంది. ఒక ముష్టి వాడున్నాడనుకోండి. అది వాడి పూర్వజన్మ కర్మ అనుకుంటే కథ ఒకలా వస్తుంది. సాంఘిక దురాచారం వల్ల వాడలా అయ్యాడనుకుంటే మరోలా వస్తుంది. లేదు ఈ జన్మలో వాడు చేసిన పాపాలకు అలా అయ్యాడనుకుంటే ఇంకోలా వస్తుంది. వర్ణనలో కూడా ఉన్నదున్నట్టు రాకపోవచ్చు. అది మన దృక్పథం బట్టి మారుతుంది” అని వివరించారు.
ఇంతవరకూ చెప్పి ఇంకేముంది చెప్పటానికి అన్నట్టు చూశారు. నేనేమో ఇంకా ఉంది కదా అన్నట్టు చూశాను. అలా కొన్ని క్షణాలు గడిచాయి.ఒకరు ప్రశ్నించటం మరొకరు సమాధానం చెప్పటం ఆయనకంతగా నచ్చుతున్నట్టు కనిపించలేదు. అందుకని సంభాషణా ధోరణిలోకి దిగాను. సంభాషణ జనం భాష మీదకు మళ్ళింది .
“మా జిల్లాలో పాటకపు జనం తెలుగు బాగా మాట్లాడతారు. బహుశా బాధల వల్ల కావచ్చు, ఏం మాట్లాడినా పవర్ ఫుల్ గా ఉంటుంది. మా ఊరు అనకాపల్లి దగ్గరున్న తుమ్మపాల. అంతకుముందు దాని పేరు ‘స్థూపాల’. బౌద్ధస్తూపాలు ఉండేవి లెండి. చివరికది ‘తుమ్మపాల’ అయింది. ధాన్యం నూర్పిళ్ళు అవుతున్నప్పుడు చిన్నప్పుడు ఒకసారి మా ఊరెళ్లాను. అర్ధరాత్రి అయింది.
జనవరి నెల కదా బాగా చలిగా ఉంది. వెన్నెలగా కూడా ఉంది. మాటూరి తాత అని మా పాలికాపు ఉండేవాడు. ఇద్దరం వరిగడ్డి తీసి చలి కాచుకుంటున్నాం. అప్పుడు మాటూరి తాత- “ఆహా ఎన్నెలా .. కన్నతల్లీ .. పేదోడి దీపమా!” అన్నాడు.
దీన్నొక కథలో ఉపయోగించుకున్నాను. అలాగే ఒకసారి ఒక పేదరాలు మా మేనమామ ఇంట్లో తన కష్టాలు చెప్పుకుంటోంది. నేను కలగజేసుకుని ‘అయితే నీకీ ఊర్లో దిక్కెవరూ లేరా’ అన్నాను. “దిక్కెవరున్నారు బాబు, ధరణి భూదేవి, ఆపైన దేవుడు, ఆ ఎనక తమరిలాంటి మారాజులు” అని ఠక్కున పోయిటిగ్గా అన్నది. దాన్ని కూడా ఒక కథలో ఉపయోగించుకున్నాను.
కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు అవతలోడ్ని గట్టిగా దబాయిస్తేగాని మన పార్టీకి తృప్తి ఉండదు. కేసోడిపోయినా మా ప్లీడరు గట్టిగా మాట్లాడాడని పార్టీ తృప్తి పడుతుంది. ఒకరోజు ఒక పోలీసు ఎస్సైని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాను. ఆయన రికార్డులకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెబుతున్నాడు. అలాటప్పుడు నేను గట్టిగా వాదించేందుకు ఏముంటుంది? తప్పుడు సాక్ష్యం చెప్పాడని చెప్పి కూర్చున్నాను. బయటకొచ్చాక పార్టీ వాడు తగులుకొని “ఎస్సైని అలా ఒగ్గేశావేటి, ఏవడగలేదే? సముద్రంలో కెరటాలు లెగుస్తాయి చూశావా నా కడుపులో కోపం అలా కుతకుతలాడుతూ లేసింది” అన్నాడు. దీన్ని కూడా ఒక చోట వాడుకున్నాను.
హరిజనులు బాగా డాన్స్ చేస్తారు. బాగా పాట పాడతారు. మనుషులందరిలోనూ artistic urge ఉంటుంది కదా! బాధలు పడేవోళ్ళ artistic urge ఆ రూపంలో వ్యక్తమవుతుందనుకుంటా. అందుకే వాళ్ళేం చెప్పినా పవర్ ఫుల్ గా చెప్పగలరు” అని వివరించారు. “ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు?” అని అడిగాను.
“తెలుగు సినిమాలు చూడను. బాగుందని ఎవరైనా చెబితే ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను” అన్నారు. సినిమాలను గురించి ఆయన మరేమీ పొడిగించకపోవడంతో సంగీతం మీదకు సారించాను.
“లైట్ క్లాసికల్, హిందుస్తానీ సంగీతమంటే ఇష్టం. మన తెలుగు పాటల్ని కూడా ముందు అలాగే పాడేవారు. ఇప్పుడంతా అరవ పద్ధతిలో పాడుతున్నారు. కంఠం శ్రావ్యంగా ఉండాలిగా. దాన్ని వాయిస్ కల్చర్ అంటారు. అది మన వాళ్ళలో లేదు. అయితే కొంతమంది అరవ వాళ్ళు కూడా శ్రావ్యంగా పాడగలరు” అని నవ్వారు.
గద్దర్ పాట ఎలా ఉంటుంది? అని అడిగితే
-“గద్దర్ ది సహజమైన ఉద్రేకం, ఇంపుగా ఉంటుంది. వాయిస్ కల్చర్ ఉంది. అది అతడికి తెలియకపోవచ్చు. వంగపండు ది అనుకరణ లాగా అనిపిస్తుంది. అయితే మంచి అనుకరణ. అంటే వంగపండును తగ్గించడం కాదు. వంగపండు కూడా కొన్ని పాటల్ని సహజమైన ఉద్రేకంతో పాడతాడు. ఇద్దర్నీ పోలిస్తే నాకలా అనిపిస్తుంది. గద్దర్ ది నేచురల్ ఎమోషనల్ బేసిస్. వంగపండు ది అక్వైర్డ్ ఎమోషనల్ బేసిస్. గద్దర్ ది సైగల్ పాట లాంటి పాట. వంగపండు ది సైగల్ లా పాడదల్చుకున్న వాళ్ళు పాడిన పాట. ‘నాది సహజ జలపాతము’ అని పాపారావు అంటుండేవాడు. మిగతా వాళ్ళది కృత్రిమ జలపాతమట. అలాగ గద్దర్ ది సహజ జలపాతం.
కర్ణాటక సంగీతం కూడా బాగా పాడవొచ్చు. అరవ్వాళ్ళలా కాకుండా నా స్నేహితుడు ఆకెళ్ళ కృష్ణమూర్తి త్యాగరాజు కీర్తనను చక్కగా తెలుగువాడిలా పాడేవాడు. అతడికి వాయిస్ కల్చర్ ఉంది. ‘నగుమోము కనలేని’ అనే కీర్తనను భానుమతి కూడా పాడింది. అందులో ఎమోషన్ ఏమీ ఉండదు. ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే అరవాయన తెలుగు నేర్చుకుని ‘నగుమోము కనలేని’ పాడాడు. అచ్చంగా త్యాగరాజు పాడినట్టే ఉంటుంది.
సైగల్ ఆనాడు కార్డు హోల్డర్ కమ్యూనిస్టు అయినా ‘భక్త సూరదాస్’ సినిమాలో ఎంత డివోషనల్ గా పాడాడు! రియల్ ఆర్టిస్ట్ అయితే అలా పాడతాడు. కంఠం బాగా ఎత్తి పాడలేని వాడిని చూస్తే నాకు చాలా చిరాకు. సింహంలా గర్జించవలసి వచ్చినప్పుడు ఎలకలా కిచకిచలాడినట్టు పాడితే ఎలా? ఆకెళ్ళ ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’ పాడినట్టు మరెవరూ పాడగా నేను వినలేదు.”
కోర్టులో ఆయన దగ్గర చూసిన డిటెక్టివ్ పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు డిటెక్టివ్ పుస్తకాలు చదువుతారా అని అడిగాను.
చిరునవ్వు నవ్వి డిటెక్టివ్ నవలలంటే నాకిష్టం. మిగిలినవి చాలా బాగుంటే గాని చదవలేను అన్నారు.
నేను: ఎందుకని?
ఆయన: వాటిలో యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. నవలలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూండాలి. పైగా నవలలో చివరకు చెడ్డ మీద మంచి విజయం సాధిస్తుంది. అది అందరికీ ఇష్టంగా ఉంటుంది. జీవితంలో పరమ దుర్మార్గుడు కూడా సినిమాకెళితే హీరోతోనే తనను తాను పోల్చుకుంటాడు. మంచితో ఐడెంటిఫై చేసుకునే గుణం సమాజంలో ఉంది. ఇప్పుడు రామాయణం సినిమాకు రావణుడ్ని తీసికెళితే అతగాడు కూడా తనను తాను రాముడి తోనే పోల్చుకుంటాడు” అని చెప్పి బిగ్గరగా నవ్వారు.
రావి శాస్త్రి, త్రిపురనేని శ్రీనివాస్
From wall of the Taadi Prakash garu