అయినా.. మనిషి మారలేదు .. కాంక్ష తీరలేదు!!

Sharing is Caring...

ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ  అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి  కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత పెరిగింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని నిరూపించలేక కోర్టుల్లో సైతం పరువు పోగొట్టుకున్నారు. రీ కౌంటింగ్ జరిగిన విస్కాన్సిన్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బైడెన్‌నే గెలుపు వరించింది. 20 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో బైడెన్ ట్రంప్‌పై విజయం సాధించారని ప్రకటించారు.

అలాగే మిల్వాకీ, డేన్ కౌంటీల్లో రీకౌంటింగ్ చేపట్టారు. మిల్వాకీ  రీకౌంటింగ్ ఫలితాలలో బైడెన్ గెలుపు మరోసారి ఖరారు అయింది. దాంతో పాటు మెజారిటీ  132 ఓట్ల మేరకు పెరిగింది. ఇవన్నీ గమనించి అసహనానికి గురైన ట్రంప్  “ఎలక్టోరల్ కాలేజీలో బైడెన్ ఆధిక్యాన్ని నిరూపించుకోవాలి.. అప్పుడే వైట్‌హౌస్‌ను వీడతాను” అంటూ ప్రకటించారు. ట్రంప్ తీరు చూసి పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు. పార్టీ కి చెడ్డ పేరు వస్తుందని… గతంలో ఎవరూ ఇంత మొండిగా వ్యవహరించలేదని అంటున్నారు. చెప్పి చెప్పి అందరికి విసుగు పుట్టి సైలెంట్ అయిపోయారు. ఒక వర్గం మీడియా తనను టార్గెట్ చేస్తూ బైడెన్‌కు మద్దతుగా వ్యహరిస్తుందని, ట్విటర్ కూడా తనపై పక్షపాతం చూపిస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఇవన్నిపసలేని ఆరోపణలు కావడం ప్రజలు నవ్వుకుంటున్నారు. కాగా ట్రంప్ కోరుతున్నట్టు  బైడెన్ ను  తదుపరి అధ్యక్షుదిగా ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకునే రోజు కూడా దగ్గర కొచ్చింది.

ఇక మొత్తం 50 రాష్ట్రాలలో 528 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా… బైడెన్‌ 306, ట్రంప్ 232 ఓట్లు గెలుచుకున్నారు. దీంతో అధ్యక్ష పీఠం కైవశం చేసుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్ల కంటే బైడెన్ కు ఎక్కువే వచ్చాయి. ఈ ఫలితాలతో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. బైడెన్‌కు ఈ అధ్యక్ష ఎన్నికల్లో  రికార్డు స్థాయిలో 8 కోట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి. ట్రంప్‌కు 7.38 కోట్ల ఓట్లు పోలయ్యాయి.షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 14న కొత్తగా ఎన్నికైన అన్ని రాష్ట్రాలకు చెందిన ఎలక్టోర్స్ భేటీ అవుతారు.ఈ సమావేశంలో వారు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.అమెరికా ప్రెసిడెంట్  ఎన్నికలో ఇదే ఆఖరి ఘట్టం. ఆ తర్వాత ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం శ్వేతసౌధం లోకి ప్రవేశిస్తారు. 

———– KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!