Govardhan Gande……………………………………………
Water disputes………………………………జల వివాదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి(రాయలసీమ లిఫ్ట్) వివాదాన్ని ముదరనివ్వకుండా చూడాలి. పంచాయతీగా మారకముందే జోక్యం చేసుకోవాలి. ఇప్పుడిపుడే రెండురాష్టాల మధ్య మానిపోతున్న గాయాలను పూర్తిగా మాసిపోయేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నెలకొన్న వివాదాలను పరిష్కరించాలి. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొనేందుకు చొరవ చూపాలి.
జల వివాదాల పరిష్కార బాధ్యత కేంద్రానిదే .. ఆవిషయం కేంద్ర నేతలకు తెలుసు. ఆ అధికారం కేంద్రం వద్దనే ఉన్నది . సుదీర్ఘ ఘర్షణ తరువాత ఏడేళ్ల కింద అన్నదమ్ముల్లా విడిపోయారు. భౌగోళిక గీతలు గీసుకున్నారు.కానీ వనరుల పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు .. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. వేర్పాటు గాయాలు క్రమంగా మానిపోతున్నాయి. కోపాలు,తాపాలు తగ్గుముఖం పట్టాయి. రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా “రాయలసీమ లిఫ్ట్” వివాదం తలెత్తింది. వివాదం ముదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాల పై ఉన్నది. అలా జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. వివాదం, పంచాయతీ లేకుండా, తలెత్తకుండా ఎవరి బతుకులు వారే బతికేందుకు సత్వరం జోక్యం చేసుకోవాలి.
గతంలో నదీ జలాల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్ళు, కోర్టులలో మాత్రమే అవకాశం ఉండేది. అందులో వాస్తవ పరిస్థితులను బట్టి కాక ఆయా రాష్ట్రాల వాదనలను బట్టి .. జడ్జీల ఆలోచనలను బట్టి తీర్పులు వస్తాయి. కాలయాపన కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ట్రిబ్యునళ్లు , కోర్టుల బయట జల వివాదాలను పరిష్కరించుకోవాలి. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 84 సూచన మేరకు అపెక్స్ కౌన్సిల్ లో నదీ జలాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇందుకు కేంద్రమే పూనుకోవాలి. సమస్యలను అపెక్స్ కౌన్సిల్ లో పరిష్కరించుకుని ఉభయ రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలను సస్య శ్యామలం చేసుకునేందుకు ఇద్దరు సీఎంలు కృషి చేయాలి. గతంలో ఒక సారి ఇద్దరు సీఎంలు కూర్చొని చర్చించిన సందర్భాలున్నాయి. అదే తరహాలో కలిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయి. అంతే కానీ వ్యక్తిగత విమర్శలకు దిగి సమస్యను జటిలం చేసుకోకూడదు. ఇలాంటి తొందరపాటు వల్ల సఖ్యత చెడిపోతుంది. సమస్యలు పెరుగుతాయి.