మూడో సారైనా గెలుపు ఖాయమా ?

Sharing is Caring...

A test of his luck……………………………………..

సురేష్‌ గోపీ…  ప్రముఖ మలయాళ నటుడు. ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు.తాజాగా సురేష్ గోపి  త్రిసూర్‌ లోక సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ నుంచి ఆయన పోటీ చేయగా కాంగ్రెస్ తరపున కె. మురళీధరన్ బరిలోకి దిగారు. సీపీఐ నుంచి సునీల్ కుమార్ రంగంలోకి దిగారు. ముగ్గురు హై-ప్రొఫైల్ అభ్యర్థులు కావడంతో గట్టి ప్రచారం చేశారు. ఏప్రిల్ 26…న ఇక్కడ పోలింగ్ జరిగింది.

సురేష్ గోపి గతంలో రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతి వర్క్ అవుట్ అయితే గెలిచే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ కేరళలో ఇప్పటి వరకు ఒక్క లోక్‌సభ సీటును గెలవలేదు. ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే ఆ పార్టీ ఖాతాలో ఉంది. ఈ సారైనా బీజేపీ కేరళలో ఖాతా తెరవాలని ఉవ్విళ్లూరుతోంది. త్రిసూర్ లో ప్రధాని మోడీ కూడా ప్రచారం చేశారు.

సురేష్ గోపి విద్యార్థి దశలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఎస్.ఎఫ్.ఐ. విద్యార్థి సంఘంలో పనిచేశారు. తర్వాత బీజేపీ లో చేరారు. సురేష్ గోపి 2019లో లోకసభ ఎన్నికల్లో బీజేపీ తరపున త్రిసూర్‌ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సురేష్ కి 2,93,822 ఓట్లు వచ్చాయి. పోటీ లో 93,633..ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాపన్ గెలుపొందారు.

త్రిసూర్ నియోజకవర్గంలో ఒక సారి కాంగ్రెస్ .. మరో సారి సీపీఐ గెలుస్తుంటాయి. ఆ రెండు పార్టీలకు అక్కడ మంచి బలముంది. సురేష్ గోపి కాబట్టి పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అంతకు ముందు మరొకరు అక్కడ  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగగా కేవలం ఒక లక్షా రెండువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 

సురేష్‌ గోపీ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సురేష్ కి 40,457 ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థి బాలచంద్రన్ 4..వేల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ రెండో ప్లేసులో నిలిచింది. 

ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలోకి దిగిన సురేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ  భాషల్లో దాదాపు 250..సినిమాల్లో గోపి నటించారు. సురేష్ గోపి 1965లో ‘ఓడాయిల్ నిన్ను ‘ చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమైనారు.ఎన్నోఅవార్డులను కూడా అందుకున్నారు. నటుడిగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!