Taadi Prakash ………………………………………………………………
శ్యాంబెనెగల్ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది.అలాంటి దర్శకులకి గనక ఐడియా వస్తే అదొక అపురూపమైన చిత్రం అయి తీరుతుంది. అటెన్‌బరో ఇండియా వచ్చి ‘గాంధీ’ తీస్తాడా.. అదే పని నేను ఆఫ్రికా వెళ్ళి చేస్తా అని అనుకున్నాడో ఏమో.. ఇంతలో ఢీల్లీలో ఇందిరాగాంధీపై ఒక అంతర్జాతీయ సెమినార్ జరిగింది. ఫాతిమా మీర్ అనే దక్షిణాఫ్రికా ప్రొఫెసర్ ఒకామె సెమినార్‌కి వచ్చింది. వాళ్ళ దేశంలో గాంధీజీ చేసిన పోరాటం మీద ‘అప్రెంటిస్‌షిప్ ఆఫ్ మహాత్మా’ అని ఆమె ఒక పుస్తకం రాసింది.
సెమినార్లో కలిసిన శ్యాంబెనెగల్‌కి ఆ పుస్తకం బహుమతిగా యిచ్చింది. అది చదివిన తర్వాతే యీ సినిమా తీయాన్న ఆలోచన వచ్చింది అన్నారు శ్యాం. భారత, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలతో మాట్లాడాడు. నేను సినిమా తీస్తా అని బెనెగల్ అంటే ఎవరన్నా కాదనగలరా? భారత ప్రభుత్వం, సౌతాఫ్రికా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కోటాను కోట్ల రూపాయలు కుమ్మరించాయి. అప్పటికి అటెన్‌బరో ‘గాంధీ’ వచ్చి 12 ఏళ్ళు అవుతోంది.
1994లో శ్యాంబెనగల్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు. ఫాతిమా మీర్‌ని కలిసి, మరికొంత పరిశోధన చేసి సినిమాకి తగినట్టుగా గాంధీ కథ రాయమన్నాడు. ఇండియావచ్చి ఎం.ఎస్. సత్యు భార్య షామా జైదిని కలిసి చిన్నటీంతో ఇంకొంత పరిశోధన చేశారు. ఫాతిమా, షామా కలిసి స్క్రీన్ ప్లే రాశారు. అలా రాయడంలో శ్యాం పాత్ర చిన్నదేమీ కాదు. 1973లో అంకుర్ నుంచి నిషాంత్, మంథన్, భూమిక సినిమాల్తో భారతీయ సినీ ప్రేక్షకుల్నీ, పండితుల్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తినవాడు బెనెగల్.
సినిమా తీయడానికి ముందు మరొసారి దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ కార్మికులు, తోటల్లో పనివాళ్ళు, ఇతర బాధితులతో గాంధీజీ ఒక లాంగ్‌మార్చ్ చేసివున్నారు. లాంగ్‌మార్చ్ జరిగిన నాటాల్, ట్రాన్స్‌వాల్ రాష్ట్రాల్ని చూశారు. మార్చ్ జరిగిన రూట్‌ని పరిశీలించారు. సినిమా షూటింగ్ మొత్తం దక్షిణాఫ్రికాలోనే జరగాలి. అక్కడి నటులు, సాంకేతిక నిపుణులు కావాలి. షూటింగ్ ఏర్పాట్లూ, వర్కర్లూ, మేనేజర్లూ, షెడ్యూళ్ళు…. యిలా లెక్కలేనన్ని పనులు. అందరితో మాట్లాడి, అంతా ఖరారు చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు శ్యాంబెనెగల్.
మృణాల్‌సేన్ తీసిన ‘మృగయా’ సినిమా 1976 జనవరి ఒకటిన విడుదలైంది. మిథున్ చక్రవర్తి మొదటి సినిమా అది. విడుదలకి రెండు మూడు రోజుల ముందు మృణాల్ సేన్ విజయవాడ వచ్చారు. సినీ పండితులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల కోసం ఒక స్పెషల్ షో వేశారు. ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో డిగ్రీ చదువుతున్న నేను అలంకార్ థియేటర్‌లో ఆ షోకి వెళ్ళాను. అది 1975 డిసెంబర్ 30 కావొచ్చు, బాల్కనీలో 150 – 200 మందిమి కూర్చుని వున్నాం. తెల్ల లాల్చి పైజమా, దళసరి కళ్ళద్దాలతో చురుగ్గా వున్న మృణాల్‌సేన్, కుర్చీల మధ్య నిలబడి ‘మృగయా’ నిర్మాణ విశేషాలు వివరంగా చెప్పారు. సేన్‌కి షేక్ హ్యాండిచ్చి, సినిమా చాలా బావుందని చెప్పాను. మర్నాడు ఆర్టిస్ట్ మోహన్ మృణాల్ సేన్‌తో మాట్లాడి ‘విశాలాంధ్ర’లో పెద్ద వ్యాసం రాశాడు.
1986లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాద్‌లో భారీగా ఫిలింఫెస్టివల్ జరిగింది. అబిడ్స్‌లో ఒక థియేటర్లో ‘చిదంబరం’ అనే ప్రతిష్టాత్మకమైన మళయాళ ఆర్ట్ ఫిలిం వేశారు. దర్శకుడు జి.అరవిందన్‌తో కలిసి ఆ సినిమా చూశాను. పెద్ద గడ్డం, మీసాల్తో రుషిలా వున్నారు అరవిందన్.
1996 ఏప్రిల్, సికింద్రాబాద్: బేగంపేటలో వున్న ఆనంద్ థియేటర్‌లో The making of mahatma సినిమా వేస్తున్నారు. అపుడు సికింద్రాబాద్ ‘ఆంధ్రభూమి’ లో పనిచేస్తున్నాను. ప్రీమియర్‌షో, జర్నలిస్టులు హేపిగా వెళ్ళొచ్చు. ఉదయం 11గంటలకి షో. మిత్రులతో కలిసి వెళ్ళాను. కారిడార్‌లో, కొద్దిపాటి గెడ్డంతో,టక్ చేసుకుని శ్యాంబెనెగల్ కొందరితో ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నారు. ఆయన్ని చూడాలన్న అంకురం 1973లో మొలకెత్తితే … శ్యాం మహా వృక్షంగా మారాక 1996లో ఆశ నెరవేరింది.
సినిమా ఆయన్తో కలిసి చూశాం. అయిపోయాక బైటికి వెళుతుంటే బాల్కనీ టికెట్లు చించే గ్లాస్‌డోర్ దగ్గర ఆయననించొని వున్నారు. చాలామంది చెయ్యికలిపి అభినందిస్తున్నారు. నేనుకూడా బెనెగల్ భుజం తట్టి, పర్లేదు గురూ పైకొస్తావ్ అందామనుకున్నాను. ఆకాశమంత ఎత్తుగా వుండే అతని భుజం తట్టడం అసాధ్యం అని తెలుసు గనక… నవ్వి, షేక్ హాండిచ్చి నోరుమూసుకుని వచ్చేశాను.సత్యజిత్‌రాయ్, శ్యాంబెనెగల్ లాంటి దర్శకుల్ని కలిసినపుడు మీ సినిమా చాలా బావుందనో, అదిరిపోయిందనో చెప్పడం అంత హాస్యం మరొకటి వుండదుకదా! మొగలే ఆజం, గరంహవా, మేకింగ్ ఆఫ్ మహాత్మ… సినిమాల గురించి నేను రాయడం కాలక్షేపం కోసం కాదు. వాటితో నాకు ఎమోషనల్ ఎటాచ్‌మెంట్ వుందని చెప్పడం కోసం ఈ వివరాలు రాయక తప్పలేదు.
ఇంతకీ గాంధీ పాత్రధారి ఎవరు ?
సినిమాలో యువగాంధీ పాత్రలో నటించడానికి నసీరుద్దీన్‌షా కరెక్ట్‌గా సరిపోతాడని బెనెగల్ అనుకున్నారు. ఆ గొప్ప నటునితో మాట్లాడారు.. ఆ పాత్ర పోషించడానికి కళ్ళు తిరిగి కిందపడేంత రెమ్యూనరేషన్ అడిగారు నసీరుద్దీన్. సినిమా వ్యాపార విద్యలో ఆరితేరిన శ్యాంబెనెగల్ ‘పోబే’ అని మనసులో అనుకుని లేచి వచ్చేశారు.
మరింకెవరు? 1992లో బెనెగల్ సూరజ్‌కాసాత్వా ఘోడా (సూర్యుడి ఏడు గుర్రాలు) అనే ఒక masterpiece తీశారు. ప్రేమ, మానవత్వం అనే శాశ్వత విలువల్ని ఆ తెల్లని ఆశల గుర్రాలే ముందుకు నడిపిస్తాయని చెప్పిన ఆ అరుదైన చిత్ర కథనాయకుడు రజిత్‌కపూర్. అతన్నే గాంధీపాత్రకి ఎంచుకున్నాడు. మరి కస్తూర్బా ఎవరు? అప్పటికే టివీ నటిగా ప్రేక్షకుల్ని మైమరిపిస్తోంది పల్లవి జోషి. సూరజ్‌కా సాత్వా ఘోడాలో ఒక పాత్ర వేసింది కూడా. ఆమెకే కస్తూరి తిలకం దిద్దాడు బెనెగల్. చదరంగం ఆట గెలిచే నైపుణ్యంతో ఫాతిమా, షామాజైదీలు స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు. ఒక లైన్ ప్రొడ్యూసర్, ఒక కాస్ట్యూమ్ డిజైనర్, హీరో హీరోయిన్, ఒక అసిస్టెంట్‌తో దక్షిణాఫ్రికా వెళ్ళడానికి విమానం ఎక్కాడు శ్యాంబెనెగల్.
pl. read it also ……………జాతి వివక్షపై గాంధీ తిరుగుబాటు ! (2)/https://tharjani.in/gandhi-struggle-in-south-africa/