One hero movies released on the same day…………………….
సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. హీరోలు,హీరోయిన్లు, నిర్మాతలు,దర్శకులు ఎవరూ అందుకు అతీతులు కాదు. యువరత్న బాలకృష్ణ .. నటి విజయశాంతి ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్ గా పేరు గాంచారు. 93 వరకు ఇద్దరూ కలసి నటించారు . వారి సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి . నిప్పురవ్వతో కలిపి 17 సినిమాల్లో బాలయ్య విజయశాంతి జంటగా నటించారు.
ఫ్యాన్స్ లో కూడా ఈ జంట పట్ల ఒక క్రేజ్ ఉండేది. నిప్పురవ్వ తర్వాత ఆ ఇద్దరు కలసి ఏ సినిమాలో నటించలేదు. అదే ఆఖరి సినిమా. అసలు ఆ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చేయని అంటారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తన సినిమాపైనే తాను నటించిన మరో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదెలా ఎలాసాధ్యం అనుకుంటున్నారా ? అప్పట్లో అలా డిసైడ్ చేశారు.
ఆ విశేషాలు తెలుసు కోవాలంటే కొన్ని ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఒక రికార్డు. చరిత్రలో అలా ఎప్పుడూ జరగలేదు. ఆ హీరో బాలకృష్ణ .. ఆ సినిమాలు నిప్పురవ్వ .. బంగారు బుల్లోడు. 1993 సెప్టెంబర్ 3న ఆ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆరెండు సినిమాల్లో ‘నిప్పురవ్వ’ యావరేజ్‌గా నడిస్తే…‘బంగారు బుల్లోడు’ సినిమా మాత్రం హిట్ అయింది.
నిప్పురవ్వ సినిమాకు నటి విజయశాంతి, శ్రీనివాస ప్రసాద్ నిర్మాతలు. ఈ శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణ బంధువే. అలాగే బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడి గా కూడా వ్యవహరించారు. అంతే కాదు ఆయన విజయశాంతి భర్తకూడా. ఆ సినిమా నిర్మాణం నాటికి ఆ విషయం చాలామందికి తెలియదు. ఇక ఈ నిప్పురవ్వకి బప్పీలహరి సంగీతం అందించారు.
రాజ్ కోటి మాత్రం ‘రండి కదిలి రండి’ పాటకు మ్యూజిక్ సమకూర్చారు. ఏ.ఆర్.రహమాన్ ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం మరో విశేషం. ఒకే సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పనిచేయడం కూడా అప్పట్లో ఒక రికార్డు. సింగరేణి కార్మికుల శ్రమదోపిడి అంశంతో పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా స్క్రిప్ట్ సమకూర్చగా, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
ఇక ‘బంగారు బుల్లోడు’ విషయానికొస్తే..జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై నటుడు జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ ఈ సినిమా తీశారు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. రవిరాజా బాలకృష్ణ కాంబినేషన్ లో మొదటి సినిమా ఇదే. బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్‌లు హీరోయిన్లుగా నటించారు. గ్రామీణ కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం పెద్ద ఎస్సెట్.
విడుదలకు ముందే సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయింది. భారీ బడ్జెట్ తోరూపొందిన ‘నిప్పురవ్వ’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కారణంగా సింగరేణిలో ప్రమాదం జరిగిందంటూ ప్రచారం కూడా జరిగింది. ఎందుకనో ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. దాంతో రిలీజ్ కూడా లేటయింది. దీనికంటే వెనుక మొదలైన బంగారు బుల్లోడు శరవేగంతో ముస్తాబు అయింది.
అనుకోకుండా రెండు సినిమాల రిలీజ్ డేట్ ఒకటే అయింది. ఇరు పక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రెండు సినిమాలు సెప్టెంబర్ 3 న రిలీజ్ అయ్యాయి. మీ సినిమా ను వేరే తేదీన రిలీజ్ చేసుకొమ్మని వి.బి.రాజేంద్రప్రసాద్ ని విజయశాంతి అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోలేదని కూడా ప్రచారం జరిగింది.
అలాగే విజయశాంతి బాలకృష్ణ ల మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో బాలయ్య నిప్పురవ్వ సినిమా గురించి పట్టించుకోవద్దని అభిమానులకు చెప్పినట్టు కూడా కథనాలు పరిశ్రమలో గుప్పుమన్నాయి.
వాస్తవాలు ఎలా వున్నప్పటికీ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాగా బంగారు బుల్లోడు దూసుకుపోయింది. నిప్పురవ్వ విజయశాంతికి నష్టాలు మిగిల్చింది. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికి ఎవరూ పెదవి బయటికి చెప్పలేదు.
ఇక నిప్పురవ్వ లోని “కదిలి రండి ” ర్యాలీ సాంగ్ చిత్రీకరణ 93 జూన్ లో తిరుపతిలోనే జరిగింది. బాలకృష్ణ పై ఆ పాటను చిత్రీ కరించారు. నిర్మాత శ్రీనివాసప్రసాద్ దగ్గరుండి మొత్తం షూటింగ్ కార్యక్రమాలు చూసుకోగా ఏఎం రత్నం ఆ సాంగ్ చిత్రీకరణను పర్యవేక్షించారు.
——— KNMURTHY