సినిమాకు సూటయ్యే కథ ఈ ‘బాహుబలి’ది!

Sharing is Caring...

A man who ran a parallel government …………………………

బీహార్ రాజకీయాలకు నేర చరితులకు విడదీయలేని సంబంధాలున్నాయి . షాబుద్దీన్.. బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. ముప్పైకి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీకలిపితే షాబుద్దీన్.

బిహార్ లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలి పోయేవారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు ఆయన. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. నియోజక వర్గంలో అతగాడు చెప్పిందే శాసనంగా అమలు అయ్యేది. 

షాబుద్దీన్ చదువురాని మొద్దు కాదు బాగా చదువుకున్నవాడు. పొలిటికల్ సైన్సు లో అతగాడు పీహెడీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక సివాన్ నియోజక వర్గాన్ని తన సామ్రాజ్యంగా మలుచుకున్నాడు. అన్నిరకాల పంచాయితీలు చేసేవాడు. షాబుద్దీన్ లాలూ ప్రసాద్ యాదవ్ కి అత్యంత సన్నిహితుడు. లాలూ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగాడు.

షాబుద్దీన్ చేయని పనిలేదు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళపైనే దాడి చేసేవాడు.ఇక సామాన్యులు ఒక లెక్కా ? ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తిని, న్యాయవాదిని కూడా బెదిరించాడు. షాబుద్దీన్ సివాన్ ప్రాంతానికి చెందిన చంద్రకేశ్వర ప్రసాద్ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరినీ ఒకేసారి చంపేశాడు.

ఆ హత్యల్ని మూడో కొడుకు రాజీవ్ రోషన్ చూశాడు. ఆ కేసుల్లో షాబుద్దీన్ కు వ్యతిరేకంగా పోరాడుతుండగా రాజీవ్ రోషన్ ను కూడా తండ్రి కళ్లముందే హత్య చేశాడు షాబుద్దీన్. తనకు వ్యతిరేకంగా ఎవరూ నోరు విప్పడానికి వీల్లేకుండా భయపెట్టేవాడు. మాట వినకపోతే చంపేసేవాడు.అత్యంత కర్కశంగా వ్యవహరించేవాడు.

ఇతగాడిపై బోలెడు కేసులు ఉన్నాయి. 2007 మే లో ఒక కిడ్నాప్, హత్యకేసులో షాబుద్దీన్ కి జీవిత ఖైదు శిక్ష పడింది. 2005 లో నితీష్ కుమార్ సర్కార్ అధికారంలోకి రాగానే పాత కేసులు తిరగతోడి ఇతగాడిని జైలుకి పంపారు.దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడనుంచి 11 ఏళ్ళు జైలులోనే షాబుద్దీన్ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బెయిల్ రాలేదు.  
 
ఎట్టకేలకు  2016 లో బీహార్ హైకోర్టు షాబుద్దీన్ కి బెయిల్ మంజూరు చేసింది. భాగల్‌పూర్‌ ప్రాంతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న షాబుద్దీన్‌ బయటకొచ్చాడు. షాబుద్దీన్‌ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకుని భారీస్థాయిలో స్వాగతం పలికారు. దాదాపు 300 కార్ల కాన్వాయ్‌తో షాబుద్దీన్‌ ను జైలు నుంచి సివాన్ లోని ఇంటికి ర్యాలీగా తీసుకెళ్లారు.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎప్పటికీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాత్రమే నాయకుడని  కొనియాడారు. కొన్ని పరిస్థితుల కారణంగానే నితీష్‌ కుమార్‌ సీఎం అయ్యారని … జైలుకు వెళ్లడంతో ప్రజల్లో కొంతమేరకు అభిమానాన్ని కోల్పోయిన మాట వాస్తవమేనని షాబుద్దీన్ అంగీకరించారు.

బాస్ వచ్చాడు కదా అని ఆయన అనుచరులు రెచ్చి పోయారు.దీంతో షాబుద్దీన్ మళ్ళీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్,నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టు కు వెళ్లారు. బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని మొర పెట్టుకున్నాయి.

పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ షాబుద్దీన్ బెయిల్ రద్దు చేసింది. ఊహించని ఈపరిణామంతో షాబుద్దీన్ సివాన్ కోర్టులో లొంగిపోయాడు. తీహార్ జైలులో ఉంటూనే షాబుద్దీన్  పెండింగ్ కేసుల విచారణకు హాజరయ్యే వాడు. 53 ఏళ్ల అతగాడికి కరోనా పాజిటివ్‌ రావడంతో 2021 ఏప్రిల్‌లో ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!