కేదారేశ్వరుడి ని దర్శించారా ?

Sharing is Caring...

జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండల పై భాగంలో ఉంది. కేదారేశ్వరుని  ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు.

పర్వతాల్లోని కొండలను, గుట్టలను ఎక్కుతూ వెళ్లి  ఆ  శివుడిని దర్శించుకోవాలి.అలా ప్రయాణించడం ఓ అద్భుతమైన అనుభూతి నిస్తుందని భక్తులు చెబుతుంటారు. శైవ క్షేత్రాల్లో ఇది ముఖ్యమైనది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు. మే నెల నుంచి నవంబర్ వరకు గుడి తెరిచి ఉంటుంది. హిమపాతాలు ఎక్కువ కాబట్టి మిగిలిన సమయంలో ఆలయాన్ని మూసి ఉంచుతారు.

ఈ గుడిని ఆదిశంకరాచార్యులు  నిర్మించినట్లు చెబుతారు. కేదార్‌నాథ గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది. కేదారనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ప్రసిద్ధి గాంచింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.

ఇక ఆలయం ముందు వైపు కుంతీదేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడు స్వయంభువుడిగా దర్శనం ఇస్తాడు.  కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుంచి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరారు. పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా వారు విడవకుండా వెన్నంటి శివుని వెనుక భాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం.

తలభాగం నేపాల్ లోని పశుపతి నాధుని ఆలయంలో ఉన్నట్లు స్థల పురాణం చెబుతుంది. ఆలయంలో ‘శిఖరాగ్ర కొన’ రూపంలో కేదారేశ్వరుడు  దర్శనమిస్తాడు.  ఆలయ పరిసరాలు … ప్రాంగణం లో మంచు జల్లు పడుతుంటోంది. ఆలయ సమీపంలో మందాకినీ నది ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది.  

ఇక గౌరీ కుండ్ నుంచి కాలినడకన ఆలయానికి చేరుకోవాలి . ఈ మార్గంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు యాత్రీకులకు కనువిందు చేస్తాయి. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది.  శిఖరాగ్రాన్నిచేరి కేదారేశ్వరుడిని దర్శించి కిందకు రావడం మరిచిపోలేని  అనుభూతి గా మిగులుతుంది.

నడవలేని వారిని గుర్రాలు , డోలీల ద్వారా కొండపైకి తీసుకెళతారు. గౌరీ కుండ్ నుంచి స్వామి ఆలయానికి 14 కి.మీ దూరం ఉంటుంది. రెగ్యులర్ గా నడక అలవాటు ఉన్నవారికి ఈ దూరం పెద్ద కష్టం కాదు. ఆరోగ్య పరిస్థితి బాగున్నవారే యాత్రకు వెళ్లడం మంచిది.

మార్గమధ్యంలో ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ వాతావరణమే  ప్రధాన అవరోదం.  గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మెల్లగా మారుతుంది,

చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. వీటిని తట్టుకుని వేలాది భక్తులు స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. 
కేదార్నాథ్  వెళ్ళడానికి హరిద్వార్ లో కార్లు అందుబాటులో ఉంటాయి. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8 గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ ఆర్టీసీ స్టేషన్ నుంచి గౌరీకుండ్ కు బస్సులు  దొరుకుతాయి. 

———— Theja 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!