ఎన్టీఆర్ చేత “యమగోల” చేయించింది ఈయనే !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………….. 

సినిమాకు ప్రాణం కెమేరా. కెమేరామెన్ గా జీవితాన్ని ప్రారంభించి చాలా మంది దర్శకులయ్యారు. కానీ ఈ ట్రెండుకు భిన్నంగా నిర్మాతగా మారి సక్సస్ ఫుల్ మూవీస్ తీశారో పెద్దమనిషి. ఆయన పేరు సూరపనేని వెంకటరత్నం. అలా చెప్పే కంటే…ఎస్.వెంకటరత్నం అంటే అర్ధమౌతుంది.

సూరపనేని వెంకటరత్నానిది కృష్ణాజిల్లా నిమ్మకూరు .తెలుగువారి ఆరాధ్యనటుడు నందమూరి తారక రామారావు స్వగ్రామం కూడా అదే. వెంకటరత్నం అన్న వెంకట కృష్ణారావు కోల్ కతా శాంతినికేతన్ లో చిత్రలేఖనం నేర్చుకుని మద్రాసు చేరి వాహినీ సంస్ధలో ఆర్ట్ డైరక్టర్ గా పనిచేసేవారు. ఆయన రికమండేషన్ తోనే  వెంకటరత్నం వాహినీ కెమేరా విభాగంలో చేరారు.’ విజయసింహ’ సినిమాతో కెమేరామెన్ అయ్యారు.

ఎన్.టి.ఆర్ దీ వెంకటరత్నానిదీ ఒకే గ్రామం కావడం మాత్రమే కాదు. వారిద్దరూ దూరపు బంధువులు కూడా. విజయసింహ చిత్రంతో కెమేరామెన్ అయిన వెంకటరత్నం ఆ తర్వాత జగపతీ సంస్ధలో పర్మెనెంట్ కెమేరామెన్ గా చేరారు. చిన్నప్పట్నించి కెమేరా మీద ఉన్న ఇంట్రస్ట్ కొద్దీ కెమేరా రంగంలోకి దిగాడు వెంకటరత్నం. మనిషి కాస్త పొగరుగా ఉండేవాడు.

సీన్ సరిగా వచ్చిందా? జర్కులేవైనా ఉన్నాయా అని ఎవరైనా డైరక్టరు సందేహపడితే కడిగి చూస్కో అని సిగరెట్ ముట్టించేసి సమాధానం చెప్పేవాడట వెంకటరత్నం. బాపు రమణల ‘బుద్దిమంతుడు’ సినిమాలో అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా తీసి రక్తి కట్టించిన ఫెయిల్యూర్ లేని కెమేరామెన్.అక్కినేని నటించిన సురేష్ మూవీస్ వారి ‘ప్రేమనగరు’కూ వెంకటరత్నమే సినిమాటోగ్రాఫరు.

జగపతి సంస్ధలో వరసగా అన్ని సినిమాలకూ వెంకటరత్నమే కెమేరా పని చూసుకునేవారు. రాజేంద్రప్రసాద్ కు వెంకటరత్నం మీదున్న కాన్ఫిడెన్స్ అది.’విక్టోరియా నెంబర్ 203′ అనే హిట్ బాలీవుడ్ మూవీ చూసిన వెంకటరత్నానికి దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనిపించింది.

అదే మాట జగపతి రాజేంద్రప్రసాద్ తో అన్నాడు.ఆయన నువ్వే ఎందుకు తీయకూడదు అనడంతో ఆ సినిమా నిర్మాణ బాద్యతలు భుజానేసుకుని మరి డైరక్షన్ మాత్రం మీరే చేయాలని పట్టుపట్టాడు. అలా మొదటి సారి బయట చిత్రాన్ని డైరక్ట్ చేశారు రాజేంద్రప్రసాద్. సినిమా పేరు ‘అందరూ దొంగలే.’

శోభన్, లక్ష్మి హీరో హీరోయిన్స్ గా చేసిన ‘అందరూ దొంగలే’ సినిమా లో ఎస్వీరంగారావు, నాగభూషణం స్పెషల్ రోల్స్ లో చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. నిర్మాతగా వెంకటరత్నానికి తొలి విజయం అందించింది. ఒక సినిమా విజయం సాధించింది కనుక ఇక బయట చిత్రాలకు పనిచేయను అని వెంకటరత్నం ఎప్పుడూ చెప్పలేదు.

దేనిదారి దానిదే అన్నట్టు ఉండేవారు. కెమేరామెన్ గా కంటిన్యూ అయ్యారు. అలా కొంత గ్యాప్ తీసుకుని రెండో సినిమా ప్లాన్ చేశారు. అదే ‘ఇద్దరూ ఇద్దరే.’  వినోద్ ఖన్నా, శతృఘ్నసిన్హా లీడ్ రోల్స్ లో చేసిన బాలీవుడ్ మూవీ ‘దోయార్’ రీమేక్ గా తెరకెక్కిన సినిమా ‘ఇద్దరూ ఇద్దరే’. రీమేక్ స్పెషలిస్ట్ వి.మధుసూధనరావు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో శోభన్ బాబు, కృష్ణంరాజు నటించారు.

రివేంజ్ డ్రామాగా నడిచే ‘ఇద్దరూ ఇధ్దరే’ పెద్ద విజయాన్నే సాధించింది. కృష్ణంరాజు చేసిన నాగూ పాత్రకు చాలా మంచి పేరొచ్చింది.  శోభన్ బాబుతో రెండు సక్సస్ ఫుల్ సినిమాలు తీసిన వెంకరట్నం హ్యాట్రిక్ తీయడానికి రడీ అయ్యారు. మొదటి రెండూ రీమేక్స్ అయితే ఈ సారి డిఫరెంట్ గా ఆలోచించి నవలా చిత్రం తీయాలని సంకల్పించారు.

తనకు బాగా నచ్చిన మాదిరెడ్డి సులోచన నవల మిష్టర్ సంపత్ ఎమ్మే ను సినిమా తీయాలని నిర్ణయించారు. డైరక్షన్ బాధ్యత వి. మధుసూధనరావుకే అప్పగించారు. సినిమా పేరు ‘ఈ తరం మనిషి’.మాదిరెడ్డి సులోచన రాసిన నవల చదివిన మధుసూధనరావు సబ్జక్ట్ మరీ అడ్వాన్స్ డ్ గా ఉందన్నారు.శోభన్ బాబు అయితే ఆ కథను చేయకపోవడమే మేలన్నాడు.

మేల్ ప్రాస్టిట్యూట్ తరహా పాత్ర కదా హీరోదీ అనేశాడు కూడా శోభన్. వెంకటరత్నం వినలేదు. తన నిర్ణయం మీద నమ్మకంతో కంటిన్యూ అయ్యారు. ఆయన ఒక నిర్ణయానికి వచ్చాక ఎవరు చెప్పినా వినరు. అలా ఈ కుర్రాడు కూడా ఓ సీతయ్యే. శోభన్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో తీసిన నవలా చిత్రం ‘ఈ తరం మనిషి’ ఆడియన్స్ కు ప్రాపర్ గా కనక్ట్ కాలేదు. డైరక్టరు, హీరో చెప్పిన మాటే నిజమైంది. సినిమా పరాజయం పాలైంది.

సరిగ్గా అప్పుడే…ఓ బెంగాలీ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారు వెంకటరత్నం.జీవంత మానుష’ అనే ఆ సినిమా యమలోకపు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. దీనికి రచయితగా మొదట ముళ్లపూడి అనుకున్నారు. గురూ నాకంటే డి.వి. నరసరాజుగారైతే ఈలాంటి కథలకు కరెక్టు అని రమణ గారు సిన్సియర్ గా ఇచ్చిన సలహా మేరకు నరసరాజుకు షిఫ్ట్ అయ్యారు. సినిమా పేరు ‘యమగోల’.

నిజానికి ‘యమగోల’ కూడా శోభన్ తోనే చేయాల్సింది. ఆయన నో అనడంతో నరసరాజు సలహా మేరకు ఎన్.టి.ఆర్ ను అప్రోచ్ అయ్యారు. ఎన్.టి.ఆర్ అడ్వైజ్ మేరకు సత్యనారాయణ యముడి రోల్ చేసేశారు.నిజానికి వెంకటరత్నం అయిడియా ప్రకారం ఎన్టీఆర్ తో యముడి కారక్టర్ చేయించి సత్యం సుందరం కారక్టర్లు బాలయ్యతో చేయించాలని … దీన్ని ఎన్టీఆరే తోసిపుచ్చారు. ఆ కారక్టర్లు బాలకృష్ణ చేస్తే పండవని చెప్పి అవి రెండూ తను చేసి యముడుగా సత్యనారాయణను రికమండ్ చేశారు.

తాతినేని రామారావు డైరక్ట్ చేసిన ‘యమగోల’ సినిమా టైటిల్ మాత్రం రామానాయుడు దగ్గర కొనుక్కున్నారు. యమర్జన్సీ మీద విసుర్లు…ఆనాటి రాజకీయనాయకుల మీద సెటైర్లు ‘యమగోల’ సినిమా నిండా గుప్పించేశారు. ఓ సన్నివేశంలో నేరుగా సంజయ్ గాంధీ మీదే కామెంట్ వేయించేశారు. యమర్జన్సీ టైమ్ లోనే కథాచర్చలూ తదితరాలు జరిగినా యమర్జన్సీ ఎత్తేశాకే సినిమా విడుదలయ్యింది. ‘యమగోల’ బంపర్ హిట్ కొట్టింది.

ఈ సినిమాలో డైలాగ్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రికార్టులుగా కూడా రిలీజై రికార్ట స్థాయి సేల్స్ సాధించాయి.అంత పెద్ద హిట్ తర్వాత కూడా వెంకటరత్నం కెమేరా పనికి దూరం కాలేదు. ఎవరైనా ట్రిక్ షాట్స్ తీయాలంటే వెళ్లేవారు. ఎన్టీఆర్ తో క్రాంతికుమార్ తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాకు జస్ట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. డబుల్ యాక్షన్ సీన్స్ ను తనదైన పద్దతిలో తీసి రక్తి కట్టించారు.

‘యమగోల’ తర్వాత వెంకటరత్నం కొంత గ్యాప్ ఇచ్చి ‘పార్వతీ పరమేశ్వరులు’ అనే సినిమా తెరకెక్కించారు. ఎమ్.ఎస్.కోటారెడ్డి డైరక్ట్ చేసిన ఈ మూవీలో సత్యనారాయణ జానకి కీలక పాత్రలు పోషించారు. ‘తాయారమ్మ బంగారయ్య’ స్టైల్ లో తయారైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడేసింది.అయితే దాని తర్వాత మళ్లీ ఎన్.టి.ఆర్ తో ఓ బిగ్ మూవీ ప్లాన్ చేశారు వెంకటరత్నం.

అయితే ఆ సినిమా టైమ్ కు అన్నగారు పొలిటికల్ పార్టీ అనౌన్స్ మెంట్ రావడంతో దేవీ వర ప్రసాద్ తో కల్సి ‘నాదేశం’ తీశారు. ‘లావారిస్’ ఆధారంగా తయారైన ‘నాదేశం’ లోనూ అధికార పక్షం మీద వారసత్వం మీదా సీరియస్ డైలాగ్స్ ఉన్నాయి. ఎన్.టి.ఆర్ పొలిటికల్ ఎంట్రీని ఎలివేట్ చేస్తూ రాసిన …ముఫ్పై సంవత్సరాల నీ రాజకీయాన్ని మూడు నెల్లలో ఔపోసన పట్టాను లాంటి డైలాగ్స్ ధియేటర్లలో మామూలుగా పేలలేదు.

ఒక వైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే మధ్యలో వచ్చి షూటింగ్ చేసేవారు రామారావు. ఆయన ముఖంలో అలసట కొ్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయినా సినిమా పెద్ద హిట్టయ్యింది.ఆ తర్వాత క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘సాగర్’ అనే త్రీడీ పిల్లల సినిమా నిర్మించారు వెంకటరత్నం. ఓ టెక్నీషియన్ గా తనను తాను తృప్తి పరచుకోడానికి ఈ సినిమా తీశారు గానీ లాభం రాలేదు.

ఆ తర్వాత కూడా జంధ్యాల డైరక్షన్ లో నరేష్, పూర్ణిమ జంటతో ‘పుత్తడి బొమ్మ’ తెరకెక్కించారు. జంధ్యాల ఇమేజ్ కు పూర్తి భిన్నంగా తయారైన ఈ సినిమా రిజల్డ్ తేడా అయ్యింది. గుడ్డిలో మెల్ల అందులో వీరభద్రరావు చేసిన కవి కారక్టర్ మాత్రం గుర్తింపుకు నోచుకుని నాలుగు డబ్బుల సంపాదించి పెట్టింది.

ఆఫ్టర్ నా దేశం…నిర్మాతగా వెంకటరత్నం కెరీర్ అంత గొప్పగా నడవలేదు. ‘పుత్తడి బొమ్మ’ తర్వాత బిగ్ మూవీస్ దిశగా ఆలోచన చేసిన వెంకటరత్నం తన ఒకప్పటి బాస్…తన బ్యానర్ తొలి దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబుతో ‘అడవిలో అభిమన్యుడు’ సినిమా తీశారు. మళయాళ దర్శకుడు అనిల్ తీశాడది.

పర్లేదనిపించుందంతే ఆ సినిమా.రామానాయుడు కుమారుడు వెంకటేశ్ హీరోగా ‘అజేయుడు’ సినిమా తీశారు వెంకటరత్నం. వెంకటేశ్ సరసన అప్పటికి ‘విక్రమ్’ తో సక్సస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న శోభనను తీసుకున్నారు. జి. రామ్మోహనరావు డైరక్ట్ చేసిన ఈ మూవీకి జర్నలిస్ట్ బీసెట్టి కథను అందించారు. వెంకటేశ్ కెరీర్ కు పెద్దగా హెల్ప్ అయ్యేలా సినిమా రూపొందలేదు. సినిమా ఓ మోస్తరుగా ఆడింది. నష్టాలూ తేలేదు. అలాగని లాభాలూ రాలేదు.

ఏకైక కుమారుడు కిడ్ని సంబంధమైన వ్యాధితో బాధపడి కన్నుమూయడం లాంటి సంఘటనలు వెంకటరత్నాన్ని మానసికంగా కృంగదీశాయి. ఆయన నెమ్మదిగా నిర్మాణరంగం నుంచే కాదు. తనకు అత్యంత ప్రియమైన కెమేరామెన్ పని నుంచీ కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!