Pudota Sowreelu……………………………
శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము.ఒక్కొక్కరికి 380/రూ. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము.ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే వుంటుంది.సందర్శకులను తీసుకుని వెళ్ళి,తిరిగి తీసుకొస్తారు.మరో ట్రిప్ వుండదు..అందరూ చేరుకోగానే పొద్దున 10 గంటలకు ”జై అక్కమహాదేవి ‘అంటూ డ్రైవరు లాంచీనీ నడపటం మొదలుపెట్టాడు.పాతాళగంగ నుండి 10 కి.మీ దూరంలో ఈ గుహలున్నాయి.
దారిపొడుగునా కొండలు,చేపలు పట్టే మత్స్యకారులు,చెంచుల ఆవాసాలు,నీటికొంగలు,నీటిపక్షులు,కనువిందు చేస్తూనే వున్నాయి.యాత్రికులు మౌనంగా ప్రకృతిని పరిశీలించటంలో మునిగిపోయారు. దూరంగా అక్కమహాదేవి గుహలు కనిపిస్తున్నాయి.లాంచీ గైడ్ శంకర్, అక్కమహాదేవి కథ, గుహల విశిష్టత గురించి చెబుతున్నాడు.”మహాదేవి కర్ణాటకలోని ఉరుతారి అనే వూర్లో శివభక్తులైన తల్లిదండ్రులకు పుట్టింది.ఆమెను వాళ్ళు పార్వతీదేవి రూపంగా భావించి అపురూపంగా పెంచుకుంటున్నారు. మహాదేవి చిన్నప్పటినుంచి శివపూజలు చేస్తూండేది.అందాలరాశి అయిన మహాదేవి యవ్వనవతియై రూపలావణ్యాలతో మెరిసిపోతుండేది.
ఆ రాజ్య పాలకుడైన”కౌశికుడు రాజ్యంలో పర్యటిస్తూ ఉరుతారి గ్రామానికి వచ్చాడు. అక్కడ.మహాదేవిని చూశాడు.ఆమె అందానికి ముగ్దుడై ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు..మహాదేవి తాను శివుణ్ణే భర్తగా తలచి పూజిస్తున్నానని ఇంకొకరిని వివాహమాడనని చెబుతుంది.దీంతో రాజు ఆగ్రహిస్తాడు.మంత్రి బెదిరింపులతో భయపడిన మహాదేవి ఒక షరతుతో పెళ్ళికి ఒప్పుకుంటుంది.తన అనుమతి లేనిదే తనను తాక కూడదని,అలా జరిగిన పక్షంలో తాను అంతపురం వదిలిపోతానని చెబుతుంది.షరతులకు ఒప్పుకుని కౌశికుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
ఒకరోజు ద్యానంలో వున్న మహాదేవిని చూసి రాజు మోహితుడై ఆమెను కౌగలించుకుంటాడు.కోపోద్రిక్తురాలైన మహాదేవి రాజు ఎదుటనే వివస్త్ర అయి ఆభరణాలు త్యజించి,తన కురులనే వస్రాలుగా కప్పుకుని రాజ భవనం నుంచి వెళ్ళిపోయింది. కర్ణాటక లోని కళ్యాణి ప్రాంతానికి చేరి అక్కడ భక్తులకు శివోపదేశాలు చేస్తూ ధ్యానం చేస్తూ కొంతకాలం గడిపింది. అక్కడ నుంచి కాలినడకన శ్రీశైలం .. ఆతర్వాత దట్టమైన అడవుల గుండా ప్రయాణించి ఈ గుహాల వద్దకు చేరుకుంది. ఈ గుహలో వెలిసిన శివలింగాన్ని పూజిస్తూ కొన్నాళ్ళకు శివైక్యమ్ చెందింది.
మహాదేవి ప్రవచనాలను శ్రద్దగా వినే భక్తులు ఈమెను ‘అక్కా’అని పిలిచేవారు.ఆ విధంగా ఆమె అక్క మహాదేవి అయింది.ఈమె రచయిత్రి గూడా శివప్రవచనాలను రాసింది. అక్కమహాదేవి ని నమ్మి పూజిస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయట. ఈ గుహలకు ఎక్కువగా కర్ణాటక నుండి భక్తులు వస్తుంటారు ..” అంటూ శంకర్ అక్కమహాదేవి చరిత్రను చెప్పాడు.
లాంచీ గుహల వద్దకు చేరుకుంది.అందరం లాంచీ దిగి గుహలవైపు నడిచాం. దూరంనుండి మామూలుగా కనిపించిన ఈ గుహలు దగ్గరకు చేరగానే చాలా పెద్దవిగా కనిపించాయి. 200అడుగుల ఎత్తు,200అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పువున్నాయి.అక్కడ సహజంగా ఏర్పడిన పెద్ద శిలాతోరణం కనిపిస్తుంది.. సహజంగా ఏర్పడిన ఆ రాతి స్థంభాలు ఎవరో చేయి తిరిగిన శిల్పి చెక్కిన కళాకృతులు మాదిరి ఉన్నాయి.
గుహ లోపలికి సన్నని సొరంగమార్గం వుంది.వెలుతురు లేని ఆ సన్నని దారిలో టార్చి లైట్ సాయంతో గుహలోని ఆకృతుల అందాలను చూస్తూ ముందుకు కదిలాము.గబ్బిలాల వాసన కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ చీకటి.. వెలుగుల్లో గుహ అందాలను చూస్తున్న మాకు మరి పెద్ద బాధ అనిపించలేదు.సహజంగా ఏర్పడిన శివలింగం దగ్గరకు వెళ్లాలంటే పూర్తిగా నడుం వంచి చాలా సన్నని దారిలో వెళ్ళాలి.విశేషమేమంటే ఈ సన్నని దారిలో ఎంత లావాటి వారైనా పడతారు.
ఎక్కడినుండి వస్తుందో తెలియని ఒక సన్నని నీటిధార నుండి బొట్లు బొట్లుగా శివలింగం పై పడుతూ స్వామికి అభిషేకం చేస్తున్నాయి.ఈ గుడి కమిటీ మెంబర్లు రోజు పొద్దున్నే వచ్చి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి శివలింగానికి పూజ చేసి వెళ్తారట. అందుకే గుహ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి. సొరంగ మార్గంలోనుండి బయటకు వచ్చి వెలుపలి గుహల అందాలు చూసాము.
ఒకచోట ఎత్తయిన రెండు స్థంభాల మద్య శివలింగం,నంది,అక్కమహాదేవి విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. దట్టమైన నల్లమల అడవుల్లో కొండల మద్య వున్న ఈ అక్కమహాదేవి గుహలను పాతాళగంగలో లాంచీలో వెళ్ళి చూసి రావటం ఒక మంచి అనుభూతి ..తిరిగి లాంచీలో వెళ్ళిన దారినే తిరిగి వచ్చాము. రానుపోను 3 గంటల ప్రయాణం..అక్కడ గంటన్నర కాలం గడిపాము. నదిలో ప్రయాణం చేసి ఆ కొండల్లోకెళ్లి తిరిగి రావడం మంచి అనుభూతినిస్తుంది.
ఇది కూడా చదవండి >>>>>>>>>>>> తెరపై భోగాలు … జీవితంలో కష్టాలు !