Dungeswari Caves………………………………..
దుంగేశ్వరి గుహాలయం .. బీహార్ లోని బుద్ధ గయకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. దీనినే ‘మహా కాళ గుహ’ అని కూడా అంటారు.
ఇక్కడే గౌతమ బుద్ధుడు కొంత కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ మార్గాన్ని కూడా ఆయన ఇక్కడే గ్రహించారని చెబుతారు. ఈ సాధన చేస్తున్న సమయంలోనే బుద్ధుడు ఆకలి దప్పులతో ఇబ్బంది పడ్డాడు. ఆత్మత్యాగం చేయబోయారని కూడా అంటారు.
ఆసమయంలో కొండ దిగువ గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ గౌతమునికి భోజనం పెట్టింది…మంచి నీరు అందించింది. ఇక్కడ రెండు ప్రత్యేక గుహాలయాలు ఉన్నాయి. ఒక ఆలయంలో 6 అడుగుల ఎత్తులో ఉన్న బుద్ధుని బంగారు విగ్రహాన్ని చూడవచ్చు. మరో ఆలయంలో బుద్ధుని విగ్రహం తో పాటు హిందూ దేవతలు దుంగేశ్వరి పక్కనే మహా కాళ విగ్రహాలు ఉంటాయి.
కేవలం బౌద్ధులే కాకుండా హిందువులు కూడా ఈ గుహాలయాలను సందర్శిస్తారు. ఇలా హిందూ దేవతల పక్కన బుద్ధుడి విగ్రహం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ గుహల్లో బుద్ధుడు దాదాపు ఆరేళ్ళు ధ్యానం చేసాడని అంటారు.
సుదీర్ఘ ధ్యానం తర్వాత గౌతముడు కొండ దిగువన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వచ్చాడు. అక్కడ తన ఆకలిదప్పులు తీర్చిన సుజాతకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడని అంటారు. ఈ గ్రామాన్ని ఇప్పుడు ‘సుజాత గఢ్’ అని పిలుస్తారు. అక్కడ సుజాత స్మారకార్థం స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ నుంచి బయలు దేరి గౌతముడు గయ చేరుకున్నాడు. అక్కడ మనకు తెలిసిన బుద్ధుడు గా మారాడు. ఆ గయే బుద్ధగయ అయింది. బుద్ధునికి సంబంధించి నాలుగు ప్రధాన క్షేత్రాలు ఉన్నాయి. 1. లుంబినీ – గౌతముడు ఇక్కడే జన్మించాడు. 2. బుద్ధగయ … గౌతముడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ప్రదేశం.. 3. సారనాథ్ – బుద్ధుడు మొదటి సారిగా ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం.. 4.కుషీనగర్ – బుద్ధుడు నిర్యాణం పొందిన ప్రదేశం.
ఈ నాలిగింటి తర్వాత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో దుంగేశ్వరి గుహాలయం ఒకటి. బీహార్ లో చూడదగిన ప్రదేశాల్లో ఇది ముఖ్యమైనది.
దుంగేశ్వరి గుహ సందర్శకుల కోసం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ గయా జంక్షన్.. గుహల నుండి 22 కి.మీ దూరంలో ఉంది. స్థానిక బస్సు, టాక్సీ లేదా ఆటో లో వెళ్ళవచ్చు.
గుహలలో రాత్రిపూట బస చేయడానికి సౌకర్యాలు లేవు, సమీపంలోని గయ, బుద్ధగయలలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అక్టోబరు నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.