ఆ సినిమాతో ఎన్టీఆర్ గెటప్ మారిపోయిందా ?

Sharing is Caring...

Mass hero image with new screen look……………………….

ఆ సినిమాతో ఎన్టీఆర్ స్క్రీన్ గెటప్.. అప్పియరెన్స్ మారిపోయింది..ఆయన కొత్త లుక్ అభిమానులను అలరించింది.  అభిమానుల కోసం స్టెప్స్ వేయడం కూడా మొదలు పెట్టారు. ఆ సినిమానే  ఎదురులేని మనిషి..నిర్మాత మరెవరో కాదు ఇప్పుడు ‘కల్కి’ తో సంచలనం సృష్టించిన అశ్విని దత్.

ఇక దర్శకుడు బాపయ్య .. ఈయన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పెద్ద నాన్నకొడుకే . అప్పట్లో అశ్వనీదత్ ..బాపయ్య ఇద్దరూ కుర్రాళ్లే ..  ఆ కుర్రోళ్ళు ఇద్దరూ కలసి  52 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ను ఎదురులేని మనిషి సినిమా ద్వారా  కుర్రకారుకు దగ్గర చేశారు.

ఇక దర్శకుడు కె. బాపయ్య కు కమర్షియల్ చిత్రం చేయడం అదే తొలిసారి. అందులో అంతకు ముందు చేసిన  రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. కసిగా విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఎన్టీఆర్ వీరాభిమాని అశ్వనీదత్ తోడయ్యారు. వెండి తెర మీద ఎన్టీఆర్ ను కొత్తగా చూపాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ గెటప్ ను పూర్తిగా మార్చేశారు. ఆయన కాస్ట్యూమ్స్,విగ్, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయాయి. ప్రేక్షకులకు కొత్త ఎన్టీఆర్ కనిపించారు.  పాటల్లో ఎన్టీఆర్ తో స్టెప్పులు వేయించారు.

ఈ సినిమా షూటింగ్  ‘కసిగా ఉంది..  కసి కసిగా ఉంది.. కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది ‘ పాట చిత్రీకరణతో మొదలయ్యింది. ఆ పాటను ఆత్రేయ కూడా కసిగా రాశారు.  ఆరోజు ఎన్టీఆర్ షూటింగ్ కి రాగానే ఆ పాట మొత్తం విన్నారు. అశ్వనీదత్ ని పిలిచారు. ఈ పాట కు నేను స్టెప్స్ వేయాలా అని అడిగారు. అశ్వనీదత్ కొంచెం సిగ్గుపడుతూ ‘అవును సార్ .. మిమ్మల్ని కొత్తగా చూపించాలని మా ప్రయత్నం .. మీ అభిమానులు కూడా అదే ఆశిస్తున్నార’ని  చెప్పారు. బాపయ్య కూడా అశ్వనీదత్ ను సమర్ధించారు. 

అశ్వ‌నీ‌దత్‌ మాటలను ఆలకించిన ఎన్టీఆర్ అతని అభి‌మా‌నాన్ని,నిజా‌యి‌తీని మెచ్చు‌కున్నారు. ‘ గో హెడ్ ‘అన్నారు. ఆపాటకు ఎన్టీ‌ఆర్‌ తన వయ‌సును కూడా లెక్క చేయ‌కుండా వాణి‌శ్రీతో కలసి స్టెప్స్‌ వేశారు.‌ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. థియేటర్లు  అభిమానుల ఈలలు ..కేకలతో దద్దరిల్లిపోయాయి. అశ్వ‌నీ‌దత్‌ అంచనాలు  నిజ‌మైనాయి. ఆ సినిమాతో  ఎన్టీ‌ఆర్‌ కొత్త ట్రెండ్‌ మొద‌లైంది.‌ ‌

‘ఎదు‌రు‌లేని మనిషి’‌ శత‌ది‌నో‌త్సవ వేదికపై  ఎన్టీ‌ఆర్‌ ప్రసంగిస్తూ  ‌‘అశ్వ‌నీ‌దత్‌ ఇచ్చిన డ్రెస్‌ వేసు‌కు‌న్నాను.‌ విగ్గు తగి‌లిం‌చు‌కు‌న్నాను.‌ ఆయన ఒక  స్టెప్ వేయమంటే.. రెండు స్టెప్స్ వేశానని .. మారిన అభి‌రు‌చు‌లకు అను‌గు‌ణంగా తానూ మారా‌ను’ అని  చెప్పారు.‌

హిందీలో దేవానంద్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘జానీ మేరా నామ్’ ఆధారంగా ‘ఎదురులేని మనిషి’ సినిమా కథ తయారైంది. భమిడిపాటి రాధాకృష్ణ స్క్రిప్ట్  సమకూర్చారు. సినిమా 1975, డిసెంబర్ 12న  రిలీజై  ఘన విజయం సాధించింది. 

ఈ విజయం ఇచ్చిన స్పూర్తితో  అశ్వనీ దత్  తర్వాత బాపయ్య తోనే యుగపురుషుడు సినిమా తీశారు. అలా ‘ఎదురులేని మనిషి’తో మొదలైన NTR కొత్త గెటప్ 1983 వరకు కొనసాగింది. తర్వాత కాలంలో విడుదలైన చిత్రాలన్నీ ఎన్టీఆర్ కు తిరుగులేని మాస్ హీరో ఇమేజిని తెచ్చిపెట్టాయి.  రాఘవేంద్రరావు అదే వరవడి ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ తో  సినిమాలు తీశారు.

——KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!