నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మరోమారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం చేపట్టినప్పటికీ జానారెడ్డి తెరాస అభ్యర్థి నోముల భగత్ చేతిలో 15,487 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవిత చరమాంకంలో (74 సంవత్సరాల వయసులో ) జానారెడ్డి కి ఇది ఇదే ఆఖరి ఎన్నిక అవుతుందేమో. ఇప్పటివరకు జానారెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నరసింహయ్య చేతిలో 7,771 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా నోముల కుమారుడి చేతిలో మరోమారు ఓటమి చవి చూసారు. ఈ సారి రెండు రెట్లు ఎక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలవడం గమనార్హం. సొంత మండలం అనుమల లో కూడా పెద్దగా ఓట్లు పడలేదు. వరుస పరాజయాల నేపథ్యంలో ఇక రాజకీయాలనుంచి జానా నిష్క్రమించవచ్చు. ఈ సారి ఆయన పోటీ చేయకుండా కుమారుడు రఘువీరా కు ఛాన్స్ ఇచ్చినట్టు అయితే బాగుండేది. ఈ సారి జానా గెలుపుపై కొంత నమ్మకం పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలు ఈసారి విజయం కట్టబెడతారని అంత పెద్ద వయసులోనూ గట్టి ప్రయత్నం చేశారు.
సీనియర్ నేతగా గుర్తింపు పొందిన జానా ఎన్నో పదవులు అనుభవించారు. మొదటిసారిగా 83 లో జరిగిన ఎన్నికల్లో జానా చలకుర్తి టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచారు. క్యాబినెట్ మంత్రి అయ్యారు. అప్పట్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1988 లో ఎన్టీఆర్ 31 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన తీరుకి నిరసన గా టీడీపీ నుంచి బయటకొచ్చారు. కొన్నాళ్ళు సొంతంగా పార్టీ నడిపారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నాటినుంచి నేటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. మొదటి నుంచి జానారెడ్డి ప్రజలతో కలసి తిరుగుతూ , వారి సమస్యల కోసం పనిచేస్తూ జననేత గా ఎదిగారు. అందుకే జనం జానారెడ్డి ని అంతగా ఇష్టపడతారని అంటారు కానీ అదే జనం గట్టిగా గత రెండుమార్లు గెలిపించే యత్నాలు మాత్రం చేయలేదు.
ఇక 2018 ఎన్నికల్లో సాగర్ లో బీజేపీకి 2675 ఓట్లు వచ్చాయి. ఈ సారి 6365 ఓట్లు వచ్చాయి. కొంతమేరకు ఓట్లు పెరిగాయి. సాగర్ లో విజయం సాధిస్తామని బీజేపీ అన్నప్పటికీ ఆ పార్టీ కి మంచి అభ్యర్థి దొరకలేదు. దీంతో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక నోముల భగత్ కి తండ్రి మరణం తాలూకు సానుభూతి కొంత కలసి వచ్చింది. అధికార తెరాస పార్టీ అభ్యర్థి కావడం మరో ప్లస్ పాయింట్. భగత్ కి 74726 ఓట్లు వచ్చాయి. 15487 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.
————K.N.MURTHY