Power of Giripradakshina ………………………
పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు.
పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన శరత్ పూర్ణిమ రోజున లేదంటే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది.అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని అంటారు.
కాబట్టి ఆ వెన్నెలలో అరుణాచలంలో గిరిప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది. శివ నామ స్మరణ చేస్తూ పౌర్ణమి వేళ కొండ చుట్టు ప్రదక్షిణ చేయడం అరుదైన,అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.ఇందువల్ల పాప పరిహారం జరుగుతుందని భక్తులు నమ్ముతారు.ఇక గిరి ప్రదక్షిణతో కొత్త జీవితం మొదలైనట్టు చెబుతుంటారు.
ఈ ప్రదక్షిణ మొత్తం 14కి.మీ ఉంటుంది. కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వారు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కాబట్టి అరుణాచలాన్ని ‘సుదర్శన గిరి’ అని కూడా అంటారు.
ఈ కొండ చుట్టూ తపోవనాలు ,అనేక దివ్య ఔషధ వృక్షాలు ఉన్నాయి. వెన్నెల వేళలో ఈ వనాలు, వృక్షాల మీదుగా వీచే గాలులు గిరి ప్రదక్షిణ చేసేవారికి శారీరిక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయని చెబుతారు. అది మనకు తెలీకుండానే జరుగుతుందని… శరీరం తేలిక అవుతుందని అంటారు.
గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి మొదలుపెట్టి మళ్ళీ అక్కడే ముగించాలి. కొందరు రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఉన్న చిన్న వినాయకుని గుడినుంచి మొదలు పెట్టి.. అక్కడికి వచ్చి ముగిస్తారు.అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివ స్వరూపం కాబట్టి శివుడి ఛుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది.
పౌర్ణమి రోజుల్లో ప్రదక్షిణ చేస్తే మంచిదని అంటారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఆరోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కొందరు దీన్నినమ్మి ఆచరిస్తుంటారు. గిరి ప్రదక్షిణ పాపాలను శుద్ధి చేసి ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్మే ఆధ్యాత్మిక సాధన..
ప్రదక్షిణ చేయడం వల్ల మనస్సు, ఆత్మ శుద్ధి అవుతాయని , ప్రతికూలత, కర్మ భారం తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. గిరి ప్రదక్షిణ వ్యక్తి తనను తాను శుద్ధి చేసుకోవడానికి పుణ్యాన్ని కూడగట్టుకోవడానికి ఒక మార్గం.. ఇది ఆధ్యాత్మిక పురోగతికి ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తారు.
గిరి ప్రదక్షిణకు పౌర్ణమి చాలా శుభప్రదమైన సమయం అంటారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక శక్తిని, ప్రదక్షిణ ప్రయోజనాలను పెంచుతుందని నమ్ముతారు. మరికొందరు వేలం వెర్రి అనుకుంటారు. అయితే ఎవరి నమ్మకం వారిది.
—– KNM