విడాకుల బాటలో గేట్స్ దంపతులు !

Sharing is Caring...

ప్రజారోగ్యం కోసం వేల కోట్ల రూపాయల వితరణ చేసిన అతి పెద్ద చారిటబుల్ సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, మిలిండా దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. బిజినెస్ టైకూన్ బిల్ గేట్స్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. పెళ్లి అయిన 27 ఏళ్ళ తర్వాత వారిద్దరూ కలసి బతకలేమన్న నిర్ణయానికొచ్చారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయసు 65 కాగా మిలిండా వయసు 56 ఏళ్ళు. సత్సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నామని బిల్ గేట్స్ అంటున్నారు. ఈ దంపతులకు జెన్నిఫర్ (25) రోరే, (21), ఫోబ్ (18) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

బిల్ గేట్స్ ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వ్యాపారవేత్తలు , సామాజిక సంస్థలు బిల్ గేట్స్ దంపతులు ఈ వయసులో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని విస్తుపోతున్నారు.విడాకుల విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాము విడిపోయినా బిల్ గేట్స్ ఫౌండేషన్ యధావిధిగా పనిచేస్తుందని .. ఇద్దరం కలిసే ఫౌండేషన్ ను నడిపిస్తామని చెబుతున్నారు.

బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నది. ఇండియాలో ఎయిడ్స్ ప్రాజెక్ట్స్ అన్ని వారి ఫండింగ్ తోనే నడిచాయి.  ప్రస్తుతం కరోనా వైరస్ నివారణ కార్యక్రమాల్లో కూడా ఫౌండేషన్ పాలుపంచుకుంటోంది. కరోనా టీకాలు .. చికిత్సలపై పరిశోధనలు వంటి కార్యక్రమాలకు ఫండింగ్ ఇస్తోంది.   యుఎస్‌లో ఐటి విద్యకు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ,పేదరిక నిర్మూలన,పోలియో నిర్మూలన, పిల్లల పోషణ వంటి కార్యక్రమాలకు ఫౌండేషన్ నిధులు అందిస్తున్నది. హెచ్‌ఐవి, మలేరియా ప్రాజెక్టులకు కూడా  పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నది. ఫౌండేషన్ కు  51 బిలియన్ల కు పైగా ఆస్తులున్నాయి.
మైక్రోసాఫ్ట్ ను స్థాపించాక 1987 లో మిలిండా ఆ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా చేరారు. 1994 లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ 4 వ స్థానంలో ఉన్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!