Super Star Experiment……………………
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల అయిన 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ‘దేవదాసు’ చిత్రాన్ని మరోసారి తెరకెక్కించారు. ఈ దేవదాసు 1974 డిసెంబర్ 6 న విడుదల అయింది. ఈ సినిమా తీయక ముందు సూపర్ స్టార్ సన్నిహితులు ‘దేవదాసు పునర్నిర్మాణం రిస్క్ తో కూడిన వ్యవహారం.. వద్దు ‘ అని చెప్పారు.
‘ANR దేవదాసు టాలీవుడ్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇపుడు రిస్క్ అవసరమా ? ఆలోచించు’ అని సలహా ఇచ్చారు. ‘గత ఇరవై ఏళ్లలో సాంకేతికంగా సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ఈ తరం ఆడియన్స్ కి దేవదాసును సరికొత్తగా అందించాలని డిసైడ్ అయ్యాను’ అన్నారట కృష్ణ. ఇక ఎవరూ ఏం మాట్లాడలేదు.
సినిమా తెరకెక్కింది. విజయ నిర్మల డైరెక్ట్ చేశారు ఇందులో పార్వతిగా విజయనిర్మల ,చంద్రముఖిగా జయంతి నటించారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమా కోసం అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంతా ఉపయోగించారు. సినిమా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. కలర్ సినిమా, మంచి పాటలు,ఆకట్టుకునే సన్నివేశాలున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది.
కృష్ణ దేవదాసు విడుదల సమయంలోనే అక్కినేని దేవదాసు సినిమా కూడా విడుదలైంది. కొత్త దేవదాసు థియేటర్ల పక్కన పాత దేవదాసు విడుదల చేయడంతో రెండు సినిమాల మధ్య పోలిక మొదలైంది. మంచి పాటలు, సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ కృష్ణ దేవదాసు ప్రజలను అంతగా ఆకట్టు కోలేకపోయింది.
నిజానికి పాత దేవదాసు పోటీగా విడుదల కాకపోయుంటే కృష్ణ దేవదాసు సూపర్ హిట్ అయ్యేదేమో. అప్పట్లో కృష్ణ ప్రయోగానికి కూడా ప్రశంసలు కూడా లభించాయి.కొత్త దేవదాసు కొన్ని అంశాలలో ఉన్నతంగా రూపొందింది. ఆత్రేయ మాటలు, ఆరుద్ర గీతాలు వాటిలో సాహితీ విలువలు, ఆ గీతాలను రమేష్ నాయుడు స్వరపరచిన విధానం చిత్రానికి ప్రత్యేకతను చేకూర్చాయి. వి.ఎస్.ఆర్.స్వామి కొన్ని సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.
‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’, ‘మేఘాలమీద సాగాలి’, ‘కల చెదిరింది కథ మారింది’, ‘ఇది నిశీధి సమయం’ మొదలైన పాటలు పాత దేవదాసు పాటలతో పోలిస్తే తక్కువేమి కాదు. తెలుగు దనంతో సంగీత, సాహిత్య పరంగా పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. నిడివి ఎక్కువైంది.. తగ్గించమని సూచనలు రావడంతో ట్రిమ్ చేశారు.
ఇక అప్పట్లో అక్కినేని కావాలనే దేవదాసు హక్కులు కొనుక్కుని కొత్త దేవదాసు పై పోటీగా విడుదల చేశారని ఫిలిం సర్కిల్స్ లో ఇప్పటికి చెప్పుకుంటారు. కృష్ణ తన సినిమా షూటింగ్ మొదలుపెట్టగానే తెర వెనుక పాత దేవదాసు విడుదలకు సంబంధించిన వ్యవహారాలు రహస్యంగా జరిగిపోయాయని అంటారు.
మొత్తం మీద రెండూ ఒకేసారి విడుదల కావడంతో పోలిక అనివార్యమై కొత్త దేవదాసు జనాన్ని మెప్పించ లేకపోయింది. కృష్ణ నటనను అక్కినేని నటనతో పోల్చలేం. కానీ కృష్ణ తనకు చేతనైన రీతిలో ఆ పాత్రను పోషించారు.
ఈ క్రమంలోనే కొత్త దేవదాసుకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన నవయుగ పంపిణీ సంస్థ వారికి అక్కినేని వ్యవహారశైలి పై కోపం వచ్చింది.సారధీ స్టూడియోస్ అప్పటికి నవయుగ వారి అజమాయిషీలోనే ఉండేది. కృష్ణ దేవదాసు ను దెబ్బతీసేందుకు అక్కినేని ప్రయత్నించారని నవయుగ యాజమాన్యం నమ్మింది. అప్పటికప్పుడే అక్కినేని నటించే సినిమాలకు స్టూడియో ఇవ్వకూడదని నవయుగ పంపిణీ సంస్థ వారు నిర్ణయం తీసుకున్నారు.
అక్కినేని కి ఇది పెద్ద షాక్. ఈ క్రమంలో అక్కినేని తన షూటింగులన్నీ బెంగుళూరుకు తరలించుకున్నారు. ఆ తర్వాతనే అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించారు. అప్పట్లో ANR ని జర్నలిస్టులు దేవదాస్ రిలీజ్ విషయం అడిగినప్పటికీ ఆయన సూటిగా జవాబు చెప్పలేదని అంటారు.
అక్కినేని అపుడు అలా ఎందుకు వ్యవహరించారో తెలీదు కానీ … సూపర్ స్టార్ ఏదీ మనసులో పెట్టుకుని కక్ష సాధించే రకం కాదు.1979లో విజయ కృష్ణ పిక్చర్స్ బ్యానర్ పై “ హేమాహేమీలు చిత్రంలో అక్కినేని ని ప్రధాన పాత్రలో పెట్టి కృష్ణ సినిమా తీశారు. దటీజ్ సూపర్ స్టార్. దేవదాసు సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు ..చూడవచ్చు.
———-KNM