Bharadwaja Rangavajhala ………………………………………
ధీర శంకరాభరణ రాగానికి జన్యురాగమైన ఆరభి రాగం లో ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి కనుక దీన్ని ఔడవ రాగం అనచ్చు. అలాగే అవరోహణలోనూ ఐదు స్వరాలూ ఉంటాయి కనుక సంపూర్ణ రాగమని కూడా పిలవొచ్చు. అందుకే ఆనందం, ఆహ్లాదం, పారవశ్యం పలికించాల్సిన సందర్భాలకు ఆరభి రాగాన్ని వాడారు మన సినీ సంగీత దర్శకులు.
విజయావారి అప్పుచేసిపప్పుకూడు కోసం రాజేశ్వరరావు స్వరం కట్టిన ‘సుందరాంగులను చూసిన వేళ’ అరభి రాగంలో చేసిన పాటే. పింగళి వారి సాహిత్యానికి ఘంటసాల రాజాలతో కలసి జీవం పోశారు లీల. మహాగాయకుడు బాలమురళి నారదపాత్రలో నటించిన చిత్రం భక్త ప్రహ్లాద ఎవిఎమ్ వారు తీశారు. ఆ సినిమాకి కూడా సంగీతం సాలూరు వారే అందించారు. అందులో ఉగ్ర నరసింహస్వామి ని ప్రసన్నం చేసుకోడానికి నారదాదులు పాడే పాట ‘నమో నారసింహా’ ఆరభిలోనే స్వరపరిచారు.
సంగీత దర్శకుడుగా ఘంటసాల విశ్వరూపం చూపించిన సినిమా ‘రహస్యం’. లలితా శివజ్యోతీ మూవీస్ బ్యానర్ లో ‘లవకుశ’ తర్వాత వచ్చిన ఈ రంగుల చిత్రం పూర్తి వేదాంత ధోరణిలో సాగుతుంది. తామసముతో ఏదీ సాధించలేరనే విషయాన్ని గురువుకు అర్ధం చేయించడానికి ఓ శిష్యుడు మతిభ్రమించినట్టు నటిస్తూ పాడే తత్వాన్ని ఆరభిలోనే స్వరపరిచారు ఘంటసాల.
‘ఈ జన్మ సరిపోదురా’ అంటూ కథా రచయిత వెంపటి సదాశివబ్రహ్మం సాహిత్యం అందించారు. ఆరభిలో పెద్దగా గమకాలు ఉండవు. అదే సమయంలో వేరియేషన్స్ చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవగాంధారికి దగ్గరగా అనిపించే ఆరభిలో పెండ్యాల నాగేశ్వరరావు కూడా ఓ యుగళగీతాన్ని కంపోజ్ చేశారు.
కె.వి.రెడ్డి స్వంత చిత్రం కృష్ణార్జున యుద్దం చిత్రంలో సుభద్రార్జునుల మధ్య నడిచే ‘తపము ఫలించిన శుభవేళా’ అనే యుగళగీతాన్ని ఆరభిలోనే స్వరపరిచారు. సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో పవిత్రబంధంలో వినిపించే ఓ సూపర్ హిట్ యుగళ గీతం ‘పచ్చబొట్టు చెరిగిపోదులే ‘కూడా ఆరభిలోనే ఉంటుంది.
ఆరుద్ర సాహిత్యం కాస్త ప్రత్యేకంగా వినిపించే ఈ గీతం ఆహ్లాదకరమైన వాతావరణంలోనే సాగుతుంది. భక్తి భావాన్ని చెప్పడానికి సైతం ఆరభి రాగాన్ని వాడారు మన సంగీత దర్శకులు. త్యాగరాయ పంచరత్న కృతుల్లో కూడా ఆరభి వినిపిస్తుంది. జయసింహ చిత్రంలో ఘంటసాల ఆలపించిన ‘జయజయశ్రీరామ’ గీతాన్ని ఆరభిలోనే స్వరపరిచారు సంగీత దర్శకుడు టి.వి.రాజు.
ఆరభి రాగంలో వినిపించే త్యాగరాయ పంచరత్న కృతుల్లో ‘సాధించెనే ఒకటి. సమయానికి తగు మాటలాడెనే’ అంటూ సాగే ఈ కృతి త్యాగయ్య సినిమాలో వినిపిస్తుంది. అయితే అదే వరసల్లో సన్నివేశానికి తగ్గ పద్దతిలో సాహిత్యాన్ని నడిపిస్తూ రక్తి కట్టించారు సీతారామయ్యగారి మనవరాలు దర్శకుడు క్రాంతికుమార్. కీరవాణి సంగీతాన్ని సమర్పించిన ఈ గీతానికి సాహిత్యం సమకూర్చినది వేటూరి సుందరరామ్మూర్తి.
చక్రపాణి సంచాలకత్వంలో బాపు గారు సహాయకుడుగా విజయా వారి కోసం తీసిన చిత్రం ‘రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్.’ నిజానికి బాపు సినిమా అనగానే ముళ్లపూడి మాటలు, ఆరుద్ర పాటలు, మహదేవన్ సంగీతం అనుకుంటారు. ఇవేవీ ఉండవు అక్కడ. పాలగుమ్మి పద్మరాజు సాహిత్యం, పెండ్యాల సంగీతం తో సినిమా రూపుదిద్దుకుంది. ఇంకో విషయం ఈ సినిమా సమయంలో బాపు దగ్గర యువచిత్ర మురారి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు.
మిస్సమ్మ లైనునే కాస్త అటూ ఇటూ చేసి తీసిన సినిమా లో దేవులపల్లి వారి గీతం ‘నా పేరు బికారీ’ పాటను ఆరభి కి దగ్గరగానే నడిపిస్తారు పెండ్యాల. విజయా సంస్ధలోనే వచ్చిన ‘భైరవద్వీపం’ చిత్రంలోనూ ఆరభి లో చేసిన పాట ఒకటి వినిపిస్తుంది. ‘ఘాటైన ప్రేమ ఘటన’ అంటూ సాగుతుందీ యుగళం. ఘాటు ప్రేమకూ విజయా వారికీ ఓ లింకు ఉంది.
పాతాళభైరవిలో పింగళి వారు ‘ఎంత ఘాటు ప్రేమయో’ అంటే దుష్టసమాసం అన్నారు. అయినా పాట పెద్ద హిట్టైంది. దాన్ని గుర్తుకు తెస్తూ…సిరివెన్నెల మరోసారి ఘాటు ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఈ ఘాటు ప్రేమ మీద అప్పట్లోనే సెటైరేశారు శ్రీశ్రీ . ‘ఎంత ఘాటు ప్రేమయో … ఇంత లేటు వయసులో’ … ఎన్టీఆర్ రావణ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించిన సీతారామకళ్యాణం లోనూ ఆరభి రాగం వినిపిస్తుంది.
కైలాసాన్నిపెకలించడానికి ప్రయత్నించి పరమ శివుణ్ణి ప్రసన్నుడ్ని చేసుకుంటాడు రావణుడు. కళ్లెదుట ప్రత్యక్షమైన ఇష్టదైవాన్ని చూస్తూ భక్తి పారవశ్యంలో కీర్తించడం ప్రారంభిస్తాడు. ఈ దండకాల్లో మొదటిది ‘హే పార్వతీనాథ’ ఆరభిలోనే స్వరపరిచారు సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు .’నీ యున్న చందమ్మున’ దగ్గర నుంచీ కాస్త మాయామాళవగౌళ అనిపిస్తుంది. సీతారామకళ్యాణంలోనే మరో గీతం ఆరభి లో స్వరపరచినది ఉంది.
నారదుడు ఆలపించే ఆ గీతాన్ని పి.బి.శ్రీనివాస్ గానం చేశారు. ‘దేవదేవ పరంధామ’ అంటూ సాగే ఆ గీతంలో పల్లవి మాత్రం హిందోళంలో స్వరపరచి..మిగిలిన పాటంతా ఆరభిలో కంపోజ్ చేశారు గాలి పెంచల నరసింహారావు. సినిమా సంగీతానికి ఇది తప్పదు. సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి పాట కంపోజ్ చేసే సమయంలో భావాన్ని పలికించడానికి అన్య స్వరాలను వేయడం సహజంగానే జరుగుతుంది.
మహదేవన్, ఇళయరాజాల తర్వాత శాస్త్రీయ రాగాలను సినిమా పాటలతో అనుసంధానం చేసిన సంగీత దర్శకుల్లో విద్యాసాగర్ ఒకరు. సినిమా సంగీత దర్శకుల్లో ఎవరూ ఉపయోగించని రాగాలను విద్యాసాగర్ వాడారు. ఆయన సంగీతం అందించిన ‘ఒట్టేసి చెబుతున్నా’ సినిమాలో టైటిల్ సాంగ్ లో ఆరభి వాడారు.
శుద్ద సావేరి, సామ రాగాలకు తోడు ఆరభి కూడా వినిపిస్తుందీ పాటలో. శాస్త్రీయ రాగాలను సినిమాల కోసం అద్భుతంగా వాడిన సంగీత దర్శకులు గతంలోనే కాదు..ఇప్పుడూ ఉన్నారు. కొత్త ప్రయోగాలూ చేస్తున్నారు. ఈ టీమ్ లో హరీష్ జైరాజ్ కూడా ఒకరు. సాధారణంగా రెహ్మాన్ తో సంగీతం చేయించుకునే శంకర్ ఎందువల్లో అపరిచితుడు కు మాత్రం హరీష్ జైరాజ్ ను తన టీమ్ లోకి తీసుకున్నారు. అందులో వచ్చే కుమారీ పాటను ఆరభి రాగ ఛాయల్లోనే కంపోజ్ చేశారు హరీష్ జైరాజ్.