అరవైల యుద్ధం తర్వాత.. భారత్, చైనా భాయీ భాయీ అనే నినాదం ఊపందుకుంది. ఏ పాఠ్యపుస్తకంలో చూసినా ఈ నినాదం వుండేది. చైనా మన పొరుగుదేశమే కాదు, మనకు తోడుగా వుండే దేశమని ఆ నినాదం విన్నవారికి అనిపించడం సహజం.
చైనా వస్తువులను బహిష్కరించాలని, వాటిని వాడకూడదని దేశభక్త సంస్థలు ఇటీవల గట్టిగా నినదిస్తున్నాయి. భారతీయులకు ప్రబోధిస్తున్నాయి.
చైనా వస్తు బహిష్కరణ నినాదం వినడానికి శ్రావ్యంగానే వుంది కానీ, ఆచరణలో సాధ్యమేనా? ఒక టిక్ టాక్ యాప్ ను నిషేధించినంత వీజీనేనా? ఏది చైనా వస్తువు, ఏది అమెరికా వస్తువు అన్నది నిర్వచించడం ఎలా? చైనా వస్తువులను బహిష్కరిస్తాం సరే.. చైనా పెట్టుబడులను కూడా బహిష్కరించగలమా? భారతదేశంలో కొన్ని చైనా ఉత్పాదక యూనిట్లు, ముఖ్యంగా మొబైల్స్ కి సంబంధించినవి వున్నాయి. వాటిలో తొంభై శాతం మంది చైనీయులే పనిచేస్తుంటారు. వారందరినీ బహిష్కరిద్దామా? చైనా యూనిట్లలో స్థానికులే కొలువు తీరాలనే డిమాండ్ అందుకుందామా?
భారత్ యూనిట్లలో తయారయ్యాయి కాబట్టి అవి భారత్ ఉత్పత్తులా, లేక చైనా ఉత్పత్తులా? లేక మరో దేశపు ఉత్పత్తులా? చైనా అనేక దేశాలకు మాన్యుఫాక్చరింగ్ హబ్. అమెరికా బ్రాండెడ్ వస్తువులు అనేకం చైనాలో తయారవుతాయి. మరి చైనా వస్తు బహిష్కరణ అంటే చైనాలో తయారైన అమెరికా వస్తు బహిష్కరణ కూడా అంతర్భాగంగా వుంటుందా?
చాలా చాలా విచిత్రం, చాలా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. భారతదేశంలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు రామభక్త, దేశభక్త బీజేపీ హయాంలోనే అమాంతం పెరగటం. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇండియాలో చైనా పెట్టుబడులు అనేక రెట్లు పెరిగాయి. 2014 వరకు చైనా పెట్టుబడుల విలువ 1.6 బిలియన్ డాలర్లు మాత్రమే. అవి ప్రధానంగా చైనా ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిన పెట్టుబడులు. అవి మౌలిక రంగాలలో పెట్టిన పెట్టుబడులు.
మోడీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలో చైనా పెట్టుబడులు ఐదు రెట్లు పెరిగి, 8 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఈ పెట్టుబడులు ప్రధానంగా చైనా ప్రభుత్వ రంగానివి కావు, ప్రెవేటు పెట్టుబడులు. ఇంకా మరిన్ని పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా వాటి విలువ 26 బిలియన్ డాలర్లు. ఇప్పటికే వున్న యూనిట్లలో పెట్టుబడులను చైనా సంస్థలు 4.4 బిలియన్ డాలర్లు పెంచాయి. 2014నాటికి రెండు బిలియన్ డాలర్లులేని చైనా పెట్టుబడులు ఇప్పుడు పాతిక బిలియన్ డాలర్లకు మించిపోతున్నాయి.
మరోవైపు భారతీయ కంపెనీల్లో.. ముఖ్యంగా ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో చైనా వాటా పెరిగింది. టెక్నాలజీ రంగంలో స్టార్టప్స్ అనేకం చైనా పెట్టుబడుల చేతిలో వున్నాయి. ఇంకా ఆమోదం పొందని ప్రాజెక్టుల్లో మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడికి చైనా సంస్థలు సంసిద్ధంగా వున్నాయి.
ఈ పరిస్థితుల్లో మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దౌత్యనీతిని పాటిస్తూ, ఒక వైపు చైనాతో వర్తక వాణిజ్యాలను కొనసాగిస్తూ, మరోవైపు చైనా సైనిక కవ్వింపులను నిలువరించి దేశభద్రతను కాపాడగలుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
——— వాసిరెడ్డి వేణుగోపాల్
మంచి ఎనాలిసిస్ ! మోడీ గారు డ్యూయల్ రోల్ ప్లే చెయ్యడంలో చంద్రబాబు గారికి గురువు !