ఆరుద్ర అద్భుతమైన వంటకం !!

Sharing is Caring...

The film that changed Krishna’s image………………….

హీరో కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి .. ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా అది .  ఈ సినిమా విడుదలై 53 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సినిమాను ఇపుడు చూసినా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే  పద్మాలయా సంస్థ  నిలబడేది కాదు. 

ఆ సినిమానే మోసగాళ్లకు మోసగాడు. నిర్మాతగా మొదటి సినిమా “అగ్నిపరీక్ష ” హిట్ కాకపోవడంతో  హీరో కృష్ణ నిరాశపడ్డారు. ఆ నిరాశ లో నుంచి పుట్టిన కసే “మోసగాళ్లకు మోసగాళ్ళు” తీసేందుకు ముందడుగు వేయించింది. సినిమా గురించి చెప్పుకోవాలంటే విశేషాలు చాలానే ఉన్నాయి. భారత దేశంలోనే  తొలి  కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కృష్ణ ఈ సినిమాతో స్టార్ హీరో గా ఎదిగారు.

ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో కేవలం 28 రోజుల్లో ఈ సినిమా తీయడం ఒక రికార్డు. ఫస్ట్ రిలీజ్ లోనే దాదాపు 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. హాలీవుడ్ సినిమా కథల స్ఫూర్తి తో రూపొందిన ఈ సినిమా ఆంగ్లంలోకి అనువాదమై అక్కడి ప్రేక్షకులను అలరించింది. ట్రెజర్ హంట్ పేరిట 125 కి పైగా దేశాల్లో విడుదలై కనకవర్షం కురిపించింది.  

అలాగే తమిళ్,హిందీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తే మంచి వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.ఈ సినిమా స్ఫూర్తి తో మరెన్నో కౌబాయ్ సినిమాలు తెలుగులో రూపొందాయి. హీరో కృష్ణ తోనే 15  సినిమాలు వరకు వచ్చాయి. వాటిలో కొన్ని బాగానే ఆడాయి. మరి కొన్ని అంతగా ఆడలేదు. ఇవన్నీ పూర్తి అయ్యేవరకు కృష్ణ మళ్ళీ సొంత సినిమాపై దృష్టి పెట్టలేకపోయారు.  

కృష్ణ వారసుడు అయిన హీరో మహేష్  కూడా ‘టక్కరి దొంగ’ అనే  కౌబాయ్ సినిమాలో నటించాడు. దీన్ని తమిళ్ ,హిందీ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేశారు. జయంత్ తీసిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. కృష్ణ అల్లుడు సుధీర్ 2015 లో  “మోసగాళ్లకు మోసగాడు” టైటిల్ తో తీసిన సినిమాలో నటించాడు.ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

ఇక మళ్ళీ మొదటికొస్తే ఈ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్ర కథ మన నేటివిటీ కి దగ్గరగా లేకపోయినా ప్రేక్షకులు అప్పట్లో పట్టించుకోలేదు. కొత్త ట్రెండ్ , బోర్ లేకుండా సాగే కథనం ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఈ సినిమాకు కథ,మాటలు సమకూర్చింది ప్రముఖ రచయిత ఆరుద్ర.నిర్మాతలు చెప్పినట్టు ఆయన కథను వండారు.

దర్శకుడు కే.ఎస్. ఆర్. దాస్ దానికి మసాలాలు అద్ది ప్రేక్షకులకు వడ్డించారు. “గుడ్ ,బ్యాడ్ అండ్ అగ్లీ” లో  కొంత … “మెకన్నాస్ గోల్డ్” లో కొంత, “ఫ్యూ డాలర్స్ మోర్ “లో కొంత కథను , సన్నివేశాలను కోసుకొచ్చి రోట్లో వేసి బాగా తొక్కి,  మసాలా వేసి దంచి కొత్త కథను  ఆరుద్ర తయారు చేశారు. అది బాగా నచ్చడం తో ఇక మార్పులు లేకుండా కృష్ణ సినిమా తీశారు.

మొదట్లో ఈ సినిమాను ఆరుద్రనే కృష్ణ డైరెక్ట్ చేయమన్నారట.ఆయన తన వల్ల కాదని తేల్చి చెప్పడంతో దాస్ రంగం లోకి దిగారు. అప్పటికే దాసు తో కృష్ణ కు బాగా పరిచయం ఉండటం, యాక్షన్ సినిమాలు తీసి ఉండటం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. దాస్ కూడా తన సత్తా చాటుకున్నారు.తొలుత ఈ సినిమాకు “అదృష్టరేఖ” అనే టైటిల్ పెడదామనుకున్నారు కానీ చివరకు “మోసగాళ్లకు మోసగాడు” టైటిల్  ఖరారు అయింది.

హీరోను ఎడారిలో వదిలి వెళ్ళినపుడు తాగడానికి నీళ్లులేక , ఎండ వేడిమికి  మొహమంతా పొక్కులు వస్తాయి. కృష్ణకు ఆ విధంగా మేకప్ చేసేందుకు మేకప్ మ్యాన్ మాధవరావు శ్రమపడ్డారు. బఠానీలపై ఉండే తొక్కును మొహంపై అతికించి మేకప్ చేశారు. దాంతో సన్నివేశానికి కావాల్సిన విధంగా కృష్ణ కనిపించారు. 

ఇక వి. ఎస్. ఆర్. స్వామి కెమెరా పని తనం  సినిమాకు వన్నె తెచ్చింది.నక్క జిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు ..ఆ క్యారెక్టర్ ఊతపదం ‘అబ్బయ్య’  కూడా బాగా పేలింది. నాగభూషణం పై చిత్రీకరించిన పాట ‘ఎలాగుంది  ఎలాగుంది అబ్బాయా’  కూడా సరిగ్గా కథకు సరిపోయింది. ఆది నారాయణరావు సంగీతం కూడా సినిమాకు ఊపు నిచ్చింది.  

సూపర్ స్టార్ కృష్ణ ఆస్థాన రచయిత అప్పలాచార్య నాగభూషణం పాత్ర ద్వారా కొంత కామెడీ అందించారు. ఈ సినిమా కథ ఆధారంగా వెండితెర నవల కూడా వచ్చింది. కృష్ణ అభిమాని విజయ్ దీన్ని తీసుకొచ్చారు. కృష్ణ తర్వాత కొందరు కౌబాయ్ పాత్రలు పోషించినా కృష్ణను మరిపించలేకపోయారు.  

కాబట్టి కృష్ణే ఎవర్ గ్రీన్ కౌబాయ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పాట మాదిరిగానే కృష్ణ జీవితంలో “కోరినది నెరవేరినది”. యూ ట్యూబ్ లో సినిమా ఉంది … చూడని వారు  చూడొచ్చు.

 
————-KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!