ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా… నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు వేయించారో ? అందరికి తెలుసు.
ఇప్పటికి చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ విపక్షాలు మామను వెన్నుపోటు పొడిచారని విమర్శలు చేస్తుంటారు. అదంతా చరిత్ర. వాటికి సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని వక్రీకరించడం ఎవరికి సాధ్యంకాదు. ఎవరైనా అవన్నీ అబద్ధాలని అన్నప్పటికీ …. అది బుకాయింపు మాత్రమే.
రెండు మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ తనయుడు బాలయ్య ఆహా ఓటీటీ వేదికపై మాట్లాడుతూ “కొందరు ఎన్టీఆర్ను పిల్లలు సరిగా చూసుకోలేదంటూ.. వెన్నుపోటు పొడిచారని విమర్శలు చేశా”రని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకరు ఏదైనా విషయం పదిసార్లు చెబితే అదే నిజమనుకుంటా”రని కూడా బాలయ్య వ్యాఖ్యానించారు. ఆయన ఆ సందర్భంగా చాలా బాధపడ్డారు. “నేను ఎన్టీఆర్ కుమారుడినే కాదు అంతకుమించి అభిమానిని కూడా” అన్నారు.
ఆ వెంటనే “పార్టీని కాపాడుకోవటం కోసం..నాడు” అంటూ మరేదో చెప్పాలనుకుని “సరే అది పక్కన పెట్టండి అంటూ..తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడద”ని ఆ చర్చ అంతటితో ముగించేశారు. కుటుంబం, రాష్ట్రం, రాజకీయం వేరని అన్నారు. అన్నీకలిపి కలగాపులగం చేసేశారంటూ బాలయ్య భావోద్వేగానికి గురయ్యారు.
బాలయ్య మాటలను బట్టి ఆయనకు చాలా విషయాలు తెలియవని …. తెలిసినా బయటపడటం లేదని అనుకోవాలి. ఎన్టీఆర్ స్వయంగా ఏమన్నారో కింద వీడియో చూస్తే ఎవరికైనా విషయం అర్థమౌతుంది. బాలయ్య బాబు బహుశా ఈ వీడియో చూసి ఉండకపోవచ్చు. ఆనాడు ఆయన షూటింగ్ ల్లో బిజీగా ఉండొచ్చు. చూసినా మర్చిపోయి ఉండవచ్చు. విపక్షాలు మాట్లాడితే .. అక్కసు కొద్దీ యేవో ఆరోపణలు చేశారని అనుకోవచ్చు. మరి నాడు ఎన్టీఆర్ స్వయంగా చేసిన ఆరోపణలను ఎలా చూడాలి ? నాడు ఏమి జరిగింది ? ఎలా జరిగింది ఎన్టీఆర్ స్వయంగా వివరించారు.
నాడు ఎన్టీఆర్ ఏమన్నారో వినండి .. చూడండి.