పద్యాలే ఆ సినిమాకు ప్లస్ అయ్యాయా ?

Sharing is Caring...

శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి నిర్యాణం వరకు కొన్ని కీలక ఘట్టాలతో తీసిన సినిమా ఇది. 54 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కృష్ణుడిగా అందంగా కనబడతారు. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. మొదటి భాగం అంతా కృష్ణుడి లీలలు రెండో భాగం రాయబారం .. కురుక్షేత్ర యుద్ధానంతరం ధృతరాష్ట్రుని వద్దకు పాండవులు రావటం, ధృతరాష్ట్ర కౌగిలి..గాంధారీ శాపం … యదుకుల వినాశం, కృష్ణ నిర్యాణంతో చిత్రం ముగుస్తుంది.

కృష్ణుడి పెళ్లిళ్లు .. ఏకకాలంలో అందరి ఇళ్లలో ఉండటం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల తరపున రాయబారిగా శ్రీ కృష్ణుడు  వెళ్లి కౌరవులతో సాగించిన సంధి ప్రయత్నాలను ఈ సినిమా లో వివరంగా చూపారు. సినిమా హిట్ కావడానికి తిరుపతి వెంకట కవుల పద్యాలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ హక్కులు ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. వాటినే దానవీరశూర కర్ణలో కూడా ఉపయోగించారు.

హీరో కృష్ణ తీసిన కురుక్షేత్రం సినిమాకు అలాంటి పద్యాలూ లేకపోవడం మైనస్ పాయింట్ అయింది. అప్పట్లో పద్య నాటకాలు బాగా చూసే వారు. తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి గాంచిన చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి పాండవోద్యోగం నాటకం కోసం రాసిన పద్యాలవి. వాటి హక్కులు నెల్లూరులో రామానుజం శెట్టి అనే ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనే శ్రీ కృష్ణ రాయబారం సినిమా తీశారు. పద్యాలు సూరి బాబు కంపోజ్ చేశారు.

నిర్మాత పుండరీకాక్షయ్య వెళ్లి వాటికి పెద్ద మొత్తమే ఇచ్చి హక్కులు తీసుకున్నారు. వాటినే ఈ సినిమాలో వాడారు. ఈ సినిమాలో ఆ పద్యాలనూ ఘంటసాల పాడగా .. దానవీర శూరకర్ణలో ఎస్పీ బాలు .. రామకృష్ణ పాడారు. పౌరాణిక చిత్రాల్లో నారద పాత్రను ఎక్కవగా కాంతారావే చేశారు. కానీ ఈ సినిమాలో శోభన్ బాబు నారద పాత్రలో కనిపిస్తారు. ముందు కాంతారావునే బుక్ చేసుకోగా ఆయన చెప్పాపెట్టకుండా వేరే సినిమా షూటింగ్ కి హైదరాబాద్ వెళ్లారు.

దీంతో ఎన్టీఆర్ సూచన మేరకు శోభన్ బాబు ని పిలిపించి విషయం చెప్పారు. తొలుత సందేహించినా తర్వాత శోభన్ అంగీకరించారు. ఈ సినిమాలో దుర్యోధనుడి పాత్రకి ముందుగా ఎస్ వి రంగారావుని అనుకున్నారు. అయితే పాత్ర నిడివి తక్కువగా ఉండటం … సినిమాలో దుర్యోధనుడికి అంత ప్రాధాన్యత లేదని ఫీల్ అయి  రంగారావు చేయనని చెప్పారు. అపుడు కైకాల సత్యనారాయణ సీన్ లోకి వచ్చారు.

అప్పటికే అన్నగారితో సత్యనారాయణకు పరిచయం ఉంది.  కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ కి డూప్ గా నటిస్తున్నారు. కొన్ని కండిషన్స్ పెట్టి ఆ పాత్ర సత్యనారాయణ కి ఇచ్చారు. రోజూ పుండరీకాక్షయ్య ఆఫీసుకు వచ్చి, రాత్రి డైలాగులు ప్రాక్టీసు చేయాలి. దాంతోపాటు రాజసం ఒలికేలా నడవడం …  గద పట్టుకోవడం వంటి అంశాలలో కూడా తర్ఫీదు ఇచ్చారు. తర్వాత రోజుల్లో కమలాకర కామేశ్వర రావు గుర్తు పెట్టుకుని మరీ కురుక్షేత్రంలో దుర్యోధనుడి పాత్రే ఇచ్చారు.

ఇందులో కాంచన సత్య భామ పాత్ర పోషించింది. టీవీ రాజు సంగీతం అందించారు. సినిమాలో  పాత్రలు ఎక్కువ.పాత కాలం నటులు అందరూ ఉన్నారు. పుండరీ కాక్షయ్య .. తిరుపతయ్య ( నిర్మాత దేవీ ప్రసాద్ తండ్రి) ఈ సినిమాను నిర్మించారు. దేవీ ప్రసాద్ కూడా ఎన్టీఆర్ తో తర్వాత కాలంలో సినిమాలు తీశారు. 21 రీళ్ల ఈ సినిమా పౌరాణికాలంటే ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుంది.  యూట్యూబ్ లో సినిమా ఉంది. చూడనివారు .. ఆసక్తి ఉన్న వారు చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!