Singeetham Experiment ………………………………….
పుష్పక విమానం … 1987 లో విడుదలైన సినిమా ఇది. టాకీ యుగంలో రూపొందిన మూకీ సినిమా ఇది. వేరే సినిమా పాటలు. వెంకటేశ్వర సుప్రభాతం… పిల్లల ఏడుపులు , కాకుల అరుపులు మినహా ఒక్క డైలాగు కూడా లేని సినిమా ఇది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. అన్ని భాషల్లో టైటిల్ కార్డ్స్ వేసి రిలీజ్ చేసారు.
ఇందులో కమల్ హాసన్ హీరో గా చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగం ఇది. ఆయనే నిర్మాత .. ఆయనే దర్శకుడు. కమల్ హాసన్ కొంత పెట్టుబడి పెట్టారు. కమల్ కి జోడీగా అమల నటించారు. కథ అల్లుకున్న తీరు దాన్ని తెరపైకి ఎక్కించిన విధానం అద్భుతంగా ఉంటుంది. డైలాగు లేకుండా కేవలం హావభావాలతో విషయాన్ని చెప్పగల సత్తా ఉన్న నటుడు కమల్ కాబట్టి సింగీతం ఆయనను ఎంచుకున్నారు. కమల్ కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు.
డైలాగులు, పాటలు ఉన్నప్పటికీ కథలో పట్టు లేకపోతే బోర్ ఫీల్ అవుతాం.. ఈ సినిమాలో అసలు డైలాగులు లేకపోయినా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం. కథలో పట్టు ఉంది. ఊహించని మలుపులు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఈ సినిమా విడుదలై 37 ఏళ్ళు అవుతోంది. సినిమా కథ ఇప్పటి ప్రపంచానికి అనుగుణంగా ఉంటుంది.
‘ఒక రోజు రాజుగా’ అనే కథ ఆధారంగా సింగీతం ఈ కథ తయారు చేసుకున్నారు. సినిమా మొత్తం సహజ సన్నివేశాల సమాహారం అని చెప్పుకోవచ్చు. కమల్ ఇందులో ఒక నిరుద్యోగి పాత్ర చేశారు. ఆపాత్ర ను సింగీతం చక్కగా తీర్చిదిద్దారు. కమల్ కరెక్ట్ గా సూటయ్యారు.
కమల్ పాత్ర రూపాయి కాయిన్‌ను పైకెగరేసి బిచ్చగాడిని గేలి చేసే టైపు .. అలా ఒక రోజు రూపాయి నాణెం చూపగా దానికి ఆ బిచ్చగాడు తనచొక్కా మడతల్లో దాచిన నోట్లు .. కూర్చున్న గొనె పట్టా కింద ఉన్న నోట్లు చూపిస్తూ పో పో రా అన్నట్టు చూస్తాడు. బిచ్చగాడి పాత్రలో పీఎల్ నారాయణ జీవించారు. బిచ్చగాడు చనిపోయిన రోజున అతను సంపాదించిన సొమ్మంతా గాల్లోకి ఎగిరిపోతుంది.
బాడీ తీసుకెళ్తున్న వాళ్ళు దాన్ని అక్కడే వదిలేసి ఆ సొమ్ము కోసం ఎగబడతారు. డబ్బు కన్నా జీవితంలో విలువైనది సంతృప్తి.. అని కమల్ పాత్ర గ్రహించడంతో కథ ముగింపుకొస్తుంది. సినిమాలో టిను ఆనంద్ కమల్ ను చంపేందుకు ప్రయత్నించే సన్నివేశాలు బాగుంటాయి. అమల తండ్రి రమేష్ చేసే మ్యాజిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
అమల పాత్ర చిన్నదే అయినా బాగా చేసింది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ని అనుకున్నారు. సింగీతం ఆమె మేనేజర్ ను సంప్రదించగా మాధురీ మాటల్లేని సినిమాలో నటించదు తేల్చి చెప్పారట. ఈ క్రమంలో సింగీతం అమలను ఎంపిక చేసుకున్నారు.
సినిమాలో సమీర్ కక్కర్ , ఫరీదా జలాల్ వంటి విభిన్న భాషా నటీనటులు వివిధ పాత్రలు పోషించారు. అందరూ పరిణితి గల నటులు కావడంతో సినిమా అద్భుతంగా తెరకెక్కింది. కథనానికి తగిన రీతిలో సంగీతాన్నందించిన వైద్యనాధన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
అలాగే గౌరీ శంకర్ కెమెరా పనితనం కూడా అద్భుతమే. ఈ సినిమా కి మంచి ఆదరణ లభించడంతో సింగీతం కమల్ తో మరికొన్ని ప్రయోగాలు చేశారు. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది చూడని వారు చూడొచ్చు. చూసినవారు చూడొచ్చు.
——–KNM