Did the Taliban gain the upper hand?…………………………….
పాకిస్థాన్ సహాయంతో పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలన్నీ అబద్దమని పంజ్ షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ చెబుతోంది. పంజ్ షీర్ లోయలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినట్టు కూడా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఏది వాస్తవమో ? ఏది అవాస్తవమో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది.
రెండు పక్షాల మధ్య జరిగిన యుద్ధంలో కొంతమంది పంజ్ షీర్ యోధులు మరణించారు. తాలిబన్ల ప్రకటన ప్రకారం పంజ్ షీర్ వారి వశమైంది. పాకిస్థాన్ పంపిన డ్రోన్ల సహాయంతో పంజ్‌షేర్ దళాలపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో స్మార్ట్ బాంబులను ఉపయోగించారని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ దాడుల్లో ఇరుపక్షాలకు చెందిన వారు కన్నుమూసారు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన పంజ్ షీర్ యోధులు కూడా గట్టిగానే ప్రతిఘటించినట్టు చెబుతున్నారు.అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నివశించే ఇంటిపై బాంబుల వర్షం కురిపించడంతో ఆయన తప్పించుకుని వెళ్లినట్టు సమాచారం. అసలు ఆయన అక్కడ లేనే లేరు… టర్కీ లో ఉన్నారని చెబుతున్నారు.
పాకిస్థాన్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ అహ్మద్ కొన్ని రోజులుగా కాబుల్‌లోనే మకాం వేసి వ్యూహ రచన చేసినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఫయాజ్ అహ్మద్ కనుసన్నల్లోనే పాక్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ల ద్వారా .. హెలికాప్టర్ల ద్వారా బాంబ్ దాడులు నిర్వహించినట్లు పంజ్ షీర్ ప్రాంత నేత అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ ఆరోపించినట్టు వార్తలు వచ్చాయి. ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
హిందూకుష్ పర్వతాల్లోని పంజ్ షీర్ లోయ ఇప్పటివరకు అజేయమైన కోటగా నిలిచింది. ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే ఎక్కువ. వీరు అహ్మద్ షా మసూద్ అధిపత్యంలో గెరిల్లా యుద్ధంలో కాకలు తీరిన యోధులుగా మారారు.1980లో సోవియట్ రష్యా దాడులను తిప్పికొట్టారు. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ పోరాటం చేశారు. ప్రస్తుతం తాలిబన్ల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచ దేశాలు వీరికి ఏ సహాయం చేయలేదు.