Dr.Vangala Ramakrishna ……………………. How did that darshan begin?
పార్వతీదేవి అభ్యర్థనపై నందిని ప్రమద గణ నాయకునిగా చేశాడు శివుడు. ఉద్యోగవంతుడైన నందిని ఒక ఇంటివాడిని చేయాలని పార్వతి ముచ్చట పడింది. మరుత్తుల కుమార్తె ‘సుయశ’తో వివాహం చేశాడు శివుడు. ఒక్కడిగా మిగిలిపోయిన శిలాదుని శివుడు ప్రమద గణాలలో ఒకడిగా చేశాడు. తండ్రినన్న అహం విడిచిపెట్టి నందికొలువులో చేరి సేవించుకున్నాడు శిలాదుడు.
దేవదానవులు పాలసముద్రం చిలికినప్పుడు బైటపడిన హాలాహలాన్ని శివుడు సేవిస్తుండగా, అందులో కొద్ది మొత్తం నేల మీద చిమ్మింది. నంది వెంటనే దానిని నాకేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
శివపార్వతులు కైలాసంలో ఎప్పుడూ పరస్పర అనురాగబద్ధులై పదిలంగా ఉండాలని నంది కోరుకుంటాడు.
ఈ గుణాన్ని సమర్థించే కథ ఒకటి “తిరువిళైయాడళ్ “ అనే తమిళపురాణంలో కనబడుతుంది. ఈ పురాణం ప్రకారం ఒక కాలంలో పార్వతి జాలరి స్త్రీగా అవతరించింది. ఆమె తండ్రి జాలరి దొర. . శివపార్వతులను ఏకం చేసేందుకు నంది పెద్ద చేపగా అవతరించి జాలరిగూడెం లో కలకలం రేపాడు. ప్రజల బాధలు చూడలేక పెద్దచేపను పట్టి బంధించిన వాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేశాడు గూడెం దొర.
శివుడు జాలరి యువకునిగా మారి చేపను బంధించాడు. సాహసయువకుని శౌర్యం మెచ్చిన జాలరిదొర అన్న మాటకు కట్టుబడి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. శివపార్వతులు మళ్ళీ ఏకమైనందుకు ఎంతగానో ఆనందించిన నంది నిజరూపం ధరించి కైలాసానికి వెళ్ళిపోయాడు.
నంది పార్వతి దగ్గర శిష్యరికం చేసి దివ్య జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. తర్వాత తానే ఒక జ్ఞానమూర్తిగా మారి నంది విద్యను రూపొందించాడు. సనక, సనాతన, సనందన, సనత్కుమార, తిరుమూలర్, వ్యాఘ్రపాద, పతంజలి, శివయోగి అని ఎనిమిది మంది సుప్రసిద్ధ సిద్ధులకు జ్ఞాన బోధచేసి వారిని జ్ఞానమూర్తులుగా మార్చాడు. ఈ ఎనిమిది మంది శిష్యులు ఎనిమిది దిక్కులకు వెళ్ళి జ్ఞానాన్ని వ్యాపింపజేసి సుప్రతిష్ఠితం చేశారు.
శివ భక్తులలో అఖండ పేరుప్రతిష్ఠలు గలవాడు నందనార్. దళితకులానికి చెందిన నందనార్ చిదంబర నటరాజ ఆలయాన్ని సందర్శించాలని కలలుగనేవాడు. తాను వెట్టికి పనిచేసే యజమానిపై తిరగబడి చిదంబరం బయల్దేరాడు. మార్గ మధ్యలో అతను శివుని దర్శనం కోసం ‘ తిరుపుంగూర్’ లో ఆగాడు. నందనార్ భక్తిని పరీక్షించాలనుకున్న నంది తల అడ్డువచ్చేలా నిక్కాడు.
నందనార్ తన దురదృష్టానికి వగచి ఆర్తితో శివుని ప్రార్థించాడు. కరుణించిన శివుడు నందిని తల పక్కకు తిప్పుకుని నందనార్ కు దర్శనం కలిగించ మన్నాడు. పాటించాడు నంది. ఫలితంగా నందనార్ నంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకుని కైలాసగతుడయ్యాడు. అప్పటి నుంచి శివుని కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకోవడం ఒక సంప్రదాయంగా ఏర్పడింది. అదే శృంగ దర్శనం అయింది.