Bharadwaja Rangavajhala ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తూర్పుగోదావరి జిల్లా కృష్ణారాయుడు పెదపూడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారో పెద్దమనిషి. పేరు కె.వి.రావు. హెచ్.ఎమ్.రెడ్డి, ఆదుర్తి, బాపు లాంటి దర్శకుల దగ్గర సహకార దర్శకుడు ఆయన. స్వామి చిత్రానంద కలం పేరుతో బోల్డు రచనలూ చేశారు.
ఇంటర్మీడియట్ లో ఉండగా వాచీ అనే టైటిల్ తో చిత్రగుప్త పత్రికలో ఓ కథ రాయడంతో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభం అయ్యింది. పూర్ణా పిక్చర్స్ లో పబ్లిసిటీ ఇన్ ఛార్జి గా చేరారు. తర్వాత రోజుల్లో ఖైదీబాబాయ్ సినిమా తీసిన డైరక్టర్ టి. కృష్ణ చొరవతో హెచ్.ఎమ్.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడుగా చేరారు.
అలా మద్రాసు వెళ్లారు. ‘ప్రతిజ్ఞ’ చిత్రానికి పనిచేశారు. ‘వద్దంటే డబ్బు’ టైమ్ లో ఎన్టీఆర్ తో స్నేహం కుదిరింది. అది శ్రీనాధ కవిసార్వభౌమ వరకు కొనసాగింది. బాపు రమణలతో కలసి పిల్లలకు వీడియో పాఠాలు ప్రాజెక్ట్ లో పనిచేశారు.
ఎన్టీఆర్ కూ రావుగారి మీద పెద్ద గురి. యమగోల సిన్మా కు రావుగార్ని అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమిస్తేనే ఆ సినిమా చేస్తా అని వెంకటరత్నానికి కండిషన్ పెట్టారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ కోరినట్టే రావుగార్ని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు వెంకట రత్నం. ఆ చిత్రానికి తాతినేని రామారావు దర్శకుడు. సినిమా సూపర్ హిట్ అయింది.
బాపు తో వరసగా పదమూడు సినిమాలకు సహకార దర్శకుడిగా పనిచేశారు. దర్శకత్వం జోలికి వెళ్లకుండా సుదీర్ఘ కాలం సహాయ దర్శకుడుగా ఉండిపోయారాయన. ఒక్కోసారి నిస్సహాయ దర్శకుడుగా కూడా మారాననేవారాయన. అంటే దర్శకుడు రానప్పుడు తనే దర్శకుడైపోవాల్సి వచ్చేదట.
టి.కృష్ణ తీసిన అపాయంలో ఉపాయం, ఆదుర్తి గుణవంతుడు, తాతినేని రామారావు దగ్గర చల్లని నీడ, మంచి మిత్రులు చిత్రాలకు…బాపు దగ్గర మొదట ఇంటి గౌరవం, బాలరాజు కథ చిత్రాలకు పనిచేశారు. అక్కినేని సంజీవి దగ్గర విశాలి, మల్లమ్మకథ సినిమాలకు పనిచేశారు.అట్నుంచి ప్రత్యగాత్మ దగ్గర దీక్ష మూవీకి పనిచేశారు.
అక్కడ నుంచి బాపు దగ్గర మాత్రమే పనిచేశారు. దర్శకత్వం వైపు వెళ్లలేదు. రచనా వ్యాసంగాన్ని మాత్రం వదల్లేదు. అరవై కథలు, మూడు నవలలు, రెండు సీరియళ్లు, ఒక టీవీ సీరియల్లూ, ఒక రేడియో నాటిక రాశారాయన. సినిమాకు సంబంధించిన అనేక అంశాలను విజయచిత్ర, రచన పత్రికల్లో రాశారు.