దేవదాసు vs దేవదాసు ! (1)

Sharing is Caring...

Many movies with one story……………………………………

విషాద ప్రేమ కథా చిత్రం  దేవదాసు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. 1953 జూన్ 26 న విడుదల అయిన ఈ సినిమా కు 70 ఏళ్ళు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి..బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన సుప్రసిద్ధ నవల దేవదాసు ను ప్రముఖ నిర్మాత, రచయిత చక్రపాణి తెలుగులోకి అనువదించారు.

దాన్ని తొలుత సుప్రసిద్ధ హీరో అక్కినేని నాగేశ్వరరావు తో నిర్మించారు. ఆ సినిమా విడుదలైన 21 ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దేవదాస్ పాత్రను తానే చేస్తూ పునర్నిర్మించారు. ఈ సినిమాను విజయ నిర్మల డైరెక్ట్ చేస్తూ  పార్వతి పాత్రను పోషించారు. ఇక హిందీలో అయితే ఇదే దేవదాసును చాలా సార్లు తీశారు.  

1951లో నిర్మాత డిఎల్ నారాయణ  దేవదాసు నవలకు వెండితెర రూపం ఇవ్వాలని నిర్ణయించారు. హీరోగా అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో కామెంట్స్ వినిపించాయట. కానీ వాటిని ఆయన ఖాతరు చేయలేదంటారు. డాన్స్ మాస్టర్ గా పేరొందిన వేదాంతం రాఘవయ్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారని కూడా విమర్శలు వచ్చాయి. 

తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌నాడే పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసు విడుదలైంది. ఆ ప్రభావం తెలుగుపై పడకపోవడంతో దేవదాసు ఘన  విజయం సాధించింది.
సినిమా నిర్మాణంలో  ఒడిదుడుకులను ఎదుర్కొని విడుదల తర్వాత దేవదాసు చిత్రం సక్సెస్ అయింది.  తెలుగులో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది.

ఈ సినిమాతో నాగేశ్వరరావు క్రేజ్ అమాంతం పెరిగింది. కథానాయికగా నటించిన సావిత్రికి కూడా ఈ సినిమా ఎంతో పేరు తీసుకొచ్చింది. మొత్తంగా ‘దేవదాసు’ తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.ఈ చిత్రం సాధించిన రికార్డులు కూడా ఎన్నోఉన్నాయి. 

ఈ సినిమాకు సముద్రాల సీనియర్ స్క్రిప్ట్ సమకూర్చారు . సరళమైన పదాలతో సంభాషణలు రాసారు. .. సీఆర్ సుబ్బరామన్ సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. దేవదాసు’ చిత్రంలో ముందుగా పార్వతి పాత్రకు భానుమతిని అనుకున్నారు. ఆ తర్వాత షావుకారు జానకి ని  తీసుకోవాలనుకున్నారు. ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో చివరకు పార్వతి పాత్ర సావిత్రిని వరించింది.

ఈ సినిమా సావిత్రి నట జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా అక్కినేని ,సావిత్రిలకు ఎలాంటి ఇమేజ్ తెచ్చింది అంటే వాళ్ళ తర్వాత సినిమాల్లో చాలావరకూ ట్రాజెడీ లుగానే ఉండేవి. ఒకానొకదశలో ట్రాజెడీలంటే  విసుగెత్తి పోయి అక్కినేని కావాలనే మిస్సమ్మ సినిమాలో చిన్నదైనా సరే కామెడీ పాత్ర ను చేసారని అంటారు.

అయినప్పటికీ ఆ తరువాత కూడా ట్రాజెడీ ఎండింగ్ ఉన్న సినిమాలను ఆయన చెయ్యాల్సి వచ్చింది  తాగుబోతు దేవదాసు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు 100 శాతం న్యాయం చేసారు. దేవదాసు పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసారు.

అప్పట్లో దేవదాసు సినిమా 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమాలో పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ అని చెప్పుకోవాలి. ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బరామన్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఎం.ఎస్‌.విశ్వనాథ్‌న్‌ నేపథ్య సంగీతాన్ని అందించారు. సుబ్బరామన్ మధ్యలో చనిపోగా ఎం.ఎస్.విశ్వనాథన్ జగమే మాయ వంటి పాటలకు ట్యూన్స్ కట్టారు. 

ఇక దేవదాసు’ తమిళంలో కూడా 65 వారాలు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. అయితే తెలుగులో దేవదాసు అని ,తమిళ్ లో దేవదాస్ అని పేరు పెట్టారు. రెండు భాషల్లోనూ ప్రధాన పాత్రల్లో అక్కినేని,సావిత్రి లే నటించారు. చంద్రముఖి గా మలయాళ నటి లలిత (నటి శోభన మేనత్త) నటించారు.

తెలుగు,తమిళ్ రెండు వెర్షన్స్ కూ వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు.రెండు భాషలకూ సి.ఆర్. సుబ్బురామన్ సంగీత దర్శకత్వం వహించగా పాటలన్నీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి . “ఓ … దేవదా  ” “పల్లెకు పోదాం .. పారును చూద్దాం ” కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ” “జగమే మాయ ”  ” అంతా  భ్రాంతి యేనా ” ” అందం చూడవయా “ఇలా ప్రతీ పాట  ఇప్పటికీ తెలుగువాళ్ళ మనస్సులో నిలిచిపోయాయి .

pl. Read it also ……………  దేవదాసు vs దేవదాసు ! (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!