ఎన్నికల వేళ సీబీఐ నోటీసులు..టెన్షన్ లో దీదీ !

Sharing is Caring...

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో  తృణమూల్  పార్టీ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బంధువుకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. అభిషేక్ బెనర్జీ మరదలు మేనక గంభీర్ భర్త అంకుశ్ అరోరా, ఆయన తండ్రి పవన్ అరోరాలను ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఆదేశించింది.

ఇదే కేసులో కొద్దీ రోజుల క్రితం బెనర్జీ సతీమణి రుజిరా, మరదలు మేనక గంభీర్‌లను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ ఇప్పటికే బొగ్గు స్మగ్లింగ్ రాకెట్ తో సంబంధాలున్నట్టు అనుమానం వచ్చిన వారందరిని విచారిస్తోంది. కాగా పార్టీ సెక్రటరీ జనరల్, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి కూడా సీబీఐ సమన్లు జారీ చేసింది. ఐ-కోర్ పోంజి స్కామ్‌ కేసులో ఆయనను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.ఐ-కోర్ కంపెనీ ఏర్పాటు చేసిన  కార్యాక్రమాలకు పార్థ చటర్జీ హాజరైనట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికమొత్తాల్లో లాభాలు వస్తాయంటూ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసి మోసిగించినట్టు ఐ-కోర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని మంత్రి పార్థ చటర్జీ చెబుతున్నారు.  ”నన్ను పిలిస్తే, తప్పకుండా వెళ్తాను.విచారణకు సహకరిస్తానని ఛటర్జీ మీడియాకు చెప్పారు.  శారద, రోజ్‌వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీల మాదిరిగానే.. ఐ-కోర్ కూడా అనేక పథకాలు ప్రచారం చేసి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసగించినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటి పైనే విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే  శారద కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమీర్ చక్రవర్తి, ప్రముఖ ఆర్టిస్ట్ సువప్రసన్నలకు  రెండురోజుల క్రితం ఈడీ సమన్లు జారీ చేసింది. ఇలా వరుసగా విచారణ సంస్థలు సమన్లు జారీచేస్తుండటంతో  పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది.  

ఇక కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన సీఎం మమతా బెనర్జీ..ఇవాళ డిశ్చార్జ్  అయ్యారు. రెండురోజుల క్రితం నందిగ్రామ్‌లో ఆమెపై జరిగిన దాడి అనంతరం ఆమె కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేహెచ్ ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల చికిత్స అవసరమైనప్పటికీ దీదీ అభ్యర్ధన మేరకు ఆమెను డిశ్చార్జీ చేశారు. ఈ నెల 27 నుంచి మొత్తం 8 దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని  తృణమూల్ ఇక్కడ 2011, 2016 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతుండడంతో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కిన క్రమంలో సీబీఐ నోటీసులు ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!