‘వేణు’వై వచ్చావు భువనానికీ …

Sharing is Caring...

 సురేశ్‌ వెలుగూరి ………..  

వాసిరెడ్డి వేణుగోపాల్‌ అనే మనిషి ఎవరు? ఆయనకూ, ఈ ప్రపంచానికీ వున్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకి మానవ శాస్త్రం (ఆంత్రోపాలజీ) ఒక మేరకు సమాధానమివ్వగలదు. కానీ, ఆ ‘మనిషి’ మాత్రమే ఈ ప్రశ్నకు సవివరమైన జవాబివ్వగలుగుతాడు. వాసిరెడ్డి వేణుగోపాల్‌ అనే మనిషి కూడా అంతే.  వేణు గారు ఈ భూమ్మీద దగ్గరదగ్గర అరవై ఏళ్లు జీవించాడు. ఈ అరవై ఏళ్ల జీవితాన్ని విశ్లేషించుకుంటే ఆయన మనకి నాలుగు దశలుగా కనిపిస్తాడు … సైన్స్‌లో లార్వా, ప్యూపా, గొంగళిపురుగు, సీతాకోకచిలక లాగా.  బాల్యం, విద్యార్థి ఉద్యమాలతో పరిచయం అయ్యేదాకా ఒక దశ. వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై, దానిని నరనరానికీ ఎక్కించుకున్న అధ్యయన శీలత్వం రెండో దశ. ఇది ఆయన జీవితంలో ఉచ్ఛ దశ. నా అవగాహన మేరకు ఈ దశ ఒక రెండు దశాబ్దాల పాటు వుండివుండొచ్చు. ఈ దశే లేకపోతే వాసిరెడ్డి వేణుగోపాల్‌ అనే మనిషి లేనేలేడు. ఉన్నా, ఒక ‘అల్పజీవి’గా మిగిలిపోయివుండేవాడు. ఇలా తనపై, తన వర్క్‌ పై ఒక నివాళి పుస్తకం ప్రచురించే స్థాయికి అర్హుడయ్యేవాడు కాదు.

వేణు గారి ప్రస్థానంలో మూడవ దశ ఉద్యోగాల జీవితం. ఇదంతా ఒక చిత్ర విచిత్రమైన దశ. ఎప్పుడు ఏ పత్రికలో పనిచేస్తున్నాడో, అక్కడ ఎంతకాలం వుంటాడో తెలీని దశ. కానీ, ఈ దశ లోనే ఆయన తన జీవితంలో చేయాల్సినంత ఎక్కువ పనిచేశాడు. అప్పటిదాకా ఒక నిరుపమానమైన అధ్యయనశీలిగా తాను సముపార్జించిన జ్ఞానాన్ని అక్షరాల రూపంలో పెట్టడానికి, ఒక నిఖార్సయిన జర్నలిస్టుగా గొప్ప వ్యాసాల్ని, సంపాదకీయాల్ని రాయడానికీ ఉపకరించిన దశ. ఈ దశలోనే ఆయన చిన్న పత్రికా, పెద్ద పత్రికా, సోషల్‌ మీడియానా అనే తేడా లేకుండా తన అక్షరాల్ని, వాక్యాల్ని రాసుకుంటూపోయాడు. నిజానికి ఇది ప్రతి రచయితకీ, జర్నలిస్టుకీ తప్పక వుండాల్సిన అలవాటు. ఆయా కాలాల్లో చరిత్రలో జరిగే ఘటనలకు ప్రత్యక్ష సాక్షులైనవారు … తమ అనుభవాల సారాంశాల్ని ఖచ్చితంగా అక్షరాల రూపంలో పెట్టితీరాలి. ఫలితంగా మానవశాస్త్రం మరింత విస్తృతం కావడానికి వీలవుతుంది. రాబోయే తరాల వారు మరింత క్షుణ్ణంగా వాటిని అధ్యయనం చేయగలుగుతారు.

వాసిరెడ్డి వేణుగోపాల్‌ ఆ పనిని చాలా జాగ్రత్తగా పూర్తిచేశారు. కాబట్టే, ఈ పుస్తకం మన చేతుల్లో వుంది. ఇక నాలుగో దశ మిగిలిన మూడు దశలకూ పూర్తిగా, భిన్నమైన, తత్వవిరుద్ధమైన దిశ. వేణు గారు ఈ దశలో తనను తాను ఒక కొత్తకోణం లోకి మార్చుకున్నారు. అందుకు ఫేస్‌బుక్‌ను ఒక అనువైన టూల్‌గా ఎంచుకున్నారు. సొంత పబ్లిషింగ్‌ సిస్టమ్‌ను ఏర్పరచుకున్నారు. కొన్ని విలువైన పుస్తకాల్ని  తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. వీటిలో ఆయన రాసిన పుస్తకాలు మూడే. బంగారం, వాసిరెడ్డి హనుమంతరావు గారి జీవితచరిత్ర, ఆంధ్రభూమిలో తాను రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు. కానీ, పలువురు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహిస్తూ వారు రాసిన పుస్తకాలను వేణు గారు తన పబ్లికేషన్స్‌ నుంచి ప్రచురించారు. ఇదే సమయంలో ఇంకో భిన్నమైన పార్శ్వాన్ని ప్రదర్శించారు. అదే ‘రోటిపచ్చళ్ల ఉద్యమం’. బహుశా ఆయన జీవితంలో ఇదే ఆఖరి ఉద్యమం. రోటిపచ్చళ్ల వల్ల ఆరోగ్యానికి కలిగే మంచిని జనం ముందుకు తీసుకువచ్చి, లక్షన్నరమందితో ఒక ఫేస్‌బుక్‌ గ్రూపును నడుపుతున్నారు.

వేణుగారు జర్నలిజం లోకి అడుగుపెట్టిన తొలిరోజుల నుంచే ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో చాలా విలువైన వ్యాసాలు రాశారు. ఎకానమీ మీద ఆయనది అసామాన్యమైన పట్టు. ఆర్థికశాస్త్ర మూలాల్ని అటు పశ్చిమ దేశాలతో పోల్చడం సరికాదంటూనే … ఇంకోవైపు మార్క్సిస్టు తరహా పంథాలు భారతదేశానికి అవసరమని చెప్పిన మనిషి. ఈ కంట్రాస్ట్‌ వేణు గారి మెదడును భిన్న భావజాలాల సంఘర్షణల మధ్య నలిపివేయాల్సింది. కానీ, వాస్తవంలో అందుకు భిన్నంగా జరిగింది.  కారణం – ఆయన అధ్యయన శైలిలో వున్న గొప్పదనం. తత్వాన్ని అర్థం చేసుకోవడంలో కొన్ని స్వీయ పరిమితుల్ని నిర్దేశించుకుని, ఆ చక్రం లోనే తనను తాను బంధించుకుని, దాన్నే బయటికి నిజాయితీగా ప్రదర్శించినవాడు.

మిత్రుడు నామాడి శ్రీధర్‌ చెప్పినట్టు … 30 ఏళ్ల క్రితం నాటి వేణుగోపాల్‌కీ, మరణానికి ముందు దశలో వున్న వేణుగోపాల్‌కీ అసలు సంబంధమే లేదు. ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం; దానిమీద తనకుతాను  అంతర్ముఖంగా ఆలోచించుకోవడం; అది తన తత్వానికి ఎంత దూరమో, ఎంత  దగ్గరో ఒక కొలతను నిర్దేశించుకోవడం, దానికి అనుగుణంగా వ్యవహరించడం ద్వారా … వాసిరెడ్డి వేణుగోపాల్‌ తనను తాను ఒక అజాతశత్రువు లాగా మలచుకున్నారు.దాదాపు ఒక దశాబ్దం పాటు వేణు గారితో సన్నిహితంగా మెలిగాను. ఎక్కడా ఆయన తన నవ్వు ముఖాన్ని తప్ప ఇంకో ముఖాన్ని ప్రదర్శించగా నేను చూడలేదు. ఈ స్థితప్రజ్ఞత చాలా తక్కువమందిలో కనిపిస్తుంది. మేమిద్దరం మూడు సంవత్సరాల పాటు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో పక్కపక్క స్టాల్స్‌ని అడిగి మరీ తీసుకున్నాం. పుస్తకాలు అమ్మడం కంటే … అనేక విషయాలు మాట్లాడుకోవడం లోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం. మీతో వుంటే నా పుస్తకాలు అమ్ముకోవడానికి టైమ్‌ చిక్కడం లేదని, కాబట్టి 2020 బుక్‌ఫెయిర్‌లో మీ పక్కన స్టాల్‌ తీసుకోనని, లాటరీని ఫాలో అవుతానని చెప్పాను. అప్పుడాయన పగలబడి నవ్విన నవ్వును ఎప్పటికీ మర్చిపోలేను.

”మీరెక్కడికి పోతారు సార్‌! మనది మన పుస్తకం అట్టల కంటే బలమైన బంధం. మీ అంతట మీరే నా పక్క స్టాల్‌కొస్తారు చూడండి” అన్నారు. కరోనా కారణాల రీత్యా 2020లో బుక్‌ఫెయిర్‌ లేదు. జరిగివుంటే ఇటు హైదరాబాద్‌లో, అటు విజయవాడలో రెండు చోట్లా ప్రాంగణాలకి ఆయన పేరే పెట్టివుండేవారు. అయితేనేం; ‘2019 బుక్‌ఫెయిర్‌ ఆఖరిరోజు 2020 జనవరి 1న జరిగింది. కాబట్టి 2020 బుక్‌ఫెయిర్‌లో పాల్గొన్నట్టే కదా’ అన్నారాయన. రెండో తేదీన బుక్‌ఫెయిర్‌ గ్రౌండ్‌లో పుస్తకాలను ప్యాక్‌ చేసుకుంటూ కూర్చుని దాదాపు నాలుగు గంటలు గడిపాం. అదే ఆఖరు ఆయనను చూడడం. అనుకోకుండా నాకు బ్రెయిన్‌ సర్జరీ జరగడం, కరోనా వంటి కారణాల వల్ల … ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప వ్యక్తిగతంగా కలవలేకపోయాను. ఇక కలవలేను.

వేణు గారి ఆఖరి రోజులు నన్ను, ఆయన మిత్రుల్ని బాగా కలవరపెట్టాయి. ఒక మనిషి ఎంత గొప్పగా జీవించగలడో; ఎంత ఎత్తు దిగి జీవించగలడో … జీవితపు అత్యున్నత, అత్యల్ప దశల్లో నిరూపించినవాడు వాసిరెడ్డి వేణుగోపాల్‌. ఆ విలక్షణతే ఆయన్ని ‘రాజా గారు’ అని మిత్రులు ఆప్యాయంగా పిలుచుకునేలా చేసింది. వేణు గారితో నా స్నేహం, ఆయనతో గడిపిన కాలం చాలా చిన్నదే. కానీ, బోలెడన్ని అనుభవాల కలయిక అది. . వేణు గారిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి అవి మరింత ఉపయోగపడతాయి. ఇక సెలవు అధ్యక్షా !

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!