సుమ పమిడిఘంటం ………………………………………………….
మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ అనే బదులు బి. జె. పి నుంచీ బి. జె. పి వరకు అనవచ్చు. అంటే భారతీయ జనసంఘ్ పార్టీ నుంచీ నేటి భారతీయ జనతా పార్టీ వరకు. ఇందులో ఆధునిక భారతీయ రాజకీయ చరిత్ర ఇమిడి ఉంటుంది.
దానితోపాటు వాజ్ పాయ్, అద్వానీ ద్వయం, RSS చరిత్ర కొంత, మోదీ, అమిత్ షా ద్వయ విశేషాలు రాజకీయ నాయకులు వేసిన అనేక సెటైర్లతో కూడిన నవల అనటానికి వీలులేని ఉత్కంఠ భరితమైన లేటెస్ట్ విహంగ వీక్షణం లాంటి 535 పేజీల ఆకర్షణీయ ముఖచిత్రం తో కూడిన పుస్తకం. వాజ్ పాయి, అద్వానీ చాల ముఖ్యమైన విషయం మాటలాడుతున్నట్లు, వెనుకవైపు ఎడముఖం పెడముఖంగా ఫోటోలున్నపుస్తకమిది.
ఈ గ్రంథ ఆంగ్లభాష మూల రచయిత శ్రీ వినయ్ సీతాపతి. వీరు ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. రాజకీయ శాస్త్రవేత్త, న్యాయవాది, పాత్రికేయుడు, ప్రొఫెసర్. వీరింతకు ముందు Half lion పి. వి. నరసింహారావు గారి గురించి గొప్పగా ఆదరణ పొందిన గ్రంథం రాశారు. దానిని కూడ వల్లీశ్వర్ గారే తెలుగులోకి అనువదించారు.
దీని అనువాద రచయిత శ్రీ జి. వల్లీశ్వర్. వీరు నాలుగున్నర దశాబ్దాల పాటు అనేక పత్రికలలో రిపోర్టింగ్ లోనూ, పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ మేగజైన్ ఎడిటర్ గా పనిజేసి, అనేక అనువాదాలు చేసిన అనుభవజ్ఞులు.
ఒక సంగీత సభలో వేర్వేరు శాఖలకు చెందిన విద్వాంసులు కలిసి పోటాపోటీగా కచేరి నిర్వహించటాన్ని (అది గానం కావచ్చు, వాయిద్యం గావచ్చు) జుగల్బందీ అంటారు.దీన్ని అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ మధ్య ప్రతిక్షేపించారు రచయిత.
RSS స్థాపించిన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ తెలంగాణ నుంచి నాగపూర్ వలస వెళ్ళిన మరాఠీ బ్రాహ్మణులు. మూడుసంవత్సరాలు శ్రమపడి 99 మందితో ఈసంస్థ స్థాపించారు హెడ్గేవార్. వాజ్ పాయి గ్వాలియర్ లో తండ్రి పనిజేసే స్కూల్ లోనే చదువుకున్నారు. తండ్రి ఇంగ్లీష్, హిందీ లలో అందంగా అనర్గళంగా మాట్లాడేవారు. చాలా మధ్యతరగతి కుటుంబం.
అద్వానీ అలాకాదు. కరాచీలో సంపద్వంత కుటుంబం. వీరుకూడ వాజ్ పాయి లాగానే తండ్రి చేతిలో తీర్చబడ్డారు. అద్వానీకి సింధీ, ఇంగ్లీషు బాగావచ్చు. హిందీ అంతరాదు. వాజ్ పాయికి హిందీ లో వున్నంత పట్టు ఇంగ్లీషులో లేదు. RSS కు హెడ్గేవార్ తరువాత సంఘ బాధ్యత గురూజీ గోల్వాల్కర్ తీసుకున్నారు. వీరు క్రైస్తవ మిషనరీలలో చదువుకుని రామకృష్ణ మిషన్ లో పనిజేసిన అనుభవాన్ని సంఘ్ పనితనానికి కొంత జోడించారు.
వీరికి రాజకీయాల పట్ల విముఖత. హిందూ ధర్మ రాజ్య స్థాపన రాజకీయ ప్రమేయం లేకుండా స్థాపించాలని మనసులో ఉండేది. 1948సం.నాటికి RSS లో ప్రచారక్ లతో సహా మొత్తం కార్యకర్తల సంఖ్య 50 లక్షలు.32 సం. ల వయసులో కలకత్తా విశ్వవిద్యాలయం వైస్- ఛాన్సలర్ గాచేసి రికార్డు సృష్టించి, రాజకీయ నాయకునిగా లబ్ద ప్రతిష్ఠుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ గురూజీతో చర్చించి బతిమాలి ఒప్పించి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని అంగీకరింపజేశారు.
పార్టీ కోసం గురూజీ గోల్వాల్కర్ ఐదుగురు బంగారు కణికలను బహూకరిస్తాను. ఎలా మల్చుకుంటావో నీఇష్టం అని బలరాజ్ మథోక్, దీనదయాళ్ ఉపాధ్యాయ, సుందర్ సింగ్ భండారే, నానాజీ దేశ్ ముఖ్, వాజ్ పాయిలను RSS నుంచీ ముఖర్జీ కి అప్పజెప్పారు. వీరితో ప్రారంభమైంది జనసంఘ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ. శ్మాం ప్రసాద్ ముఖర్జీ గారు ఇంగ్లీషు, బెంగాలీ భాషలలో అనర్గళంగా ఉపన్యసిస్తారుగానీ హిందీలో శూన్యం. ఉత్తర భారతదేశంలో హిందీ అవసరం. అందుకోసం అనువాదకునిగా వాజ్ పాయి పనిజేశారు. ఆ అవకాశం ఆయనకు ఎనలేని ఛరిష్మా జాతీయ నాయకత్వ స్థాయి సమకూర్చింది.
I am only unmarried but not bachelor అన్న వాజ్ పాయి రహస్య ప్రేమగాధను ఎవరితో ఎలా అని వాజ్ పాయి ఉపన్యాసమంత సున్నితంగా విశదీకరించారు రచయిత. ఆ తరువాత వాజ్ పాయి, అద్వానీల కలయిక స్నేహం, వ్యతిరేకత, ప్రేమ వాత్సల్యం, తగాదాలు, ఒకరికొకరు శిష్యరికం ఇలా అనేక కోణాలు అత్యంత ఉత్కంఠ ఉత్సుకత కలిగేలా వివరించారు రచయిత.
జనసంఘ్ పార్టీకీ, అది బిజెపి గా రూపాంతరం చెందిన పిదప కూడా బాంబే డైయింగ్ రాజాధిరాజు ధారాళంగా విస్తారంగా అధికంగా విరాళాలిచ్చి ఆదుకుంది పాకిస్థాన్ జాతిపిత మహమ్మదాలి జిన్నా మనుమడు అనే రహస్యాన్ని సవివరంగా వివరించారు రచయిత.
అంతేగాదు RSS నిషేధానికి గురయినపుడు కొంతమంది సంఘ కార్యకర్తలకు షెల్టరిచ్చి ఆదుకున్నది కూడ ఈ జిన్నా మనుమడే. ఇలా మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే సంగతులు ఈ గ్రంథంలో ఎక్కువగా కనిపిస్తాయి. కాంగ్రెస్, హిందూమహాసభ, ఎమర్జెన్సీ, జనతా పార్టీ విఫలం, ఇలా జాతీయ రాజకీయాల్లో జరిగిన అన్ని సంఘటనలు ఈ గ్రంథంలో మనకు ప్రత్యక్షమవుతాయి.
యువత తప్పనిసరిగా చదివి రిఫరెన్స్ కొరకు దాచుకో వలసిన రాజకీయ భేతాళ పంచవింశతిక లాంటి పుస్తకం. ఖరీదు కూడ తగినట్టుగా వుంది. డిస్కౌంట్ తో రూ. 340/- ఎమెస్కో వారు ప్రచురించారు. ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు.