అనంతపురం ఫుడ్ టేస్ట్ అదరహో!

Sharing is Caring...

ఈస్ట్ సైడ్ తాడిపత్రి (పెమ్మసాని వారి రాజధాని)వెస్ట్ సైడ్ పెన్నహోబిళం (పెన్న ఒడ్డున సదాశివరాయలు కట్టించిన దేవాలయం)నార్త్ సైడ్ గుత్తి, కసాపురం (తిమ్మరుసు వారిది)సౌత్ సైడ్ పెనుగొండ, లేపాక్షి…(పెనుగొండ – అష్టపదులకు వ్యాఖ్యానం వ్రాసిన ఒంటికన్ను తిర్మలరాయలు, భట్టుమూర్తి వసుచరిత్ర తాలూకు ఘనగిరి, ఇక లేపాక్షి – అచ్యుతరాయల వారి కాలపు కూర్మగిరిపై కట్టిన ఘనమైన దేవాలయం)ఆల్ సైడ్స్ ఘనమైన చరిత్రకు, తెలుగువాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి నెలవు, అనంతపురం.

అనంతపురం – బయటవారికి తెలియదు కానీ, ఆహారపదార్థాల విషయంలో ఓ hidden jewel. అంతే కాదు, ఇది పేదవాడి జేబుకు దగ్గర.పొద్దున పూట అల్పాహారం, భోజనం,సాయంత్రం ఉపాహారం, స్వీట్లు, బేకరీ పదార్థాలు, చిరుతిండ్లు, పానీయాలు – అన్నిటా అనంతపురానికి ఉన్న వైవిధ్యం, విశిష్టతా ప్రత్యేకం.

అనంతపురంలో గొప్ప గొప్ప హోటళ్ళలో కాక, బయట చిన్న చిన్న ఇళ్ళలో, కొట్టులలో, రోడ్డు పక్కన బళ్ళలో టేస్ట్ బావుంటుంది.పొద్దున ఉపాహారం: సాధారణంగా దొరికే ఇడ్లీ, వడ, పూరీ, ఉప్మా, వగైరాలతో బాటు, అనంతపురం ప్రత్యేకం – ఉగ్గాణి + మిరపకాయ బజ్జీ. (ఉగ్గాణి – ఉగ్రాణ నుండి వచ్చింది.

ఉగ్రాణమంటే వంటిల్లు లేదా స్టోర్ రూమ్. కన్నడంలో ಒಗ್ಗರಣೆ అంటే తిరుగుమోత) అనంతపురంలో కారందోసె కూడా ఫేమస్. మామూలు మసాలాదోసెపై పప్పులపొడి (పుట్నాల పొడి) చల్లి, ఉర్లగడ్డ, చట్నీతో దొరికే పదార్థం ఈ కారం దోసె. పైన ఉపాహారాలన్నిటికీ, అనంతపురం ప్రత్యేకమైన శనగబుడ్ల చట్నీ – కాంబినేషను.

అనంతపురంలో దొరికే – కరకరలాడే మద్దూరు వడ కూడా ఆంధ్రులలో చాలామందికి తెలియదు.ఇక సాయంత్రం అల్పాహారానికి సాటివచ్చే వైవిధ్యత ఇంతోటి హైదరాబాద్ లో కూడా లేదు. మొదటి రోడ్డు బజ్జీలు, మిరపకాయను నిలువునా చీరి, అందులో గింజలు తీసి, ఉల్లికారం కూరిన బజ్జీలు ప్రత్యేకం, ఆపై కట్ మిర్చీ – ఇది దాదాపు 30 యేళ్ళపై బడి నడుస్తూంది.

గుంతపొంగనాలు (పాత బస్టాండు వెనుక వైపు, ముత్యాల రెడ్డి డైరీ ఎదురుగా); నారాయణ బొరుగులు (ఇప్పుడు లేదు కానీ, ఒకప్పుడు ఈయన బండి కనబడితే దొమ్మీలు జరిగేవి. డిమాండు తట్టుకోలేక ఈయన ఒక్కోరోజు ఊర్లో ఒక్కో చోట దుకాణం తెరిచేవాడు. అయినా అరగంటలో ఊరంతా బండి ఆనవాళ్ళు పాకిపోయేవి)

జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, బియ్యం రొట్టె….. (ఒక్కొక్కటి కేవలం పది రూపాయలు)కమలానగర్ లో , సున్నం గేరులో కోమటోల్లు నడిపే ఓళిగ సెంటర్లు , ఓళిగల్లో రకాలు మా గొప్పగా వుంటాయి.రెండేండ్ల కిందట మహానాడు కోసం ఇక్కన్నుంచే ఓళిగలు సప్లై చేశారుఇవన్నీ అటుంచితే అలసంద వడలు – ఇవొక్కటీ చాలు. అనంతపురం గురించి చెప్పుకోవటానికి.

ఇంకా వంకాయ, టొమాటొ, పప్పుల బజ్జీలు, ఉర్లగడ్డ బజ్జీలు….కాస్త లేటుగా, చీకటిపడుతుండగా ఇడ్లీసెంటర్లు, దోసెలూ తయారవుతాయి. టవర్ క్లాక్ కు పక్కన ఓ బండిలో వేసే కమ్మని దోసెలకు మరెక్కడా సాటి లేదు. ఇక పానీపూరీ కట్లెట్ వగైరాలూ…భోజనం – కమలానగరంలో గణేష్ మెస్ – స్వామి అరిటాకులో ఆవునెయ్యి భోజనం కేవలం 50 రూ. మాత్రమే.

ఇంకా ఫుల్ భోజనం అయితే 70 రూ. మధు పుల్కాలు, సన్మాన్ హోటల్… అలా ఉంచితే, అనంతపురం రాగిముద్ద, నెయ్యి, + చింతొక్కు/సాంబారు రుచి చూసిన వాడెవ్వడూ వదిలిపెట్టడు. రాగి ముద్ద కాకుండా సంకటి కాస్త వరైటీ. పానీయాలలోనూ అనంతపురం విశిష్టమైనది. అనంతపురంలో దొరికే అరుదైన పానీయం – నన్నారి. అనంతపురం జిల్లా అడవుల్లో దొరికే ఓ విధమైన వేరును ఉడకబెట్టి, చక్కెరపాకం జోడించి – దీని కాన్సన్ ట్రేట్ చేస్తారు.

ఇది Non alcoholic’s alcohol లాంటిది. ఇక మహావీర్ ఐస్క్రీము, బాదం పాలు, కమలా నగర్ లో లస్సీ, ముత్యాలరెడ్డి డయరీలో బాసుందీ…అనేక పార్లర్లలో వేసవికాలంలో మజ్జిగ….అనంతపురం నడిబొడ్డున 1950 లలో స్థాపించిన బెంగళూరు బేకరీ – రుచికి ఇంతవరకూ ఎదురే లేదు.

కొబ్బరి బిస్కట్లు, వెన్న బిస్కట్లు, సేండ్ విచ్, కారా బన్, దిల్ పసంద్….స్వీట్లు – ముత్యాలరెడ్డి కోవా, దూద్ పేడా – ఈ బాక్స్ మీద ఏ విధమైన హడావుడీ ఉండదు. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దొరుకుతుందంతే. ఇక పిండివంటల్లో భక్ష్యాలు, నిప్పట్లు, కజ్జికాయలు, పాకం పప్పు – వీటి సెంటర్లు పట్టణంలో అడుగడుగునా కనిపిస్తాయి.

ఇంకా RDT MAIN OFFICE పక్కన కాశిం హోటల్లో దొరికే నాటు దోశలు,చట్నీ బస్టాండు దగ్గర మమత హోటల్లో వెజ్, నాన్ వెజ్ రెండూ సూపర్గా వుంటాయి ట్రై చేయండి. ఇవన్నీ అనంతపురంలో కొన్ని మాత్రమే. భోజనం/ఉపాహారం విషయాల్లో ఇంత విశిష్టత, వైవిధ్యత ఉన్నా, పైకి చెప్పుకోవడం లేని సాదా సీదా ప్రపంచం అనంతపురానిది.

రాత : రవి కుడ్యాసురుడు తో కలిసి Gorantla Saheb Peera

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!