మేళం వాయిస్తూ ఉండగా బ్రెయిన్ సర్జరీ !

Sharing is Caring...

A rare surgery……………………………………………..

ఇటలీలో కొద్దీ రోజుల క్రితం ఒక అరుదైన శస్త్రచికిత్స చేశారు అక్కడి వైద్యులు. పేషంట్ శాక్సోఫోన్( మేళ వాయిద్యం) వాయిస్తూ… ఉండగా అతని మెదడులోని కణితిని తొలగించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. పేషంట్ సృహలోనే ఉండి శాక్సో ఫోన్ వాయిస్తూనే ఉన్నాడు.

డాక్టర్లు తమ పని తాము చేసుకుపోయారు. సి జెడ్ అనే 35 ఏళ్ల సంగీత కళాకారుడికి రోమ్ లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో ఈ అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు. ”ఈ సర్జరీలో రోగి స్పృహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట.

పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రజారకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్య బృందం చేపట్టింది. తొలుత వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి.

అసలు టెన్షన్ కి గురికాకూడదు. వైద్యులకు కూడా ఈ సర్జరీ అతి పెద్ద సవాల్. ఇలాంటి అరుదైన బ్రెయిన్ సర్జరీలు చేయడంలో డాక్టర్  క్రిస్టియన్ బ్రోగ్నాదిట్ట.  ఇక వైద్యులు ఆ రోగితో మాట్లాడుతుండగా… అతను సంగీతకళాకారుడని తెలుసుకున్నారు.దీంతో సర్జరీ సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని ముందుగా చెప్పారు.

సి జెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా శాక్సోఫోన్ వాయిస్తూ సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ ద్వారా రోగి బ్రెయిన్ లో ఉన్న కణితిని తొలగించారు. సంగీత కళాకారుడైన సి జెడ్ కూడా సర్జరీ జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్ స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్ ని ప్లే చేశారు. డాక్టర్ల బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేషంట్ మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!