The temperature in the ice cave is 0 degrees Celsius ……………………………
అమర్నాథ్ గుహల్లో కొలువైన మంచు శివలింగం గురించి అందరికి తెలుసు . అలాంటిదే పై ఫొటోలో కనిపించే భారీ మంచులింగం. ఇది శివలింగమో కాదో తెలీదు కానీ పర్యాటకులు మాత్రం వెళ్లి చూస్తున్నారు. మనవాళ్ళు మాత్రం అది శివలింగమే అని ప్రచారం చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ?
ఆస్ట్రియా రాజధాని సాల్జ్ బర్గ్ కి సమీపంలో 40 కిలోమీటర్లు మేరకు విస్తరించిన మంచు గుహలు ఉన్నాయి. అందులో ఈ భారీ మంచు లింగం వెలసింది. ఇది అమరనాథ్ శివలింగం కంటే చాలా పెద్దది.
ఈ లింగం ఎత్తు సుమారు 75 అడుగులు ఉంటుంది. ఈ మంచుగుహలను 1879 లో కనుగొన్నారు. గుహల్లోపల పర్యాటకుల కోసం మెట్లమార్గాన్ని నిర్మించారు.ఈ మెట్ల మార్గం ద్వారా ఒక కిలోమీటర్ దూరం నడిచే వెళితే మంచు లింగాన్ని దర్శించవచ్చు.
పైన, కింద, పక్కల మంచుతో కూడిన పరిసరాలు కాబట్టి గుహల్లో నడుచు కుంటూ వెళ్లడం ఇబ్బందికరమే. వాతావరణంలో తేడా ఉంటుంది. గుహల లోపలి మార్గం 20 మీటర్ల వెడల్పు, 18 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా ఈ గుహలను అభివృద్ధి చేసి ప్రజలు చూసేందుకు అనుమతించారు. ఎక్కడా సహజత్వం , ప్రకృతి అందాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గనుల్లో వాడే సాంప్రదాయ దీపాలను అమర్చారు. ఆ వెలుతురులో మంచు గుహల అందాలు తిలకించడం ఓ అరుదైన అనుభవం.ఇక్కడ పర్యాటకులకు సహాయం చేసేందుకు గైడ్స్ ఉంటారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
మే అక్టోబర్ మాసాల మధ్య వాతావరణం అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది. గుహల్లోపల మాత్రం చల్లగానే ఉంటుంది. శీతాకాలంలో లోపలికి అసలు వెళ్ళలేరు. ఆ సమయంలో గుహల్లోకి ప్రవేశం లేదు. లోపలికి వెళ్ళాక ఓ అద్భుత లోకం లోకి వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ గుహలను ‘ గైడెడ్ కేవ్ టూర్స్’ లో భాగంగానే చూడగలం.
గుహల్లోపల 75 నిమిషాలు తిరిగే అవకాశం ఉంటుంది. గైడ్స్ ఈ గుహల చరిత్ర,ఇతర వివరాలను తెలియ జేస్తారు. లోయ మొదట్లో ఉన్నపర్యాటకుల కేంద్రం నుండి టెన్నెంజ్‌బిర్జ్ పర్వతాలలోని మంచు గుహల వరకు పాదయాత్ర చేయవచ్చు. లేదా ఎత్తైన గొండోలా లిఫ్ట్ ద్వారా గుహ ప్రవేశద్వారం వరకు వెళ్ళవచ్చు.
వేసవిలో కూడా మంచు గుహలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. పర్యాటకులు తగిన దుస్తులు, బూట్లు తప్పనిసరిగా ధరించాలి. ఆరోగ్యపరంగా మంచి శారీరక స్థితిలో ఉండాలి. అపుడే ఈ గుహల్లోని మంచు శిల్పాల నిశ్శబ్ద సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. సాల్జ్ బర్గ్ లో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఇది ప్రముఖమైనది.
——– KNMURTHY