New Role ………………………… తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి టాక్ షో నిర్వహించబోతున్నారు. ఆయనే మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వేదిక నుంచి ఈ టాక్ షో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం పేరు ‘అన్‌స్టాపబుల్’ గా నిర్ణయించారు.
నవంబరు 4వ తేదీ నుంచి ఈ టాక్ షో మొదలవుతుంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మొదటి ఎపిసోడ్ ఎవరితో అనేది సస్పెన్స్ లో పెట్టారు. నటీనటులు .. ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారి జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు .. ఆటుపోట్లు.. భావోద్వేగాల గురించి ప్రేక్షకులకు తెలియ జెప్పేలా మోడరేటర్ వ్యవహరిస్తారు.
ఇలా మోడరేటర్ గా చేయడానికి బాలకృష్ణ ముందుకు రావడం విశేషం. సినిమాల్లో మినహాయించి మరెక్కడా బాలకృష్ణ ఇలాంటి బాధ్యతలు చేపట్టలేదు.ఇదే ప్రధమం అనుకోవచ్చు. విజయదశమి సందర్భంగా కర్టెన్ రైజర్ ప్రోగ్రాం ద్వారా ఈ టాక్ షో ఎలా ఉంటుందో మోడరేటర్ బాలకృష్ణ .. ప్రొడ్యూసర్ అరవింద్ ప్రేక్షకులకు వివరించారు.
ఇక ఆహాకు ఇప్పటికే 1.5మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ లక్ష్యం గా పెట్టుకున్నారు. సీనియర్ నటీ నటులు .. హీరోలు.. హీరోయిన్లతో ఈ టాక్ షోలు వెరైటీగా నిర్వహించేందుకు ఆహా టీమ్ ప్లాన్ చేసింది. గతంలో నటి సమంత ఇదే వేదికపై కొన్ని టాక్ షో లు చేసింది. వాటికి స్పందన బాగానే ఉంది.
ఈ ‘అన్‌స్టాపపబుల్’ టాక్ షో ఎపిసోడ్స్ ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్ అన్నట్టు ”బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు. అలాంటి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ షో ఎలా ఉంటుందా ? బాలయ్య అభిమానులు.. విమర్శకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.