ఆరోజున ప్రత్యేక మర్యాదలు వద్దన్నఆర్కే !

Sharing is Caring...

భండారు శ్రీనివాసరావు ……………………………………………

ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్.

‘ఆర్కే కనిపిస్తే కాల్చేయాలి’ అని పోలీసులకు ఉత్తర్వులు, ఆర్కేను పట్టించిన వారికి కోటి రూపాయలు రివార్డు వున్న ఈ ఆర్కే అనే మావొయిష్టు అగ్ర నేతను, పదిహేడేళ్ల క్రితం, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదే పోలీసులు అడవుల నుంచి సగౌరవంగా హైదరాబాదుకు తీసుకురావడం, అప్పుడు రేడియో విలేకరిగా పనిచేసిన నాకు కూడా విభిన్నమైన అనుభవం.

మావొయిష్టులు అనే విప్లవకారులతో ప్రభుత్వం చర్చలకు సిద్ద్ధపడడం, అందుకు వారిని ఆహ్వానించడం ఆ కాలంలో ఓ పెద్ద విశేషమైన, సంచలనాత్మకమైన వార్త. అయుధాలు వదిలిపెట్టి నగరానికి రావాలి అనే ప్రభుత్వ షరతు కారణంగా మొదట్లో ఈ చర్చలు జరుగుతాయా లేదా అనే విషయంలో కొంత సంగ్దిగ్ధత ఏర్పడ్డా, చివరికి ఆ నీలి నీడలు తొలగిపోయి చర్చలు జరిగాయి.

అవి ఫలించాయా లేదా అనేది వేరే విషయం. ఒక ముందడుగు పడింది అని భావించినవారే ఎక్కువ. తమను నక్సలైట్లు అని కాకుండా ఇక నుంచి మావోయిష్టులు అని పిలవాలనే ప్రకటనను కూడా ఆర్కే హైదరాబాదు సమావేశం సందర్భంలోనే విడుదల చేయడం మరో విశేషం.

దట్టమైన అడవుల్లో దశాబ్దాలుగా సంచరిస్తూ, ఒక స్థావరానికీ మరో స్థావరానికీ నడుమ, పోలీసుల డేగ కళ్ళు కప్పి వేరే స్థావరంలో తాత్కాలికంగా తల దాచుకుంటూ జీవితాలు గడుపుతున్న మావోయిష్టు నాయకులకు, నాటి ప్రభుత్వం వారిని ప్రభుత్వ అతిధులుగా పరిగణిస్తూ సమస్త మర్యాదలు చేసింది.

సంవత్సరాల తరబడి అడవుల్లో దొరికింది తింటూ కాలం గడిపిన వారికి ప్రభుత్వ అతిథి గృహంలో చేసిన ఏర్పాట్లు విస్మయం కలిగించాయి. ఒక దిన పత్రిక అయితే ఒక అడుగు ముందుకు వేసి అతిథి గృహంలో మావోయిష్టు నాయకులకు జరుగుతున్న మర్యాదలను ఉటంకిస్తూ ఏకంగా వారికి భోజనాల్లో వడ్డిస్తున్న వివిధ రకాల వంటకాల జాబితాను సవివరంగా ప్రచురించింది.

ఈ విషయం దృష్టికి రాగానే మావోయిష్టు నాయకుడు ఆర్కే వెంటనే స్పందించి తమకు ప్రత్యేక మర్యాదలు, భోజన ఏర్పాట్లు అవసరం లేదని మృదువుగా తిరస్కరించి ఆ విషయం అధికారులకు తెలియచేసారు.మావోయిష్టులు అక్కడ బస చేస్తున్నారని తెలిసి సామాన్య జనం తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టుకోవడానికి, వారికి మహజర్లు ఇవ్వడానికి క్యూలు కట్టారు.

తాము ఇక్కడికి వచ్చింది ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మాత్రమే అని ఆర్కే వారితో స్పష్టంగా చెప్పేవారు. సమాజంలోని ఈ అసమానతలు తొలగించడానికే తాము ఆయుధాలు చేతబట్టామని, తమ లక్ష్యం సాధించుకోవడానికి ప్రభుత్వంతో పోరాడుతాము కానీ సిఫారసులు చేయడం తమ పని కాదనీ ఆయన స్పష్టం చేశారు.

బీ టెక్ చదివి, కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు సమాజాన్ని ఉద్ధరించడానికి తుపాకీ చేతబట్టి అడవులకు వెళ్ళడం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్న ఆర్కే తండ్రికి ఎలాంటి మనస్తాపం కలిగించిందో ఎవరికీ తెలియదు. సంఘాన్ని బాగుచేయాలనే సదుద్దేశ్యంతో అడవి బాట పట్టిన ఇలాంటి అడవి వీరులు ఎందరో ఇలా తమ బతుకులను తెల్లవార్చుకోవడం విషాదం అనిపిస్తుంది. 

గమ్యం మంచిదైనా నడిచే మార్గం మంచిది కాదని అనేవాళ్ళు వుంటారు. నిజం కూడా. కానీ లక్ష్యశుద్ధి వుంటే మార్గం గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆ వీరుల నమ్మకం.అయితే, పోరాడితే పోయేది లేదు అనే ఒకే ఒక జవాబు తప్ప, ఇన్నేళ్ళుగా సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు వారి నుంచి సరయిన సమాధానం లేదు,.ముందే చెప్పినట్టు మంచి చెడులను తేల్చి చెప్పేది ఒక్క కాలం మాత్రమే.ఆర్కే కుటుంబానికి నా సానుభూతి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!