ఏ గుర్తింపు ఆశించని అరుదైన ఆర్టిస్ !

Sharing is Caring...

MOHAN… ARTIST ………………………………….

చేతిలో కుంచె, జేబులో రంగులు, గుండె గుప్పెట్లో కలలు, కళ్ళ ముందు కేన్వాసులు. బొమ్మలు గియ్యాలి. బొమ్మలు చెక్కాలి.బొమ్మలు చెయ్యాలి. బొమ్మల్లో బొమ్మల్తో బతకాలి అని నేర్చుకోడానికి చిట్టగాంగ్ నుండి కలకత్తా చేరాడు టీనేజ్ చిత్తప్రసాద్. గవర్నమెంటు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ లో చేరతానన్నాడు. రాజకీయాల్లో పనిచేసేవాడికి చిత్రకళ కుదరదూ, గెటౌట్ అన్నారు ప్రిన్సిపల్ గారు. మరోదారేది! తిన్నగా రవీంద్రనాథ్ టాగూర్ దగ్గరకెళ్ళాడు. శాంతినికేతన్ లో చేరితే పెయింటింగ్ నేర్చుకోవచ్చుగదా!

టాగూర్ కూచుని ఉన్నాడు. తెల్ల జుత్తుతో, తెల్లగడ్డంతో, తెల్ల కాగితంలాగా రుషిలా కూచుని ఉన్నాడు. ఆ రుషి బొమ్మ గీయాలి. అదే ఇంటర్వ్యూ. అదే పరీక్ష. స్కెచ్ మొదలయింది. పొడుగాటి ముక్కు, విశాల ఫాలభాగం, అలలు అలలుగా గడ్డం. జుత్తు బొత్తిగా భయం బెరుకూ లేకుండా గొప్ప వేగం, విశ్వాసంతో చిత్తప్రసాద్ గీతలు కదిలాయి. పోట్రైట్ పూర్తయింది. గీతాంజలి రాయడమే కాదు, గీతలు గీయడంలో కూడా చేయితిరిగిన టాగూరు విస్తుపోయాడు.

ఈ కుర్రవాడికి కళాభవన్ లో అడ్మిషన్ ఇవ్వడమా?! కాలేజీలో బొమ్మలు నేర్చుకోవడానికి కాలం వృధా చేయొద్దని సలహా ఇచ్చారు టాగూర్.అది గుర్తింపు. అది విజయం. కల్తీలేని విజయం. చిత్తప్రసాద్ మరి వెనుదిరిగి చూడలేదు. నేరుగా కలకత్తాలోకి దూకాడు.  1930 దశకం. కొలిమిలాగుంది కలకత్తా.

చిట్టగాంగ్ , చండీఘర్ లో, తెలంగాణలో దేశభక్తుల రైఫిళ్ళ రొద వినిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం నీడ ఇండియా మీద నల్లని అస్థిపంజరంలా పరుచుకుంటోంది. స్పెయిన్ లో హిట్లర్ విమానాలనీ, బాంబుల్నీ పికాసో శపిస్తున్నాడు. గెర్నికాని గీస్తున్నాడు. ముల్క్ రాజ్ ఆనంద్, ప్రేమ్ చంద్, సర్దార్ ఆలీ జాఫ్రీ, సజ్జాద్ జహీర్, ప్రేమ్ ధవన్, కిషన్ చందర్, ఇస్మత్ చుగ్తాయ్, విమల్ రాయ్… ఎందరో మహానుభావులు, అందరూ స్వేచ్ఛా గీతాలాలపిస్తున్నారు.

సలీల్ చౌదరి హార్మోనియం కొత్త బాణీలు కడుతోంది. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో విప్లవ సినిమా ధర్తీకే లాల్ వచ్చింది. బలరాజ్ సహానీ హీరో. అది మన కళలకు పునరుజ్జీవన కాలం. కళాకారులంతా ఉద్యమకారులయ్యారు. చిత్తప్రసాద్ వారిలో ఒకడయ్యాడు.

1943-44 బెంగాల్ కరువు 30 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆయన రాష్ట్రమంతా తిరిగాడు. హంగ్రీ బెంగాల్ పేరిట వందలకొద్దీ స్కెచ్ లు గీశాడు. పీపుల్స్ వార్ పత్రికలో తన అనుభవాలు వరసగా రాశాడు. కానీ బ్రిటిష్ పోలీసుల దాడులకు భయపడి నాటి సంపాదకులు ఆ బొమ్మల్ని చాలా వరకు ధ్వంసం చేశారు. చిత్తప్రసాద్ నూ, పత్రికనూ రక్షించుకోవడానికే వాళ్ళలా చేశారు.

చిత్తప్రసాద్ 1946లో  బొంబాయి వెళ్ళారు. అక్కడ పీపుల్స్ ఏజ్ పత్రికలో ఆయన ముఖచిత్రాలూ, అరపేజీ కార్టూన్లూ గీసేవారు. ఇండియా ఇన్ రివోల్ట్ శీర్షికతో ఆయన 20 చిత్రాలు గీశారు. ఇంతవరకూ భారత విముక్తి పోరాటాన్ని ఎవ్వరూ అంత ప్రతిభావంతంగా చిత్రించలేదు. నావికుల తిరుగుబాటు (ఆర్.ఐ.ఎస్.మ్యూటినీ), రైల్వే పోస్టల్ కార్మిక సమ్మెలు, తెలంగాణ, తెభాగా, పున్నప్ర వాయలార్ రైతుల పోరాటాలు, చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్, భగత్సింగ్ ఉరి లాంటి ఘట్టాలు – వీటన్నిటినీ ఒక వరసలో చూస్తే స్వతంత్రం కోసం మన జనం చేసిన సమ్మెల్లోనూ, ప్రదర్శనల్లోనూ, మనం జెండాలు పట్టుకుని పరిగెత్తినట్టే ఉంటుంది.

భారతీయ సాంప్రదాయక చిత్రకళా రీతిని అనుసరించాలా? లేక పశ్చిమ యూరప్ రియలిస్టు ఆధునిక కళారీతిని అనుకరించాలా? అనే డైలమా నాటి ఆర్టిస్టుని వెన్నాడేది. చిత్తప్రసాద్ తాను పుట్టిన 24 పరగణాల జిల్లా, చదివిన చిట్టగాంగ్ లోని జానపద కళారీతిని జీర్ణం చేసుకున్నాడు. పశ్చిమ దేశాల రియలిస్టు తరహాను అర్ధం చేసుకున్నాడు. మానవ శరీర చిత్రణలో పూర్తిగా భారతీయమైన భాష్యం ఇచ్చాడు. చుట్టూవున్న లోకంలో అందానికి, ఆనందానికి, అక్రమాలకు, అన్యాయాలకు రియాక్ట్ అయినప్పుడల్లా తన భావతీవ్రతకు రూపమిచ్చాడు.

ఆదర్శం, కళ ఆయన్ని నడిపించింది. దానికోసం తనని తాను దగ్ధం చేసుకున్నాడు. భస్మం అయ్యాడు. ఆయన బూడిదలోంచి జాజ్వల్యదీమానమైన కళావిహంగం రెక్కలార్చి పిలుస్తోంది. కుంచెతో, ఉలితో, కలంతో, కన్నీళ్ళతో చిత్తప్రసాద్ గీసిన బాట కనిపిస్తోంది!  రండి నడుద్దాం.

బొంబాయిలో అంధేరి మురికివాడల్లో ఆయన 32 ఏళ్లు బతికి అపురూపమైన కళాఖండాలు సృష్టించాడు. 1978లో కలకత్తాలో మరణించాడు. ఆయన బతికుండగా ఒకే ఒక “ఒన్ మాన్ షో” జరిగింది. ఆయన మరణించాక 1980లో కలకత్తాలో మరో ఎగ్జిబిషన్ జరిగింది. అంతే, ఆయన గురించి మనదేశంలో ఎవరికీ బొత్తిగా తెలీదు. ఆయన చిత్రాలు ఇండియాలో ఏ పత్రికా పెద్దగా అచ్చువేయలేదు.

కానీ రష్యా, డెన్మార్క్, అమెరికా, మెక్సికో, చెకొస్లవేకియా, టాంజానియాల్లో ఆయన చిత్రాలను పెద్దఎత్తున ప్రదర్శించారు. ఒక్క ఇండియా తప్ప ప్రపంచమంతా.. ఆయనను తెలిసినట్టుంది.

ఏంజెల్స్ వితౌట్ ఫెయిరీ టేల్స్ పేరిట ఆకలిగొన్న బాల కార్మికులపై ఆయన 1952లో గీసిన చిత్రాలను డెన్మార్క్ యునిసెఫ్ కమిటీ 1969లో పెద్ద పుస్తకంగా ప్రచురించింది. చిన్నపిల్లల కోసం ఆయన ఎన్నో కథలు, పాటలు రాశారు. కింగ్ డమ్ ఆఫ్ రసగుల్లా పేరిట ఆయన రాసిన పిల్లల బొమ్మల కథలను 1968లో ఇండియా బుక్ హౌస్ ప్రచురించింది.

అన్నిటికంటే పెద్దది బాలల రామాయణం.దాని స్క్రిప్ట్ ఇంకా ప్రచురణ కాలేదు. ఆ బొమ్మలు నేటికీ ప్రాగ్ (చెకొస్లవేకియా) మ్యూజియంలో ఉన్నాయంటారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన లిటిల్ బాలే ట్రూప్ (మహారాష్ట్ర)కు ఆయన స్క్రీన్ పెయింటర్ గా పనిచేశారు. వారికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. 1950 దశకాంతంలో స్వయంగా పపెట్ థియేటర్ స్థాపించారు. చెక్కలు, కొబ్బరిచిప్పలు, పురికొసలు, పీచు రంగులతో చేసిన ఆ బొమ్మల్ని మనం ఇప్పటికీ చూడొచ్చు. ఆయన రాసిన కవితలు, కథలు, నాటకాలు బెంగాలీలో అచ్చయ్యాయి.

ఇవన్నీ మరో ఎగ్జిబిషన్ ఎప్పుడైనా నోచుకుంటాయా? శరత్బాబు నిజానికి బెంగాలీ బాబు అని చెప్తే తెలుగు పాఠకులు విస్తుపోతారు. చిత్తప్రసాద్ ను కూడా బెంగాలీ ప్రసాద్ అనుకోలేం. నిజాం, బ్రిటీష్ వాళ్లూ కలిసి వాళ్ళ కుక్కల్ని ఉసిగొలిపి తెలంగాణ బక్కరైతును కాల్చుకుతిన్న దృశ్యాల్ని ఆయన కసిగా, బలంగా, ప్రతిభావంతంగా గీశాడు. ఆ కార్టూన్లు చూస్తే మనకి డేవిడ్ లో కంటే రెండాకులు ఎక్కువ తిన్న ఆర్టిస్ట్ ఉన్నాడని ఖాయంగా అనుకోవచ్చు.

తెలుగువాళ్ళు అనే మనుషులున్నారనే స్పృహ ఉత్తరాది వాళ్ళకి బొత్తిగా ఉండదు. వాళ్ళకందరూ మద్రాసీలే. కానీ చిత్తప్రసాద్ తెలంగాణ రైతు ముఖాన్ని, ఆ నలుపుని, అందాన్ని అందుకున్నాడు. బెజవాడ రైతు మహాసభకు ఆయన హాజరయ్యాడు. రాహుల్ సాంకృత్యాయన్ వంటి మహా మేధావి అధ్యక్షతన జరిగిన ఆ సభ తెలుగువాళ్ళ రాజకీయ చరిత్రలో పెద్ద సంచలనం పుట్టించింది.

సభకు వచ్చిన రైతుకూలీలూ, వారి భార్యలూ, బిడ్డల స్కెచ్ లు గీశాడాయన. మాచవరం కొండను చిత్రించాడు. తెలంగాణ రైతు కట్టుబట్టలను ఇట్టే పట్టేశారాయన. నో టూ నిజాం లాంటి చిత్రాల్లో ఆ తెలుగుతనాన్ని నిప్పులుమిసే శక్తిని మన మాధవపెద్ది గోఖలే గారు కూడా చూపలేకపోయారు. నిజానికి ప్రసాద్ మన తెలుగువాడే.

ఆయన చిత్రాలన్నీ కేవలం కార్మికులకే, కష్టాలకే పరిమితం కాలేదు. బతుకులోని అతి సుందరమైన భాగాలను ఆయన స్పృశించాడు. పల్లె జీవితం, పండగలు, గొడ్లకాడ బుడ్డోళ్ళు, తల్లీపిల్లా ఆటపాటలు… ఇలాంటివెన్నో కవితల్లాగా వేణునాదంలాగా వింత అనుభూతి కలిగించేవి గీశాడు. ఎప్పుడో యూరప్ పునరుజ్జీవన కాలంలో డావిన్సీ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టాడంటారు. కాని 40 ఏళ్ళ క్రితం చిత్తప్రసాద్ ఇంకుతో లైన్ డ్రాయింగ్ చేశాడు. రంగుల్లో ఆయిల్ పెయింటింగ్ చేశాడు.

చెక్క విగ్రహాలు చెక్కాడు. లిథోగ్రాఫు, లినోకట్లు వందల సంఖ్యలో చేశాడు. గుండెగూడును తట్టిలేపే కవితలు, చిన్న పిల్లలకు కథలు రాశాడు. జర్నలిస్ట్ లా వ్యాసాలు రాశాడు. పపెట్ షో నడిపాడు. ఇన్ని రకాల పనుల్ని ఒక్కడూ అంత ప్రతిభావంతంగా చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. చిత్తప్రసాద్ లాగా కూలీలు, రైతుల సబ్జెక్ట్ తీసుకుని పనిచేసిన ఆర్టిస్టు లు దేశంలో అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.

కాని ఆడా మగా మధ్య ఉన్న గొప్ప ఆకర్షణ, సెక్స్, ఆనందం రగిలే కోర్కెలాంటి సబ్జెక్టులను ఆయన సజీవంగా, శక్తిమంతంగా చిత్రీకరించాడని ఢిల్లీ ఆర్ట్ హెరిటేజ్ నిర్వాహకులు అల్కాజీ అంటారు. భౌతికమైన కోర్కెను, దాని ఆనందాన్ని చిత్రీకరించడంలో చిత్తప్రసాద్ ఎలాంటి ఎగ్జిబిషనిస్ట్ ధోరణినీ ప్రదర్శించలేదని, భారతదేశంలో అతి కొద్దిమంది ఆర్టిస్టులు మాత్రమే ఇలా చేయగలిగారనీ అల్కాజీ అంటారు.

చిత్తప్రసాద్ 1915లో బెంగాల్ లో పుట్టాడు. 1978 లో కలకత్తాలో మరణించాడు. ఈ 63 ఏళ్ల జీవితంలో ఆయనను ప్రభుత్వం గానీ, అకాడమీలు గానీ ఏనాడూ గుర్తించలేదు, ప్రోత్సహించలేదు. తనకు ఎవరూ బిరుదివ్వలేదనీ, సన్మానం చేయలేదనీ ఆయన ఏనాడూ అనుకోలేదు. ఆయన కళ వల్ల మేడలూ, మిద్దెలూ కట్టిందీ లేదు. చివరివరకూ ఆయన బొంబాయి మురికివాడల్లోనే బతికాడు.

కళ కోసం, జనం కోసం తనను తాను కాల్చుకుని దగ్ధమయ్యాడు. మరణించిన చిత్తప్రసాద్ ఇప్పుడు మనల్ని మళ్ళీ బిరుదులు, సన్మానాలు అడగడం లేదు. ఆయన సృష్టించిన కళను కాపాడుకుని తర్వాతి తరాల కళాకారులకు అందించటం అవసరం. ఆయన చిత్రాల ఆల్బమ్ లు వేయడం, డాక్యుమెంటరీ చిత్రాలు తీయడం మన బాధ్యత. రామప్ప దేవాలయాలనూ, తాజ్ మహల్ ను, కుతుబ్ మీనార్ ని మనం రక్షించుకోవడంలేదూ. అలాగే చిత్తప్రసాద్ని కూడా దాచుకుందాం.

మన అడవుల్ని నరుక్కున్నట్టు.. మన గుండెల్ని కూడా గుల్ల చేసుకోవద్దు. అమృతం పోస్తున్నాడు చిత్తప్రసాద్. గుండె నిండా తాగుదాం రండి. మరోసారి బతుకుదాం పదండి.

NOTE: మోహన్ రాసిన ఈ వ్యాసం 35 సంవత్సరాల క్రితం 1987 ఆగస్టు 2వ తేదీన ఉదయం దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చింది. వెంకటేశ్వర్లు అనే ఒకాయన ఈ వ్యాసం చదివి చెకోస్లోవేకియా వెళ్ళినపుడు చిత్తప్రసాద్ బొమ్మల కోసం వెతికారు. ఆయన అక్కడ ఏం చేశారో మరో పోస్టు లో  తెలుసుకుందాం.
– TAADI PRAKASH

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!