కాంగ్రా వైపే అందరి చూపు !

Sharing is Caring...

 Will the custom continue?……………………….

ఇవాళ 68 సీట్లున్న హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇపుడు అందరి చూపు అక్కడి కాంగ్రా జిల్లాపై కేంద్రీకృతమైంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకం. ఈ విషయం పలు మార్లు నిరూపితమైంది.

అక్కడ ఏ పార్టీ పాగా వేస్తే అధికారం దాదాపు వారికి ఖరారైనట్టే. అక్కడ మూడు దశాబ్దాలుగా అదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీనేతలు… ప్రజలు కూడా  పాత సీన్  రిపీట్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుని పాలనా పగ్గాలు చేపట్టింది.

ప్రస్తుతం కాంగ్రా  లోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు బెడద ఉంది. పార్టీ అధ్యకుడు నడ్డా ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు.

మొత్తానికి 1993 నుంచీ ఈ జిల్లా ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది.  
అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది. మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

కాంగ్రా జిల్లాలో రాజ్పుత్ ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒక పార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీ పట్ల అభిమానం..  ఆదరణ ఉన్నప్పటికీ .. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే సూచనలున్నాయి.

సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్ ఎన్నికల్లో కీలకమే. కాంగ్రాతో పాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి.

అగ్నిపథ్ స్కీమ్ తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసుల్లో ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది.ఫలితాలు వెలువడితేనే ఓటర్లు ఎటు మొగ్గు చూపారో తెలుస్తుంది. 

1985 తర్వాత ఏ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదన్న ఆనవాయితీని బ్రేక్‌ చేయాలన్న పట్టుదలతో హిమాచల్ సీఎం  జైరాం ఠాకూర్ ఎన్నికల్లో గట్టి ప్రచారమే చేశారు.  2017లో 21 స్థానాలు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను రాబట్టుకునే లక్ష్యంతో ప్రచారం చేపట్టింది.

ఆనవాయితీ ప్రకారం ఈసారి గెలుపు తమదేనన్న ధీమాతో కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారో తెలియాలంటే డిసెంబర్ 8  వరకు ఎదురు చూడాల్సిందే. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!