Telangana Tourism Organization Weekend Tours………………..
తెలంగాణ టూరిజం సంస్థ వీకెండ్ టూర్స్ నిర్వహిస్తోంది. ఒక రోజులోనే ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు.తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్యాకేజీలతో తెలంగాణ టూరిజం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
వీకెండ్ టూర్స్ లో భాగంగా హైదరాబాద్ – బీచ్‌పల్లి – అలంపూర్ టెంపుల్స్ పేరిట ఈ టూర్ ప్యాకేజి తో ముందు కొచ్చింది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. అంటే ఉదయం బయలుదేరి రాత్రికి ఇంటికి వచ్చేస్తాం.
ఈ అలంపూర్ టెంపుల్స్ టూర్ ప్యాకేజీలో కవరయ్యే ప్రాంతాలు . ప్యాకేజీ ధర వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రయాణం ఇలా మొదలవుతుంది..
@ ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది. 11.30 గంటలకు బీచ్‌పల్లికి బస్సు చేరుకుంటుంది. ఇక్కడ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. కృష్ణానది పక్కన ఈ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయలు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. 16వ శతాబ్దం నుండి ప్రసిద్ధమైన ఈ స్వామిని అనంతర కాలం లో వచ్చిన రాజులు, సంస్థానాథీశులు సేవించి తరించినట్లు చారిత్రక ఆథారాలున్నాయి.
తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను ఆకట్టుకుంటుంది. 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని బాదామి చాళుక్యరాజులు నిర్మించారు.
అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు నాటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది, 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పున:ప్రతిష్టించారు.
ప్రాంగణంలో ఉన్న పలు ఆలయాలను చూస్తారు. అనంతరం హరిత హోటల్‌లో లంచ్ ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ కూడా హరిత హోటల్‌లోనే ఇస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలు.. ఇవీ …..
ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. టికెట్ విషయానికొస్తే పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 1200 గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://tourism.telangana.gov.in/package/hydbeechpallialampur