గురువారం గిరి ప్రదక్షిణ చేస్తే ??

Sharing is Caring...

Many visions…………………………..

గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని అరుణాచలేశుడి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కొలువై ఉన్న దుర్వాసమహర్షి ని దర్శించిన తర్వాత ప్రారంభించాలి… అరుణాచల శివా అంటూ గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి..  మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి ఈశ్వరుడిని దర్శిస్తే అదే సుందర రూప దర్శనం!

నాలుగు వేదాలలో దేవపురుషుడైన ‘సహస్ర శీర్ష పురుషుడు’ అనే వేదవాక్యానికి తగ్గట్లు సహస్రవదనాలతో ఆ శివుడు దర్శనమిస్తారు.ఈ క్రమంలోనే కుతూహల నందీశ్వరుడిని దాటుకుని కంబత్తు ఇళయనార్‌ సన్నిధి నుండి శివుడిని దర్శించడాన్ని నంది సేవక మహాలింగ దర్శనం అని అంటారు.

ఆ తదుపరి అక్కడి తూర్పు గోపురం మీదుగా రథం వీథికి చేరుకుని ‘పినాక మురళీధర ముఖ లింగం’ అనే పిలువబడే ఇంద్రలింగాన్ని దర్శించాలి. ఈ దర్శనం వల్ల ఉద్యోగంలో, పదవిలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయి.

ఆ తర్వాత దక్షిణ గోపురం సమీపాన తిరుమంజన వీథిలోని శ్రీకర్పగ వినాయకుడి ఆలయం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శిస్తే అదే వాక్‌శక్తి లింగ దర్శనం అవుతుంది. వాక్‌పటిమను పెంచేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.వాక్‌ చాతుర్యం ద్వారా అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కలగటానికి, చదువుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయేందుకు వాక్‌శక్తి లింగ దర్శనం తోడ్పడుతుంది.

తర్వాత శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం సమీపం నుండి పొందే దర్శనాన్నే ‘బుద్ధి పూర్వలింగ దర్శనం’ అని పిలుస్తారు. వర్తమాన పరిస్థితులలో పలువురు తప్పిదాలు చేయడానికి దుష్టశక్తులే కారణం. అలా చెడు స్నేహం వల్ల బుద్ధి మారి పలు తప్పిదాలు చేసి ఉంటే, వాటికి ప్రాయశ్చిత్తం కలిగించే దర్శనమిది..ఈ దర్శనం తర్వాత చెడు స్నేహాలకు దూరమై సత్సంగంలో చేరి శివానుగ్రహానికి పాత్రులవుతారు.

తర్వాత శ్రీరమణాశ్రమం సరిహద్దు నుండి లభించే దర్శనమే గ్రహణ పంచముఖ దర్శనం. సూర్య చంద్ర గ్రహణ కాలాల్లో చేయాల్సిన పూజలు, తర్పణాలు ఇవ్వడం వంటి కార్యాలను మరచినవారికి ప్రాయశ్చిత్తంగా ఈ దర్శనం ఉంటుంది.

ఇక సెంగం రహదారిలో కాస్తా దూరం వెళ్లాక మురుగన్‌ ఆలయం దాటుకుంటే కుడివైపున సింహముఖ తీర్థం కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించిన తర్వాత, లేక ఆ తీర్థపు జలాలను శిరస్సుపై చల్లుకున్న తర్వాతే అణ్ణామలైని దర్శిస్తే గోముఖ ఆకారంలో కనిపిస్తారు. ఈ దర్శనమే గోముఖ దర్శనం.

పశువులను కాలితో తన్నటం, కొట్టడం, దూడకు పాలివ్వకుండా పాలను పూర్తిగా సేకరించడం వంటి పశు హింసా దోషాలకు పరిహారం ఇచ్చే దర్శనమే గోముఖ దర్శనం.గిరి ప్రదక్షిణ మార్గంలో బాల శిక్ష లింగ దర్శనం… పినాకి దర్శనం, అసుర సమన లింగ దర్శనం వంటివి లభిస్తాయి.

గురువారం గిరిప్రదక్షిణ చేస్తే .. మనస్సుల్లో చెలరేగే దుర్గుణాలు తొలగిపోతాయి. జీవితంలో మంచి చెడులు అనే విచక్షణ లేకుండా చేసిన పలు కార్యాల వల్ల మనమే కాకుండా మన కుటుంబీకులకు హాని కలుగుతుంది. అలాంటి వన్నీ ఈ ప్రదక్షిణతో పటాపంచలవుతాయి. కోపం, ద్వేషం వల్ల కలిగే కష్టాలు తగ్గుతాయి. సమస్త దోషాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది.

అడిఅణ్ణామలై ఆలయ గోపురంతోపాటు అరుణాచలేశ్వరుడిని దర్శించడమే అసాధ్య వాక్‌ విమోచన లింగ దర్శనం. జీవితంలో ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సందర్భవశాత్తూ తెలిసో తెలియకో అసత్యమాడే పరిస్థితులు కలుగుతాయి.

అలా అసత్యమాడినందుకు పరిహారం ఇచ్చేదే ఈ దర్శనం. ఈ దర్శనం తర్వాత మళ్లీ అసత్యమాడని శివభక్తులకు దైవానుగ్రహం లభిస్తుంది. చివరగా శ్రీభూత నారాయణ స్వామి దర్శనంతో గురువారం నాటి గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!