తాలిబన్ల వ్యవహారశైలిని ధిక్కరించేందుకు అఫ్గానీ మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఒక ప్రయత్నం చేద్దాం పోతే ప్రాణాలే కదా అన్నరీతిలో తమపై విధించిన ఆంక్షల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు మాత్రం తెగించి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు సోషల్ మీడియాలోనూ తమ నిరసనను విభిన్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నిరసన అంటే నలుపు రంగు వస్త్రాలు ధరించి తెలియ జేస్తుంటారు. కానీ అఫ్గానీ మహిళలు రంగు రంగుల దుస్తులు ధరించి కొంత వెరైటీగా తాలిబన్ల ఆంక్షల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. కొత్త కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ తాలిబన్ల దృష్టిలో పడ్డాయో లేదో కానీ ప్రపంచ మహిళల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహిళల వస్త్రధారణపై తాలిబన్లు ఆంక్షలు విధించిన క్రమంలో బహార్ జలాలే అనే మహిళ అంతర్జాలం వేదికగా “నాదుస్తులను తాకొద్దు” అంటూ ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆమె అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ లో మాజీ అధ్యాపకురాలు. జలాలే తాలిబన్లు ఆదేశాలను ధిక్కరిస్తూ రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.ఇదే ఆఫ్గన్ మహిళల అసలైన వస్త్రధారణ సంస్కృతి అంటూ కామెంట్ కూడా పెట్టారు.
పూర్తిగా బుర్ఖా ధరించిన కొందరు మహిళల ఫొటోలను మరో పోస్టులో పెట్టి ఇది మన దేశ సంప్రదాయం కానే కాదు. ఇలాంటి వస్త్రధారణలో మహిళలను చూస్తే మనల్ని గ్రహాంతరవాసులుగా భావించే ముప్పుందంటూ వ్యాఖ్య జోడించారు. మొదట్లో ఈ ఉద్యమానికి పెద్దగా స్పందన లేదు. మెల్లమెల్లగా పలువురు మహిళలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.మొత్తానికి ధైర్యంగా ఏదో ఒక మార్గంలో తమ నిరసన వ్యక్తం చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఆఫ్ఘన్ సంస్కృతిని కాపాడటానికి మేము మా ప్రచారాన్ని కొనసాగిస్తాం.మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తాం అంటున్నారు ఆఫ్ఘాని మహిళలు.తాలిబన్ల మనసు మారుతుందని ఆశ లేకపోయినప్పటికీ … కనుచూపుమేరలో తాలిబన్ల పాలన, అమానుష నిబంధనలు సడిలిపోయే అవకాశాలు లేకపోయినప్పటికీ ఆఫ్ఘానీ వనితల తెగువకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.