Subramanyam Dogiparthi ……………………….
సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని నియంత్రణ చేయటానికి మనమెవరం అనే భావన ఎక్కువగా ఉండేది.
ఆ బాటలోనే ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు , భూసంస్కరణలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం పెద్ద దుమారమే లేచింది. అప్పట్లో ఈ సినిమా పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. తర్వాత నిషేధానికి గురయింది .చిత్ర నిర్మాత కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వటం , మరల అనుమతి పొందటం , రెండవసారి విడుదల కావటం సంచలనమే ఆరోజుల్లో.
యాభై రోజులు ఆడాక ప్రదర్శన నిలపబడటం అదే మొదటిసారేమో ! ఆ సంచలనాన్ని పక్కన పెడితే , బాలకృష్ణ నటించిన మొదటి సినిమా ఇదే .NTR అంతటి మహా నటుడు ఉన్నా , ఆయనే నిర్మాత దర్శకుడు అయినా సినిమాకు భానుమతి షీరో కావడం , ఆమెకు అంత స్పేస్ ఇవ్వటం గొప్ప విశేషమే . Hats off to NTR .
గ్రామాల్లో పెద్ద పెద్ద ఆసాములు వ్యవసాయం చేయలేక , కనీసం పిల్లలకు విద్యాబుద్ధులు అయినా ఏర్పడతాయని బస్తీలకు చేరటం చుట్టూ ఉంటుంది సినిమా . దానికి మించి తాతమ్మ సెంటిమెంట్ . తాతమ్మ కల అంటే భానుమతి సినిమాయే . భానుమతి పక్కన ఎవరు నటించాలన్నా బిక్కుబిక్కుమంటూ నటించాల్సిందే . ఒక్క NTR మాత్రమే ఢీ అంటే ఢీగా నిలపడగలడు .
ఈ సినిమాలో కోరమీసం కుర్రోడా పాటలో ఆ కెమిస్ట్రీ కనిపిస్తుంది . ఇద్దరూ పోటాపోటీగా నటించారు ఈ పాటలో. యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . సినిమా ప్రారంభంలోనే కొసరాజు విరచిత భానుమతి పాడే ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు పాట చాలా బాగుంటుంది . ఆయన వ్రాసిందే మరో పాట అయ్య లాలీ ముద్దులయ్య లాలీ పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది.
NTR – కాంచనల మీద చిత్రీకరించబడిన శెనగపూల రెయికాదానా జారుపైటా చిన్నదానా చాలా బాగుంటుంది . కొసరాజు గారి జానపద , గ్రామీణ , రొమాంటిక్ స్పృహకు ప్రతీక . ఏమండీ వదిన గారు చెప్పండి కాస్త పాట వదిన మరదళ్ళ సరసాన్ని చక్కగా చూపించారు. రాజబాబు మీద హరే రామ హరే కృష్ణ హిప్పీ పాట విజయవాడ సంగ్రామ చౌక్ సెంటర్లో షూట్ చేశారు.
సినిమాలో విజయవాడ లొకేషన్స్ చాలా ఉంటాయి . NTR , భానుమతి , కాంచన , హరికృష్ణ , బాలకృష్ణ , రోజారమణి , రమణారెడ్డి , శుభ , కాశీనాధ్ తాతా , మాడా , విజయలలిత , రాజబాబు ప్రభృతులు నటించారు . సినిమా కధాంశం మీద అంత వివాదం ఏర్పడినా , ఉత్తమ కధగా నంది అవార్డు రావటం విశేషమే .
NTR తాతమ్మకు బైరాగుల్లో కలిసి మళ్ళా వెనక్కు వచ్చే భర్తగా , మనమడిగా రెండు పాత్రల్ని ధరించారు . సంగీతపరంగా , భానుమతి నటనాపరంగా ఓ గొప్ప సినిమాయే . మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరంలో ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . టైం లేకపోతే భానుమతి-NTR కోరమీసం కుర్రోడా పాట వీడియో వరకయినా ఆస్వాదించండి .