Subramanyam Dogiparthi…………………….
బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.బడి vs గుడి ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో పెడితే , ఆ సినిమాను బహిష్కరించమని సోషల్ మీడియాలో పిలుపు ఇస్తారు. గట్టి ఆస్తికులు ఇదే చర్చ మసీదుకు , చర్చికి కూడా పెడతారా అని నిలదీస్తారు కూడా.
భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా .. బులబాటం తీర్చుకుంటే తప్పు లేదురా అనే చార్వాకం పాట , ‘నను పాలింపగ నడిచీ వచ్చితివా మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా’ అనే భక్తితో నిండిన పాట రెండు విభిన్న జీవన శైలులను చూపిస్తాయి . ఇంత కన్నా గొప్ప వేదాంత చర్చ ఏముంటుంది ? ‘గుడిలో ఏముంది అంతా బడిలోనే ఉంది’ అనే ఎర్ర పాట . ‘తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా’ , ‘పచ్చి మిరపకాయలాంటి పడుచుపిల్లరో దాని పరువానికి గర్వానికి పగ్గమేయరో’ , ‘గుట్ట మీద గువ్వ కూసింది కట్ట మీద కౌజు పలికింది’ పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
కుర్రాళ్ళంగా ఉన్న రోజుల్లో భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అనే హుషారయిన పాట ఫేవరేట్ సాంగ్ . కంఠస్థం చేసాం కూడా. బాపు గారంటే నదులు , పడవలు , తోటలు , ప్రకృతి ఉండాలి కదా ! ఈ పాట బోటు మీదనే . మరో గొప్ప పాట టాటా వీడ్కోలు గుడ్ బై ఇంక సెలవు . కె వి మహదేవన్ సంగీతం , ఆరుద్ర దాశరధి నారాయణరెడ్డిల సాహిత్యం అద్భుతం . ఈ సినిమాలో పాటలు పాపులర్ కావటానికి సంగీతం దోహదపడిందా లేక సాహిత్యం దోహదపడిందా అనే చిరకాల చర్చను గుర్తుకు తెస్తుంది.
ముళ్ళపూడి వారి మాటలు తూటాలే . సినిమాలో చాలా డైలాగులు ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే . నాగభూషణాన్ని ఏడిపించే గుమ్మడి కాయ ప్రహసనం సరదాగా ఉంటుంది . చాలా గ్రామాల్లో ఆరోజుల్లో పాఠశాలలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు.
విజయనిర్మలకు ANR సరసన హీరోయిన్ గా చక్కని పాత్ర . తల్లిగా శాంతకుమారి పాత్ర , ఆమె నటన చాలా గొప్పగా ఉంటుంది. నాగభూషణం , అల్లు రామలింగయ్య , రుక్మిణి , సూర్యకాంతం, గుమ్మడి , కృష్ణంరాజు, సంధ్యారాణి, భానుప్రకాష్ , పద్మనాభం ప్రభృతులు నటించారు.
ఈ సినిమాలో మరో హైలైట్ మాధవయ్య కృష్ణునితో తాదాత్మ్యత చెందుతూ కబుర్లు చెప్పటం . ANR , శోభన్ బాబుల చేత బాపు ఎంత బాగా నటింపచేసారంటే మనమే కృష్ణుడితో మాట్లాడుతున్నామా అని అనిపిస్తుంది. సూపర్బ్ సన్నివేశాలు. నిత్యం పూజించుకునే దైవానికి దూరం చేసినప్పుడు మాధవయ్య పాత్రలో ANR నటన మరచిపోలేనిది.
షూటింగ్ ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లో లోని ర్యాలీ, వెలిచేరు ప్రాంతాలలో జరిపారు. సాక్షి కూడా ఈ ప్రాంతంలోనే తీసారట . స్టూడియోలలో కృత్రిమ సెట్టింగులలో సినిమా తీయడమంటే బాపు గారిని చీకటి కొట్లో బంధించినట్లే. ఆయన్ని ప్రకృతికి వదిలేస్తే , స్వేఛ్ఛగా హాయిగా మనస్ఫూర్తిగా సినిమా తీసుకుంటారు. ఈ సినిమా 1975 లో తమిళంలోకి , 1994 లో హిందీ లోకి రీమేక్ అయింది.
మా నరసరావుపేటలో నాగూర్వలి టాకీసులో అడింది . ఓ అయిదారు సార్లు చూసి ఉంటానేమో ! టి విలో అయితే లెక్కే లేదు . వచ్చిన ప్రతి సారీ కాసేపయినా చూడాల్సిందే . అంత ఇష్టమైన సినిమా నాకు . ఈ సినిమాతో నాకు మరో బంధం కూడా ఉంది . ఈ సినిమాలో ANR సైకిల్ లాగానే నా సైకిల్ కూడా యమా షోగ్గా , సోగ్గా ఉండేది . రెండు బెల్లులు , హార్న్ , పిల్లలు కూర్చునే సీటు , హబ్బో అన్నీ ఉండేవి .
నా సైకిల్ని బుధ్ధిమంతుడు సైకిల్ అని పిలిచే వారు . అదీ మా బంధం.. యూట్యూబులో ఉంది . ఈ తరంలో చూడని పిల్లకాయలు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . ఇలాంటి క్లాస్ & మాస్ కళాఖండం చూడకపోతే ఎలా !? Hats off to Bapu , the Romantic – Theistic – Nature Director .