నిరసనలకు మూగ సాక్షి !!

Sharing is Caring...

Gandhi Statue ……………………………….

పార్లమెంట్ వెలుపల జరిగే నిరసనలకు .. ధర్నాలకు పై ఫోటోలో కనిపించే గాంధీ విగ్రహం మూగ సాక్షి. దాదాపుగా ప్రతి సెషన్ లో విపక్ష సభ్యులు ఈ విగ్రహం ముందే నిలబడో లేదా కూర్చుని నిరసనలు ప్రకటించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ నిరసన ప్రకటించినవారే. 1993 నుంచి గాంధీ మహాత్ముడు ఈ నిరసనలకు సాక్షీ భూతంగా నిలిచారు.

ఈ 16 అడుగుల జాతిపిత కాంస్య విగ్రహాన్ని1993 లో అక్టోబర్ 2న  అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆవిష్కరించారు. రాజ్యసభ వెబ్‌సైట్ ప్రకారం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విగ్రహాన్ని విరాళంగా అందించింది. పార్లమెంటు హౌస్‌కి వచ్చే వేలమంది సందర్శకులు ఈ విగ్రహం ముందు నిలబడి ఫోటోలు దిగుతుంటారు. ధ్యాన భంగిమలో ఉన్న ఈ మహాత్మా గాంధీ విగ్రహన్ని ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహ రూప శిల్పి కూడా ఈయనే. తొలుత ఇండియా గేట్ దగ్గర ఈ గాంధీ విగ్రహాన్నిపెట్టాలనుకున్నారు. 1960 దశకంలో కింగ్ జార్జ్ V విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో పెట్టాలని భావించినపుడు  పలువురు నాయకులు ..గాంధేయవాదులు వ్యతిరేకించారు. తర్వాత పార్లమెంట్ ముందు ప్రతిష్టించారు. అపుడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. 1965 నుంచి ఢిల్లీ లో గాంధీ విగ్రహం ప్రతిష్టించాలని వివిధ ప్రభుత్వాలు భావించగా ఎట్టకేలకు 1993 నాటికి సాధ్యమైంది.

ఇదే పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 50 మంది విగ్రహాలు/ప్రతిమలు వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత  ఎన్టీరామారావు విగ్రహం ఈ కాంప్లెక్స్ లో కొన్నేళ్ల క్రితం నెలకొల్పారు. కాగా పద్మాసన భంగిమలో కూర్చున్న మహాత్ముడు దాదాపు మూడు దశాబ్దాలుగా పార్లమెంటులో జరిగిన చర్చలకు … బయట జరిగిన నిరసనలు .. నినాదాలకు మూగ సాక్షి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగిన కార్యక్రమాలను రికార్డు చేసి ఉంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి.

ఈ విగ్రహం ముందు రాహుల్ గాంధీ తన తొలి నిరసనను ప్రకటించారు. అప్పట్లో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, కుల్దీప్ బిష్ణోయ్, సచిన్ పైలట్, అజయ్ మాకెన్ వంటి నేతలు రాహుల్ పక్కనే ఉండేవారు.  ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా  ఆంధ్రా ఎంపీలు,తెలంగాణ ఎంపీలు ఇక్కడ నుంచే ప్రెస్ మీట్లు పెట్టారు. నిరసన వ్యక్తం చేశారు. 2018 బడ్జెట్ సెషన్‌లో ఈ విగ్రహం ముందు తెలుగు వాడైన టీడీపీ ఎంపీ శివప్రసాద్ వివిధ గెటప్పులో ఫోజులిచ్చి నిరసన ప్రకటించారు.

కేంద్రప్రభుత్వం ఏపీ కి  ప్రత్యేక హోదా ఇవ్వలేదని శివప్రసాద్ ఒక రోజు హిట్లర్ వేషంలో .. మరోరోజు నారదుడి వేషంలో .. అలా రోజుకొక వేషంలో వచ్చి వినూత్నతరహాలో నిరసన ప్రకటించారు. మరో సందర్భంలో తృణమూల్ సభ్యులు మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంట్ భవనం పూర్తి అయిన తర్వాత ఈ విగ్రహన్నికూడా అక్కడికి తరలిస్తారు. ఇదే విగ్రహాన్ని పోలిన విగ్రహాలు ఒకటి గుజరాత్‌లో, మరొకటి హైదరాబాద్‌లో ఉన్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!